Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Honest and efficient officers the only hope: అధికారులపై ఆశలు

Honest and efficient officers the only hope: అధికారులపై ఆశలు

దేశంలో ఇలాంటి ఉన్నతాధికారులకు కొదవేం లేదు

అత్యధిక సంఖ్యాక రాజకీయ నాయకులు అవినీతికే అంకితం అవుతున్న విషయం అనుభవపూర్వకంగా అర్థం అవుతుండడంతో దేశ ప్రజలు ఎక్కువగా ఇప్పుడు అధికారుల నిజాయతీ మీదే నమ్మకం పెట్టుకుని ఉన్నట్టు కనిపిస్తోంది. సాధారణ అవినీతి స్థాయిని దాటి ప్రస్తుతం పాలకులు కుంభకోణాల్లో ముణిగితేలుతున్నారు. పాతతరం నాయకుల్లో పెరుగుతున్న అవినీతికి, కొత్త తరం అధికారుల్లో పెరుగుతున్న నిజాయతీకి దర్పణం పట్టే సంఘటనలు ఇటీవలి కాలంలో దేశంలో కొన్ని చోటుచేసుకోవడం ఇందుకు ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో కుంభకోణాలు, భారీ అవినీతి కార్యకలాపాలు వెల్లువెత్తుతున్నాయి. అందులోనూ భూ సంబంధిత కుంభకోణాలు మరింతగా విజృంభిస్తున్నాయి. అనేక రాష్ట్రాలలో కబ్జాలు హద్దులు దాటుతున్నాయి. ఇటువంటి ఉదాహరణలను అనేకం ఉటంకిస్తూ పుణే మాజీ పోలీస్‌ కమిషనర్‌ మీరాన్‌ బోర్వాంకర్‌ ఇటీవల ‘మేడమ్‌ కమిషనర్‌’ పేరుతో ఒక గ్రంథాన్ని ఆవిష్కరించారు. పుణే నగరం నడిబొడ్డున ఉన్న మూడెకరాల స్థలాన్ని తమకు చెందిన ఒక బిల్డర్‌కు అతి తక్కువ ధరకు ఇవ్వాలంటూ 2010లో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న అజిత్‌ పవార్‌ ఆమెను ఆదేశించారట. ఆమె ఔననో కాదనో చెప్పకపోయేసరికి అజిత్‌ పవార్‌ ఆమెను తన కార్యాలయానికి పిలిచి, ఈ విషయాన్ని మరోసారి ఆమెకు గుర్తుచేశారు. ఆమె ఎంతో సున్నితంగా ఈ వ్యవహారాన్ని తిరస్కరించారు. పవార్‌ ఆమె మాటను లెక్కచేయలేదు. పైగా అనేక విధాలుగా ఆమెపై ఒత్తిడి తీసుకువచ్చారు.
ఆమె ఆయన దౌర్జన్యానికి, ఒత్తిడికి కొద్దిగా కూడా లొంగలేదు. పుణేలోని యరవాడలో ఉన్న ఈ మూడెకరాల స్థలాన్ని ప్రభుత్వం ఇదివరకే పోలీసుల గృహ నిర్మాణ పథకానికి, కార్యాలయ విస్తరణకు కేటాయించిందని, దీన్ని ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇతర కార్యకలాపాలకు బదలాయించే ప్రసక్తి లేదని ఆమె నిర్మొహమాటంగా చెప్పేశారు. ఊహించినట్టుగానే ఉప ముఖ్యమంత్రి తనపై వచ్చిన ఆరోపణను తీవ్రంగా ఖండించారు. కానీ, మీరాన్‌ బోర్వాంకర్‌ను వేధించడం మాత్రం మానలేదు. ఆమెను ప్రాధాన్యం లేని పదవుల్లో నియమించడం, ప్రమోషన్లు ఆలస్యం చేయడం వంటివి జరుగుతూ వచ్చాయి. సాధారణంగా అధికారులంతా (బ్యురోక్రాట్లంతా) పాలకుల అడుగులకు మడుగులు ఒత్తుతూ ఉంటారని చాలామంది అభిప్రాయపడుతుంటారు. అయితే, చాలామంది అధికారులకు ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే ముఖ్యమని బోర్వాంకర్‌ వంటి అధికారులు నిరూపించారు. దేశవ్యాప్తంగా, దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ ఇటువంటి అధికారులు ఉన్నారని ఆమె తన గ్రంథంలో సోదాహరణంగా తెలియజేశారు.
ఇటువంటి అధికారులు మనసా వాచా కర్మణా ప్రజలకు మాత్రమే విధేయులుగా ఉంటారు. తాము నమ్ముకున్న విలువలతో ఏమాత్రం రాజీపడరు. 1990-96 మధ్య చీఫ్‌ ఎలక్షన్‌ కమిషనర్‌గా పనిచేసిన ఐ.ఏ.ఎస్‌ అధికారి టి.ఎన్‌. శేషన్‌ ఏనాడూ రాజకీయ పార్టీలను, ఆ పార్టీల నేతలను తమ విధి నిర్వహణలో జోక్యం చేసుకోనివ్వ లేదు. ఆ కారణంగానే అప్పట్లో స్వేచ్ఛగా, శాంతియుతంగా ఎన్నికలు జరిగాయి. ఆయనకు ఉద్వాసన చెప్పడానికి ఎందరో నాయకులు శతవిధాలా ప్రయత్నించారు కానీ, అది వారి వల్ల సాధ్యం కాలేదు. నిజాయతీ కలిగిన అధికారులకు ఆయన ఇప్పుడు ఒక ఆరాధ్య దైవంగా మారిపోయారు. హర్యానా కేడర్‌కు చెందిన అశోక్‌ ఖేంకా అనే ఐ.ఎ.ఎస్‌ అధికారి కూడా నిజాయతీకి మారుపేరుగా గుర్తింపు పొందారు. గుర్గామ్‌లో రాబర్ట్‌ వాద్రాకు సంబంధించిన ఒక భూమి విషయంలో ఆయనపై సోనియా గాంధీ నుంచి, ఇతర కాంగ్రెస్‌ నాయకులు, మంత్రుల నుంచి ఎంత ఒత్తిడి వచ్చినప్పటికీ ఆయన ఆ భూమిని వాద్రాకు అప్పగించలేదు. దాంతో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆయనను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. ఆయన కెరీర్‌లో ఆయనకు 55 బదిలీలు అయ్యాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.
దేశ సివిల్‌ సర్వీసుల్లో ఐ.ఎ.ఎస్‌, ఐ.పి.ఎస్‌ అధికారులు కీలకమైన వ్యక్తులు. ఎన్నో పోటీలకు, వడపోతలకు తట్టుకుని వాళ్లు ఈ సర్వీసుల్లో చేరడం జరుగుతుంది. ఎటువంటి పక్షపాతమూ లేకుండా వారు ప్రభుత్వ విధానాలను, కార్యక్రమాలను అమలు చేయాల్సి ఉంటుంది. పాలకులు, పార్టీల నాయకుల ఒత్తిడికి లొంగకుండా కేవలం ప్రజాసేవే పరమ ధర్మంగా వారు పనిచేయాల్సి ఉంటుంది. ఇది కత్తి మీద సామేననడంలో సందేహం లేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 311(2) వారికి ఎంతగానో భద్రత కల్పిస్తోంది. మధ్య మధ్య రాజకీయ అవకాశ వాదానిది పైచేయి కావడం వల్ల ఈ సివిల్‌ సర్వీస్‌ అధికారులలో కూడా విలువలు దిగజారడం కనిపిస్తూ ఉంటుంది. అయినప్పటికీ శేషన్‌, ఖేంకా, బోర్వాంకర్‌ వంటి అధికారుల కారణంగా పాలకుల ఆటలు కట్టడం, ప్రజలకు సరైన సేవలు అందుతుండడం జరుగుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News