మహానంది పుణ్యక్షేత్రంలో దేవి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు పురస్కరించుకొని శ్రీ కామేశ్వరి అమ్మవారు తిరుచ్చి వాహనంపై కాళరాత్రి దుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. కాళరాత్రి అమ్మవారు ఎల్లప్పుడు శుభఫలములనే ప్రసాదిస్తుందని, అందువలన ఈమెను శుభంకరి అని అంటారు. కాళరాత్రి దుర్గ దుష్టులను అంతమొందిస్తుంది. ఈమెను స్మరించినంత మాత్రముననే రాక్షసులు భూతప్రేతపిశాచములు భయముతో పారిపోవును.
ఈమె యనుగ్రహమున గ్రహబాధలు తొలగిపోవును. కాళరాత్రి దుర్గను ఉపాసించువారికి అగ్ని, జలము, జంతువులు, భయముగాని, శత్రువుల భయముగాని, ఏ మాత్రము ఉండవు. భయ విముక్తులవుతారు. కాళరాత్రి దేవి సర్వశుభంకరి. ఈమెను ఉపాసించువారికి కలుగు శుభములు అనంతములు. మనము నిరంతరము ఈమె స్మరణ, ధ్యానములను, పూజలను చేయుట ఇహపర ఫలసాధకము అవుతాయి. సాయంత్రం అలంకార మండపంలో వేదపండితులు, అర్చకులు శ్రీ కామేశ్వరి అమ్మవారిని మీనాక్షి అమ్మవారిగా కొలువుదీర్చి సహస్ర దీపాలంకరణ సేవ, అష్టవిధ మహా మంగళ హారతులు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.
అనంతరం శ్రీ కామేశ్వరి అమ్మవారిని తిరుచ్చి వాహనంపై కాళరాత్రి దుర్గగా ఆశీనులు గావించి, వేద పండితులు రవిశంకర్ అవధాని బృందం ఆలయ ఈవో చంద్రశేఖర్ రెడ్డి, ఉభయ దాతలచే ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. కూష్మండ నారికేళ బలి ఇచ్చి, ప్రత్యేక హారతులు ఇచ్చారు. అనంతరం ఆలయ మాఢవీధుల్లో అమ్మవారిని ఆశేష భక్తజనం నడుమ వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.