Sunday, September 29, 2024
Homeపాలిటిక్స్Padi Kaushik: ఒక్క అవకాశం ఇవ్వండి, ప్రజలకు అండగా ఉంటా

Padi Kaushik: ఒక్క అవకాశం ఇవ్వండి, ప్రజలకు అండగా ఉంటా

ఎవరెన్ని కుట్రలు చేసినా అధికారం మాదే

తెలంగాణ రాష్ట్రంలో నవంబర్ 30న జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో తనను హుజురాబాద్ నియోజకవర్గం నుండి ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని బీఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామంలో శనివారం ఏర్పాటు చేసిన గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు కొండపాక రమేష్ గౌడ్ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి పుష్పగుచ్చం అందజేసి శాలువా కప్పి సాదర స్వాగతం పలికారు.

- Advertisement -

అనంతరం నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ.. కొట్లాడి సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో గత 10 ఏళ్లుగా ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుండడం తెలంగాణ రాష్ట్ర ప్రజలుగా మనందరికీ గర్వకారణం అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా మూడోసారి అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని అన్నారు. గౌడ కులస్తుల సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని అందులో భాగంగానే 51 సంవత్సరం నిండిన గౌడ వృత్తిదారులకు ఆసరా పింఛన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రమాదవశాత్తు తాడిచెట్టు పై నుండి జారిపడి మృతి చెందిన, పూర్తి అంగవైకల్యం చెందిన వారికి రూ, ఐదు లక్షల ఎక్సిగేషన్ అందించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల నుండి 37 వేల కోట్ల రుణమాఫీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. ఇంకా రుణమాఫీ కానీ రైతులకు త్వరలోనే పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయడం జరుగుతుందన్నారు. రైతులు బాగుండాలని 24 గంటల ఉచిత విద్యుత్ తో పాటు రైతు బంధు అందజేస్తున్నారని అన్నారు. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ముందు రూ, 200 ఉన్న ఆసరా పెన్షన్ ప్రస్తుతం రూ,2000 ఇస్తున్నామని మూడోసారి అధికారంలోకి వచ్చాక విడుదలవారీగా రూ. 5000 ఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. బిఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను నియోజకవర్గంలో ప్రతి ఇంటికి వెళ్లే విధంగా ప్రయత్నం చేస్తామన్నారు. సౌభాగ్య లక్ష్మి పథకం ద్వారా ప్రతి మహిళకు రూ,3000 ఇస్తామన్నారు.

కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతుబంధు రైతు బీమా వంటి అనేక పథకాలు అమలు చేసి అందిస్తున్న ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం అని అన్నారు. రైతు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని దశలవారీగా రైతుబంధును ఎకరాకు పదివేల నుంచి రూ 16,000 వరకు పెంచేందుకు, గ్యాస్ సిలిండర్ రూ 400కే అందించేందుకు, ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ,15 లక్షల వరకు ఉచిత వైద్యం అందించేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. కెసిఆర్ బీమా పేరుతో మరో కొత్త పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి ధీమా అనే పథకానికి రూపకల్పన చేసి రూ,5 లక్షల సహాయం అందించనున్నట్లు తెలిపారు. గత ఎమ్మెల్యేకు 20 ఏళ్లు అవకాశం ఇచ్చారని తనకు ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఎన్నికల్లో అభివృద్ధి చేసే బిఆర్ఎస్ పార్టీకి అండగా ఉండి తనను నియోజకవర్గ ప్రజలందరూ తమ తమ కుటుంబ సభ్యుడిగా భావించి, బిడ్డగా ఆదరించి, ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఒప్పించి, మెప్పించి నియోజకవర్గానికి రూ,1000 కోట్లు తీసుకువచ్చి మరో సిద్దిపేట, గజ్వేల్, సిరిసిల్ల లాగా అభివృద్ధి చేసి చూపిస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ పోల్నేని సత్యనారాయణ రావు, గౌడ సంఘం అధ్యక్షుడు కొండపాక రమేష్ గౌడ్, బిఆర్ఎస్ సీనియర్ నాయకుడు నేరెళ్ల శ్రీనివాస్ గౌడ్, సర్పంచ్ మూగల పరుశరాములు, ఉప సర్పంచ్ పోషిని సత్యనారాయణ, గౌడ సంఘం ప్రతినిధులు వొల్లాల చిరంజీవి, శ్రీనివాస్, పల్లెర్ల కొమురయ్య, బొనగాని యాదగిరి, మొగిలి, ఎల్లయ్య, కొండపాక అశోక్, సదానందం, రామకృష్ణ, నాగపూరి సదానందం, పైడిపల్లి రాజు, మాచర్ల సదానందం, నాగేష్ లతో పాటు గౌడ కులస్తులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News