Tuesday, November 26, 2024
Homeఓపన్ పేజ్Rail safety: రైలు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం

Rail safety: రైలు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం

సౌకర్యాల కంటే ముందు భద్రతకే అగ్రతాంబూలం ఇవ్వాలి

రైల్వేలను ఆధునీకరించడం స్వాగతించవలసిన విషయమే కానీ, రైలు ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వడం అంతకంటే ప్రధాన విషయం. సాధారణంగా పురోగతికి సంబంధించి రైల్వేలు ఒక ముందుకు వేసినప్పుడల్లా రెండు అడుగులు వెనక్కు వేయడమన్నది పరిపాటి అయిపోయింది. ఎప్పుడు ఆధునికీకరణ ప్రయత్నాలు చేపట్టినా, ఏదో ఒక అడ్డంకి వచ్చి పడుతూ ఉంటుంది. కొన్ని వాస్తవాలు అనుభవానికి వస్తుంటాయి. ఇటీవలి నార్త్‌ ఈస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ దుర్ఘటన కూడా ఇదే విషయాన్ని మరోసారి రైల్వేల దృష్టికి తీసుకు వచ్చింది. గువాహతి వెడుతున్న ఈ రైలు బీహార్‌లోని బక్సర్‌ జిల్లాలో ఉన్న రఘునాథపూర్‌లో పట్టాలు తప్పింది. ఈ దుర్ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా70 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడి ఆస్పత్రులపాలయ్యారు. సరిగ్గా నాలుగు నెలల క్రితం బాలాసోర్‌లో రైలు దుర్ఘటన జరిగి 296 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మొత్తం మీద ఈ దుర్ఘటనలు రైల్వే భద్రత గురించి హెచ్చరిక సంకేతాలిస్తున్నాయి.
గత అయిదేళ్ల కాలంలో దేశవ్యాప్తంగా 219 రైలు ప్రమాదాలు జరిగాయి. ఇందులో ఒక్క 2022-23లోనే 48 దుర్ఘటనలు చోటు చేసుకున్నాయి. ఇటీవలి కాలంలో జరిగిన అతి ఘోరమైన దుర్ఘటన బాలాసోర్‌ రైలు ప్రమాదమే. రాత్రికి రాత్రి పరిస్థితులు చక్కబడాలని ఆశించడం దురాశే అవుతుంది. భద్రతా లోపాలు వేళ్లు పాదుకుపోయాయి. బక్సర్‌ దుర్ఘటనతో ఇది అర్థమైపోయింది. మొదటి అంతర్గత విచారణలో, ఈ రైలు ప్రమాదం పట్టాలు సరిగ్గా లేనందువల్లే జరిగిందని తేల్చి చెప్పింది. ఇందుకు పూర్తి బాధ్యత ఇంజనీరింగ్‌ విభాగానిదేనని కూడా తేల్చి చెప్పింది. నిజానికి గత ఏడాదే కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ ఈ విషయాన్ని లేవనెత్తారు. పునరుద్ధరణ పనులు వెనకపట్టు పట్టిన ఎనిమిది జోన్ల గురించి ఇది మదింపు చేసింది. సాధారణంగా మరమ్మతు పనులకు రాష్ట్రీయ రైల్వే సురక్షక్‌ కోశ్‌ నుంచి నిధులు విడుదల అవుతుంటాయి. 2018-19 సంవత్సరాలలో ఈ కోశ్‌ నుంచి రూ.9,607 కోట్లు విడుదల కాగా, 2019-20 సంవత్సరానికి అది రూ.7,417 కోట్లకు తగ్గిపోయింది. విచిత్రమేమిటంటే, మంజూరు చేసిన నిధులను కూడా పూర్తిగా ఉపయోగించ లేదు. రైలు పట్టాలను పునరుద్ధరించకపోవడం వల్లే అధిక శాతం ప్రమాదాలు జరిగాయని ఈ ఆడిట్‌ తేల్చి చెప్పింది. సరిగ్గా తనిఖీలు జరగకపోవడం, నివేదికలు సమర్పించకపోవడం వంటివి కూడా ఎక్కువగానే జరుగుతున్నాయి.
నిజానికి రైలు ప్రమాదాలు గణనీయంగా తగ్గిపోయాయని రైల్వే మంత్రిత్వ శాఖ ఇటీవల తెలియజేసింది. 2000-01 సంవత్సరాలలో 471 ప్రమాదాలు జరగగా, 2018-19 నాటికి అది 48కి తగ్గిపోయిందని కూడా రైల్వే శాఖ తెలిపింది.అయితే, రైల్వే శాఖ వెల్లడిస్తున్న సంఖ్యకు, రైలు ప్రమాదాల వాస్తవ సంఖ్యకు ఎక్కడా పొంతన కుదరడం లేదు. దేశంలో 508 రైల్వే స్టేషన్లను మరింతగా అభివృద్ధి చేయడానికి ప్రధానమంత్రి రూ.24,470 కోట్లతో ఒక బృహత్‌ ప్రణాళికను ప్రకటించడం జరిగింది.కొత్త వందే భారత్‌ రైళ్ల మీద రైల్వే మంత్రిత్వ శాఖ ఇప్పటికే రూ. 1343 కోట్లు ఖర్చు చేసింది.కొత్తగా 34 వందే భారత్‌ రైళ్లను ప్రారంభించింది.రైలు ప్రయాణికులకు సౌకర్యాలకు ఉద్దేశించిన ఈ ప్రయత్నాలన్నీ హర్షించదగినవే. కానీ, భద్రతా లోపాల కారణంగా ప్రయాణికులు మరణించడం, ఆస్తులు దెబ్బతినడం వంటివి సంభవిస్తున్నప్పుడు ఎంతగా సౌకర్యాలు పెంచినా అవి నిష్ఫలమే అవుతాయి.
ఈ ఏడాది రైల్వేలకు కనీ వినీ ఎరుగని విధంగా దాదాపు రూ. 2.5 లక్షల కోట్లు బడ్జెట్‌లో కేటాయించారు. అయితే, ఏ ఆధునికీకరణ పథకాన్ని చేపట్టినా భద్రతకు అగ్ర ప్రాధాన్యం ఇవ్వడం అనేది ఆ పథకానికి కీలకం కావాలి. ప్రపంచంలో నాలుగవ అతి పెద్ద రైల్వే నెట్‌వర్క్‌గా పేరుండి, బులెట్‌ ట్రైన్లను ప్రవేశపెట్టాలనే ఆలోచనలో కూడా ఉన్న దేశం ప్రయాణికుల భద్రతను ఏమాత్రం విస్మరించ కూడదు. ప్రయాణికుల భద్రతను పెంచకుండా సౌకర్యాలు పెంచడం వల్ల రైల్వే ప్రతిష్ఠ బాగా దెబ్బతింటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News