My Second Wife Restaurant : కారణాలు ఏవైనా కానీ ఇటీవల కాలంలో రెండో వివాహం చేసుకుంటున్న వారి సంఖ్య పెరుగుతుంది. అది పురుషులు కావొచ్చు లేదంటే మహిళలు కావొచ్చు. ఏదీ ఏమైనప్పటికీ ఇలాంటి వారి కోసం ఇప్పటి వరకు ఎవరూ ఏమీ చేయలేదు. అయితే ఓ వ్యక్తి మాత్రం వీరికి ఏదో చేయాలని బావించాడు. రెండో పెళ్లి చేసుకున్న వారు తన హోటల్ కు వస్తే బిల్లులో పెద్ద మొత్తంలో రాయితీ ఇస్తున్నాడు. అయితే.. ఇదీ మన తెలుగు రాష్ట్రాల్లో కాదులెండి. బీహార్ రాష్ట్రంలో.
బీహార్‌కు చెందిన రంజిత్ కుమార్ అనే వ్యక్తి పట్నాకు 70 కిలోమీటర్ల దూరంలోని బాడ్ అనే పట్టణంలో ఓ హోటల్ పెట్టుకున్నాడు. ఈ హోటల్‌కు ‘మై సెకండ్ వైఫ్ రెస్టారెంట్’ అని పేరు పెట్టాడు. కస్టమర్లను ఆకర్షించడానికి ఇలా విచిత్రమైన పేరు పెట్టాడు అని అనుకుంటే మీరు పప్పులో కాలు వేసినట్లే. ఇందుకు ఓ ప్రత్యేక కారణం ఉందని అంటున్నాడు. తన భార్య ఇంటి దగ్గర ఉంటుందని, తాను ఎక్కువ సమయం హోటల్‌లో నే ఉంటున్నానని, హోటల్ తనకు రెండో భార్య వంటిది అని అందుకునే హోటల్ ఈ పేరు పెట్టినట్లు చెప్పాడు. ఇక ఈ రెండు అంటే తనకు ఎంతో ఇష్టమని అంటున్నాడు. అయితే.. ఈ పేరు పెట్టాలనే ఆలోచనను తన భార్యతో పాటు కుటుంబ సభ్యులకు చెప్పినప్పుడు వ్యతిరేకించారని తెలిపాడు.
ఈ హోటల్‌లో టీ బర్గర్లు నూడుల్స్ వంటి ఆహార పదార్థాలు ఉంటాయని, ఎండాకాలంలో ఐస్‌క్రీమ్‌లు కూడా ఉంటాయని చెప్పుకొచ్చాడు. ఇక పేరుకు తగ్గట్లుగానే రెండో పెళ్లి చేసుకున్న వారు తన హోటల్‌కు వస్తే స్పెషల్ డిస్కౌంట్లు ఇస్తున్నట్లు చెప్పాడు. అయితే.. హోటల్‌కు వచ్చే కస్టమర్లలో ఎవరు రెండో పెళ్లి చేసుకున్నారు అనేది తెలుసుకోవడం కాస్త కష్టమే అయినప్పటికి తెలిస్తే మాత్రం ఖచ్చితంగా డిస్కౌంట్ ఇస్తా అని రంజిత్ చెప్పాడు. ఈ హోటల్ పేరుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి