Friday, September 20, 2024
Homeఓపన్ పేజ్Vidwan Visvam: జర్నలిస్టులకు ఆదర్శం విద్వాన్‌ విశ్వం

Vidwan Visvam: జర్నలిస్టులకు ఆదర్శం విద్వాన్‌ విశ్వం

విద్వాన్ విశ్వం జయంతి నేడే

రాజకీయం, సాహిత్యం, పత్రికా రచనల మూర్తిమంతం విద్వాన్‌ విశ్వం. తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి వంటి వామపక్ష రాజకీయ వాదుల సాహచర్యంతో కమ్యూనిస్టుగా తన రాజకీయ జీవితం ఆరంభించిన స్వాతంత్య్ర సమరయోధుడు విశ్వం. సంస్కృతం, ఆంగ్లం, తెలుగు భాషల్లో పండితులు. చిలుకూరి నారాయణరావు వంటి భాషా శాస్త్రజ్ఞుల శిష్యులుగా మద్రాసులో విద్వాన్‌ విశ్వం అయ్యారు. ఉన్నత విద్యాభ్యాసం కోసం బెనారస్‌ వెళ్ళిన విశ్వానికి మదన మోహన మాలవ్యా లాంటి ప్రముఖుల ప్రశంసలకు పాత్రుడైనాడు. బళ్ళారిలో ‘ఆకాశవాణి’ రహస్య పత్రికను నడిపినందుకు జైలు శిక్ష అనుభవించారు. మీజాన్‌, ప్రజాశక్తి, ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికల్లో వివిధ హోదాల్లో పనిచేశాడు.
1915, అక్టోబర్‌ 21న అనంతపురం జిల్లాలో తరిమెల గ్రామంలో ఒక విశ్వ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. ఆయన పూర్తి పేరు మీసరగండ విశ్వరూపాచారి. విశ్వం స్వగ్రామంలో చిన్న తనంలో రామాయణం శంకర శాస్త్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నాడు. సంప్రదాయ పద్ధతిలో కర్నూలు, ప్రొద్దుటూరులలో సంస్కృత కావ్య నాటక అలంకారాలను, తర్క శాస్త్రాన్ని ఆభ్యసించాడు. మద్రాసు విశ్వ విద్యాలయం నుండి సంస్కృతంలో, ఆంధ్రంలోనూ విద్వాన్‌ పట్టా పుచ్చుకున్నాడు. అనంతపురంలో చిలుకూరు నారాయణ రావు వద్ద శిష్యరికం చేశాడు. కాశీ విశ్వ విద్యాలయంలో పరిశోధన చేస్తూ అనారోగ్యం వలన పూర్తి చేయలేకపోయాడు. కాశీ నుండి అనంతపురం తిరిగి రాగానే తరిమెల నాగిరెడ్డితో కలిసి రాజకీయ కార్యకలాపాలు ప్రారంభించాడు. ప్రజలను చైతన్య పరచటానికి గ్రంథ ప్రచురణ అవసరమని భావించి నవ్య సాహిత్యమాల అనే ప్రచురణ సంస్థ ఏర్పాటు చేసి నవ్యసాహితి అనే పత్రికకు సంపాదకత్వం వహించాడు. ఫాసిజం మొదలైన అంశాలపై పుస్తకాలను ప్రచురించాడు. దానితో బ్రిటీషు ప్రభుత్వం రాజద్రోహం క్రింద తరిమెల నాగిరెడ్డిని, విద్వాన్‌ విశాన్ని అరెస్టు చేసి మొదట బళ్ళారిలోని అల్లీపూర్‌ జైల్లోనూ ఆ తర్వాత తిరుచిరాపల్లి జైలులోనూ నిర్భందించింది. తిరుచిరాపల్లి జైలులో విశ్వం బెజవాడ గోపాలరెడ్డి వద్ద బెంగాలీ నేర్చుకున్నాడు. ఈ జైలులో రాజాజీ, టంగుటూరి ప్రకాశం వంటి నాయకుల సాహచర్యం లభిం చింది. ఈయన అనంతపురం జిల్లా కాంగ్రెస్‌ కమిటీ కార్యదర్శిగా, రాయలసీమ కాంగ్రెస్‌ కమిటీ కార్యాలయ కార్యదర్శిగా, అనంత పురం జిల్లా జాతీయ సభకు, జిల్లా లోక జన సంఘానికి, మండల క్షామ నివారణ సభకు, జిల్లా ఆంధ్ర మహాసభకు ప్రధాన కార్య దర్శిగా, జిల్లా రైతు మహాసభకు ఉపాధ్యక్షుడుగా పనిచేశాడు. ఉద్య మం, ఉపన్యాసం మాత్రమే కాకుండా మరింత లోతుగా రాజకీ యాలు శాస్త్ర పద్ధతిలో వివరించడానికి పత్రికారంగం వైపు దృష్టి సారించాడు. అడవి బాపిరాజు ఆహ్వానించడంతో మీజాన్‌ పత్రికలో 1945లో