ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు పర్యటన నేపథ్యంలో ఎమ్మిగనూరు వైసిపి టికెట్ ప్రస్తావన జగన్ చేస్తారని ఎమ్మిగనూరు వైసిపి శ్రేణులతో పాటు ప్రజలు భావించారు. ఎమ్మిగనూరుకు వచ్చిన జగన్ మోహన్ రెడ్డి టికెట్ విషయం మాట్లాడలేక పోవడంతో ఆశావాహులలో నిరుత్సాహం కలిగించిందని చెప్పవచ్చు. ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డి వయోభారంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని తను స్థానం నా కుమారుడు జగన్ మోహన్ రెడ్డికు టికెట్ ఇవ్వాలని అధిష్టానానికి విజ్ఞప్తి చేశారు. దీంతో తండ్రికి ఇస్తారా లేక తనయుడుకు ఇస్తారా అనే సందేహాలు ఉన్నాయి. దీనికి తోడు వైసిపి నేత, వీర శైవ లింగాయిత్ కార్పొరేషన్ చైర్మన్ వై రుద్ర గౌడ్, మాజీ ఎంపీ బుట్టా రేణుక కూడా ఎమ్మిగనూరు టికెట్ ఆశిస్తున్నారు. సిఎం సభ సందర్భంగా ఫ్లెక్సీల ఏర్పాటులో ఎర్రకోట వర్గీయులు రుద్ర గౌడ్ ఫ్లెక్సీలను కట్టకుండా అడ్డుకున్నారని ప్రచారం జరిగింది. రుద్ర గౌడ్ ను సిఎం సభ వేదిక పైకి రాకుండా ఎర్రకోట చెన్నకేశవ రెడ్డి అడ్డుకుంటారని అనుమానాలు ఉండేవి. అయితే రుద్రగౌడ్ వేదికపై కనిపించారు. జగన్ తో కలిసి ప్రత్యేకంగా రుద్రగౌడ్ ఫోటో దిగారు. బుట్టా రేణుక కూడా వేదికపై కూర్చున్నారు. అలాగే హెలిప్యాడ్ నుండి సిఎం జగన్ వెంట బస్సులో ఎమ్మెల్యే చెన్నకేశవ రెడ్డితో పాటు బుట్టా రేణుక, రుద్రగౌడ్ కూడా వచ్చారు. టికెట్ వ్యవహారంపై జగన్ మాట్లాడకపోవడం ఎమ్మిగనూరులో తీవ్రంగా చర్చ జరుగుతుంది.
ఎమ్మిగనూరు ప్రజలను నిరుత్సాహం కలిగించిన సిఎం పర్యటన
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎమ్మిగనూరు పర్యటన ఎమ్మిగనూరు నియోజకవర్గ ప్రజలను నిరుత్సాహం కలిగించింది. జగనన్న చేదోడు 4వ విడత నగదును బటన్ నొక్కి ఖాతాదారుల అకౌంట్లలలో జగన్ జమ చేశారు. జగన్ ఎమ్మిగనూరుకు వస్తున్నారు అంటే ఇక్కడి రైతులకు ఉపయోగపడే ఆర్డీఎస్ కుడి కాలువ నిర్మాణంకు నిధులు మంజూరు చేస్తానని భావించారు. ఎమ్మిగనూరులో అధికంగా ఉండే చేనేత వర్గాలకు ఉపయోగపడే బనవాసి వద్ద చేనేతలకు టెక్స్ టైల్స్ పార్కుకు ఆమోదం తెలుపుతారనీ అనుకున్నారు. కర్నూలు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటిస్తారని రైతులు భావించారు. అలాగే ప్రభుత్వ పాల్టెక్నిక్ కాలేజీ, ఐటిఐ కాలేజీ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తారేమో అనుకున్నారు. గాజులదిన్నే ప్రాజెక్ట్ కు లిఫ్ట్ ద్వారా గుండ్రెవుల నుండి నీటి పైప్ లైన్ కు నిధులు ఇస్తారని ఆశ పడ్డారు. వీటితో ఎమ్మిగనూరు పట్టణంతో పాటు గ్రామాలలో రోడ్లు డ్రైనేజీకు నిధులు విడుదల ఉంటాయని భావించారు. కానీ అభివృద్ధి మాట లేక కేవలం నవరత్నాలు ద్వారా నగదు జమ చేస్తున్నామని జగన్ చెప్పారు. దీంతో అన్ని వర్గాల ప్రజలు ఆశలు అవిరి అయ్యాయి. ఎమ్మిగనూరుకు హెలికాప్టర్ ద్వారా 9.45 చేరుకున్నారు. అక్కడ నుండి ప్రత్యేక బస్సులో ఆదోని రోడ్డు నుండి లక్ష్మన్ టాకీస్ మీదుగా ఎస్ఎంటి కాలని బస్ స్టాప్ వీవర్స్ కాలని గ్రౌండ్ కు చేరుకున్నారు. అక్కడ జగనన్న చేదోడును ప్రారంభించి ప్రసంగించారు. 11.45 నిమిషాలకు ప్రసంగం ముగించారు. 12 గంటలకు గ్రౌండ్ నుండి బస్సులో బయలుదేరి హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. అక్కడ మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ ఎమ్మెల్యే, మాజీ ఎంపీ, ఎమ్మెల్యే, ఇతర నాయకులతో మాట్లాడారు. దాదాపు 250 మంది ప్రజలతో వినతి పత్రాలు స్వీకరించి వారి సమస్యలు విన్నారు. అనంతరం 3.47 నిమిషాలకు ఎమ్మిగనూరు నుండి ఓర్వకల్ ఎయిర్ పోర్టు కు 4.10 కు చేరుకున్నారు. అక్కడ నుండి గన్నవరంకు బయలదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి పర్యటన ప్రశాంతంగా ముగియడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.