అభినవ నన్నయలా భావించబడి, సంప్రదాయ సాహిత్యానికి అండగా నిలిచి, మహామహోపన్యాసకునిగా పేరొంది అధిక శిష్య సంపదను పొందిన సాహితీ మూర్తి ఆచార్య దివాకర్ల వెంకటావధాని. దివాకర్ల వేంకటావధాని (జూన్ 23, 1911 – అక్టోబరు 21, 1986) పరిశోధకులు, విమర్శకులు.
దివాకర్ల వంశంలో పరీధావి నామ సంవత్సరం, ఆషాఢ పౌర్ణమి నాడు ఆకుతీగపాడు గ్రామంలో అమ్మమ్మ ఇంట్లో జన్మించారు. జన్మనక్షత్రం మూల. హరితస గోత్రుడు. వెలనాటి వైదిక బ్రాహ్మణుడు. కృష్ణ యజుర్వేద శాఖకు చెందినవారు. ఇతని తండ్రి పేరు సుందర రామయ్య, తల్లి పేరు వేంకమ్మ. పశ్చిమ గోదావరి జిల్లా, ఉండి మండలం యండగండి ఆయన స్వగ్రామం. తిరుపతి వేంకట కవులలో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి ఆయన పినతండ్రి. దివాకర్ల వేంకటావధానికి ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్లు. ఆయనే ఇంటికి పెద్ద కొడుకు. బాల్యంలోనే ఇతని ప్రతిభా పాటవాలు వెలుగు చూశాయి. సహజ ధారణాశక్తితో చిన్నప్పుడే తిరుపతి వేంకటకవుల అవధాన పద్యాలను కంఠస్తం చేశారు. ఎనిమిదవ తరగతి చదివే సమయంలోనే ఆయన పద్యాలు భారతి మాసపత్రికలో ప్రచురిత మయ్యాయి. ఇంట్లోనే తన తండ్రి వద్ద సంస్కృతం నేర్చుకున్నారు. రఘువంశం, ఆంధ్రనామ సంగ్రహం చదువుకున్నారు. తన గ్రామం యండగండిలో ఏడవ తరగతి వరకు చదివారు. ఆ తర్వాత ఉండిలో సంస్కృతం ప్రథమ భాషగా, తెలుగు ద్వితీయ భాషగా ఉన్నతపాఠశాల విద్య చదివారు. అనంతరం 1930-31లో బందరు హిందూ కళాశాలలో ఇంటరు చదివారు. ఆ సమయంలో విశ్వనాథ సత్యనారాయణ ఇంట్లో వుంటూ పేదరికం కారణంగా వారాలు చేసి చదువుకున్నారు. విశ్వనాథకు ప్రియ శిష్యుడిగా వుండి అతడి ఏకవీర నవలను చెబుతుండగా దివాకర్ల వేంకటావధాని వ్రాసేవారు. విశ్వనాథ, కొడాలి వెంకట సుబ్బారావుల ప్రోద్బలంతో విశాఖ పట్టణం వెళ్లి ఆంధ్ర విశ్వ విద్యాలయంలో బి.ఏ. (ఆనర్సు) చేరారు. అక్కడ పింగళి లక్ష్మీ కాంతం, మల్లాది సూర్యనారాయణ శాస్త్రి, గంటి జోగి సోమయాజి ఆయనకు గురువులు. పాటిబండ మాధవశర్మ ఆయన సహాధ్యాయి. బి.ఏ. తరువాత ధర్మవరం రామకృష్ణమాచార్యులు గురించి విమర్శావ్యాసం వ్రాసి ఆంధ్ర విశ్వ విద్యాలయం నుండి మొట్ట మొదటి ఎం.ఏ (హానర్సు) పట్టాను పొందారు. తెన్నేటి విశ్వనాథం దగ్గర ఆంగ్లభాషా పరిజ్ఞానం సంపాదించారు. 1942 ప్రాంతాలలో వేదాధ్యయనం మొదలు పెట్టి, మహావుత చయనులు వద్ద నమక చమకాలను, దశశాంతులు మొదలైన వాటిని వల్లె వేశారు. 1957లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఖండవల్లి లక్ష్మీ రంజనం పర్యవేక్షణలో ఆంధ్ర వాఙ్మయారంభ దశ – నన్నయ భారతము అనే విషయంపై పరిశోధన చేసి పి.హెచ్.డి పట్టాను సాధించారు.