అసిస్టెంట్‌ ఎడిటర్‌గా చేరి కొంతకాలం పనిచేశాడు. తరు వాత విజయవాడలో ప్రజాశక్తి దినపత్రికలో అసిస్టెంట్‌ ఎడిటర్‌గా సుమారు మూడు సంవత్సరాలు పనిచేశాడు. ‘మీజాన్‌’ పత్రికలో రచనా వ్యాసంగం, ‘ప్రజాశక్తి’లో సంపాదకత్వం పాండితీ భాషలోనే సులభ శైలిని సాధించ గలిగినా, పరిపాలనా యంత్రాంగపు నిర్భం ధాలకు గురయ్యాడు. తర్వాత మద్రాసుకు తరలి వెళ్ళి అక్కడ బాల భారత్‌ విద్యాలయంలో సంపాదకుడిగా కొన్నాళ్ళు పనిచేశాడు. 1952 ఆగష్టు 15న ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక ప్రారంభమైనపుడు దానిలో ఎడిటర్‌ ఇన్‌చార్జ్‌గా చేరి 1959 వరకు పనిచేశాడు. 1959లో ఆంధ్రపత్రిక దినపత్రికలో అసిస్టెంట్‌ ఎడిటర్‌గా కొంతకాలం పనిచేసి 1960లో విజయవాడకు వచ్చి ఆంధ్రజ్యోతి దినపత్రికలో అసోసి యేట్‌ ఎడిటర్‌గా పని చేశాడు. మళ్ళీ 1963లో ఆంధ్రప్రభ దిన పత్రికకు అసోసియేట్‌ ఎడిటర్‌ చేరాడు. 1967లో ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రికకు సంపాదకుడిగా మారాడు. ఆంధ్రప్రభ సచిత్ర వార పత్రికలో పదవీ విరమణ చేసిన తరువాత 1981నుండి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణల విభాగానికి ప్రధాన సంపాదకునిగా వ్యవహరించాడు. ఈ సమయంలో విశ్వం కథా సరిత్సాగరాన్ని 12 సంపుటాలుగా తెనుగించాడు. ‘చందమామ’లో ద్విపద కావ్యం రూపంలో వ్రాసిన పంచతంత్ర కథలను బాపు బొమ్మలతో తి.తి.దే. ప్రచురణగా వెలువరించాడు. బ్రహ్మసూత్రాలు శంకరభాష్యం నాలుగు సంపుటాలను, అధర్వణ వేదాన్ని అనువాదం చేసి ప్రచురించాడు. శ్రీసాధన పత్రిక 1938-1939లో ‘విశ్వభావన’, ఆంధ్రప్రభ వార పత్రిక 1952-1959లో తెలుపు – నలుపు, ఆంధ్రపత్రిక దినపత్రిక 1958-1959లో ‘అవీ – ఇవీ’; ఆంధ్రజ్యోతి దినపత్రిక 1960-1962లో ‘ఇవ్వాళ’, ఆంధ్రజ్యోతి దినపత్రికలో టీకా-టిప్పణి, ఆంధ్ర ప్రభ దినపత్రిక 1962-1966, ఆంధ్రప్రభ వారపత్రిక 1967-1987లో మాణిక్య వీణ తదితర శీర్షికలను నిర్వహించారు. 1987 అక్టోబర్‌ 19వతేదీన తుది శ్వాస వదిలాడు. పత్రికారంగంలో ఉన్నత విలువలు నిలబెట్టిన విశిష్ట పాత్రికేయులుగా నేటి తరం పాత్రికేయులకు విద్వాన్‌ విశ్వం ఆదర్శప్రాయుడు.
విశ్వం గురించి ప్రముఖుల అభిప్రాయాలు
దాశరథి మనస్సు విప్పి మాట్లాడి సాటి రచయితలను తన వాళ్ళుగా భావించి సాటివారి శ్రేయస్సుని కోరేవారు అరుదు. ఆ సద్గుణం మేము విశ్వంగారిలో చూశాము. డాక్టర్‌ సి.నా.రె…కన్నీటి సుడులెన్నో కూర్చి ‘పెన్నేటి పాట’గా తీర్చి రాళ్ళలో మేల్కొల్పినావు రసదిగ్ధ భావామృతార్చి ‘మాణిక్యవీణ’పై నీవు మత్యంగుళులు సాచినావు పదునైన లోకవృత్తాలు అదునెరిగి పలికించినావు!
మిక్కిలినేని…. విశ్వం నిండుకుండ. తొణకరు, బెణకరు. భావాల్లో అతివాది. మాటల్లో మితవాది. నిగర్వి. మందహాసంతో అందర్నీ హుందాగా పలకరించే విశాలతత్వం. మెరమెచ్చుల కోసం ఎవర్నీ ఆకాశానికెత్తి పొగడరు. తాను నమ్మిన సత్యాన్ని నమ్రతగా అందలమెక్కిస్తారు.

  • రామ కిష్టయ్య సంగన భట్ల
    9440595494
    (నేడు విద్వాన్‌ విశ్వం వర్ధంతి)
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News