మెరిసే ముఖానికి వంటింటి మాస్కులు…
చర్మం కాంతివంతంగా కనిపించాలంటే ఇంటి చిట్కాలు కొన్ని ఉన్నాయి. వాటిని క్రమం తప్పకుండా పాటిస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.
కొబ్బరినూనె, తేనె మిశ్రమం చర్మంపై పూస్తే స్కిన్ కాంతివంతంగా తయారవుతుంది. తేనెలో ఉండే హైడ్రాక్సిల్ యాసిడ్, ఇతర ఎంజైములు చర్మం మీద మొటిమల వల్ల ఏర్పడిన మచ్చలను తొలగిస్తాయి. స్కిన్ టోన్ ను పరిరక్షిస్తాయి. చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. కొబ్బరి నూనెలోని యాంటాక్సిడెంటు గుణాలు, యాంటి బాక్టీరియల్ గుణాలు చర్మం ముడతలు పడకుండా సంరక్షిస్తాయి. వయసు ప్రభావం చర్మం మీద పడకుండా చూస్తాయి. ఫలితంగా స్కిన్ టెక్చ్సెర్ బాగా మెరుగుపడుతుంది.
ఇందుకు ఒక గిన్నె తీసుకుని అందులో టేబుల్ స్పూన్ కొబ్బరినూనె, టేబుల్ స్పూన్ తేనె పోసి రెండింటినీ బాగా కలపాలి. ఆ పేస్టును ముఖానికి అప్లై చేసుకుని ఐదు పదినిమిషాలు అలాగే ఉంచుకుని ఆ తర్వాత గోరువెచ్చటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ముఖం కాంతివంతంగా తయారవుతుంది.
శెనగపిండి, పాలు, తేనె మిశ్రమం కూడా చర్మాన్ని మెరిసేలా చేస్తుంది. ఈ మూడింటిలో సహజసిద్ధమైన ఎక్స్ ఫొయిలేటింగ్ గుణాలు ఉన్నాయి. ఇవి చర్మ గ్రంధుల నుంచి విడుదలయ్యే నూనెలను క్రమబద్ధీకరిస్తాయి. చర్మ కణాలకు అవసరమైన పోషకాలను అందిస్తాయి. అంతేకాదు చర్మాన్ని హైడ్రేట్ చేసి కావలసినంత మెరుపును మేనుకు ఇస్తాయి. ఒక గిన్నె తీసుకుని అందులో టీస్పూను శెనగపిండి, అరకప్పు పాలు, ఒక చెంచా తేనె తీసుకుని బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పూసుకుని 20 నుంచి 30 నిమిషాలు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత మైల్డ్ సోప్ ను ఉపయోగించి ముఖాన్ని శుభ్రం చేసుకుని గోరువెచ్చని నీటితో కడుక్కోవాలి. ముఖం ప్రకాశవంతమవుతుంది.
కమలాపండు, పసుపు మిశ్రమం కూడా ముఖాన్ని మెరిపిస్తుంది. కమలాపండులో సహజసిద్ధమైన బ్లీచింగ్ గుణాలు ఉండి ముఖాన్ని శుభ్రం చేస్తుంది. దీంతో చర్మం కాంతివంతంగా తయారవుతుంది. కమలాపండుకు పసుపు కలిపి ముఖానికి ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం అందంగా, ఆరోగ్యంగా తయారవుతుంది. ఈ ప్యాక్ ను రాత్రి నిద్రపోయేముందు వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఒక గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ల కమలారసం పోసి అందులో అర టేబుల్ స్పూన్ పసుపుపొడి కలపాలి. ఆ మిశ్రమాన్ని రాత్రి పడుకోబోయేముందు ముఖానికి ఫేస్ మాస్కులా వేసుకోవాలి. మరుసటి రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. ముఖంలోని తేడా ఇట్టే పసిగట్టవచ్చు.
కలబంద, పసుపు, రోజ్ వాటర్ మిశ్రమం కూడా ముఖానికి ఎంతో మెరుపును ఇస్తుంది. గిన్నెలో టీస్పూన్ కలబంద గుజ్జు, రెండు టీస్పూన్ల రోజ్ వాటర్, టీస్పూను పసుపు పొడి వేసి బాగా కలపాలి. చిక్కని పేస్టులా చేసి దాన్ని ముఖానికి అప్లై చేసి 20 నుంచి 25 నిమిషాలు అలాగే ఉంచాలి. తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. బొప్పాయి, పెరుగు మిశ్రమం వల్ల కూడా ముఖం కాంతివంతంగా తయారవుతుంది. బొప్పాయిలో ఉండే పపైన్ అనే ఎంజైమ్ స్కిన్ టోన్ ను మెరుగుపరుస్తుంది. ప్రకాశవంతం చేస్తుంది. ముఖంపై ఉన్న మచ్చలను సైతం చర్మంలో కలిసిపోయేలా చేస్తుంది.
చర్మన్ని మెరిసేలా చేయడంలో పెరుగు ఎంతో బాగా పనిచేస్తుంది. బొప్పాయిని చిన్న ముక్కలుగా చేసి మిక్సీలో వేసి మెత్తగా చేయాలి. అందులో టేబుల్ స్పూను పెరుగు కూడా వేసి ఆ రెండిటీని మెత్తని పేస్టులా గ్రైండ్ చేయాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి మాస్కులా వేసుకుని పది నుంచి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత చల్లని నీటితో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. మీరు కూడా ఇంట్లో ఈ మాస్కులు చేసుకుని ముఖానికి అప్లై చేసుకోండి. అందమైన, మెరిసే చర్మంతో అందరినీ ఆకట్టుకోండి…