1934లో అప్పటి ఆంధ్ర విశ్వ విద్యాలయం ఉప కులపతి డా.సర్వేపల్లి రాధాకృష్ణన్ దివాకర్లను విశాఖ పట్టణంలోని మిసెస్ ఏ.వి.ఎన్.కళాశాలలో తెలుగు పండితుడిగా నియమించారు. తరువాత పదోన్నతి పొంది అదే కళాశాలలో ఉపన్యాసకులుగా పనిచేశారు. ఆంధ్ర విశ్వ విద్యాలయం బోర్డ్ ఆఫ్ స్టడీస్‌కు అధ్యక్షుడిగా నియ మింప బడ్డారు. 1951లో హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆంధ్రోపన్యాసకులుగా చేరారు. 1957లో రీడర్‌గా, 1964లో ప్రొఫెసర్‌గా, తెలుగు శాఖాధ్యక్షులుగా పదోన్నతి పొందారు. 1974-1975ల మధ్యకాలంలో ఎమినెంట్ ప్రొఫెసర్‌గా, 1975 నుండి 1978 వరకు యు.జి.సి.ప్రొఫెసరుగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఆయన పర్యవేక్షణలో 15మంది పి.హెచ్.డి, ఒకరు ఎం.ఫిల్ పట్టాలను పొందారు. దివాకర్ల శిష్యగణంలో ఎం.కులశేఖరరావు, ఇరివెంటి కృష్ణమూర్తి, పి.యశోదా రెడ్డి, సి.నారాయణ రెడ్డి, ముద్దసాని రామిరెడ్డి మొదలైన వారు ఉన్నారు. దివాకర్ల నలభైకి మించి గ్రంథాలను రచించారు. వాటిలో పద్య కృతులు, వచన రచనలు, విమర్శలు, వ్యాఖ్యానాలు, అనువాదాలు, టీకాతాత్పర్యాలు ఉన్నాయి. ఖండవల్లి లక్ష్మీ రంజనంతో కలిసి ఆంధ్ర మహాభారత సంశోధిత ముద్రణకు విపులమైన పీఠిక వ్రాశారు. తెలంగాణలోని మారుమూల గ్రామాలకు పిలవగానే వెళ్లి ఉపన్యాసాల ద్వారా అక్కడి ప్రజలకు తెలుగు భాషాసాహిత్య చైతన్యాన్ని కలిగించారు. అనేక కవిపండితుల గ్రంథాలకు చక్కని పీఠికలను, సమగ్ర సమీక్షలను అందించి వారిని ప్రోత్సహించారు. ఆయనకు అనేక సాహిత్య సంస్థలతో సంబంధం ఉండేది. వాటిలో ఆంధ్ర సారస్వత పరిషత్తు, యువభారతి, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ, కేంద్ర సాహిత్య అకాడమీ, సంస్కృత భాషా ప్రచార సమితి, ఆర్ష విజ్ఞాన సమితి, సురభారతి, కళాస్రవంతి అనేవి కొన్ని. ఆయన ఉపన్యాసాలకు జనం వేలకొలది వచ్చేవారు. వసుచరితము గురించి ఆయన ఉపన్యసిస్తుంటే శ్రోతలు వర్షంలో గొడుగులు పట్టుకుని నిలబడి ఉపన్యాసం విన్నారంటే ఆయన ఉపన్యాస కళ ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. దివాకర్ల సుమారు 15 అవధానములు చేశారు. విద్యార్థిగా ఉన్నపుడు బందరు హిందూ కళాశాలలో మొదటి అవధానం చేశారు. తరువాత ఉండి, మొదటి ప్రపంచ తెలుగు మహాసభలలో (హైద రాబాదు), ఆకాశ వాణిలో, విద్యుత్‌సౌధ (హైదరా బాదు) లో, కాకినాడ తదితర ప్రాంతాలలో అవధానాలు నిర్వహించారు.
కళాప్రపూర్ణ -1977లో విద్యాసనాథ, కవి భూషణ బిరుదములను పొందారు. దివాకర్ల 1986లో భారతీయ విద్యాభవన్ ముంబైవారి చండీ యాగానికి వెళ్ళిన సందర్భంలో అక్కడ జైన్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఆ సందర్భంలో ఆయనకు అధిక రక్తస్రావము జరిగి 1986, అక్టోబరు 21 తేదీన మరణించారు.
- రామ కిష్టయ్య సంగన భట్ల
9440595494
(నేడు దివాకర్ల వేంకటావధాని వర్ధంతి)