Saturday, November 23, 2024
HomeతెలంగాణHyderabad KIMS: గోల్డెన్ అవ‌ర్‌ను గోల్డెన్ డేగా మార్చిన ర్యాపిడ్ ఏఐ

Hyderabad KIMS: గోల్డెన్ అవ‌ర్‌ను గోల్డెన్ డేగా మార్చిన ర్యాపిడ్ ఏఐ

కిమ్స్ లో అందుబాటులోకి మరో అత్యాధునిక వైద్య సేవ

విప్ల‌వాత్మ‌క‌మైన ర్యాపిడ్ ఏఐ (ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్) టెక్నాల‌జీని ఆవిష్క‌రించ‌డం ద్వారా కిమ్స్ ఆస్ప‌త్రి బ్రెయిన్ స్ట్రోక్ చికిత్స‌ల‌లో ఓ కొత్త శకాన్ని ఆవిష్క‌రించింది. ఇషెమిక్ స్ట్రోక్ రోగుల‌ను ఇన్నాళ్లూ కేవ‌లం గోల్డెన్ అవ‌ర్‌లో తీసుకొస్తేనే జ‌రిగే మంచి చికిత్స‌ను ఈ అత్యాధునిక ప‌రిజ్ఞానం పుణ్య‌మాని గోల్డెన్ డేలో తీసుకొచ్చినా అందించేందుకు అవ‌కాశం ల‌భించింది. దీనివ‌ల్ల ల‌క్ష‌ల మంది స్ట్రోక్ పేషెంట్ల‌కు మేలు క‌లుగుతుంది. ఎంఆర్ఐ, సీటీ స్కాన్ లాంటి అత్యాధునిక ఇమేజింగ్ టెక్నిక్‌ల‌ను ర్యాపిడ్ ఏఐతో అనుసంధానం చేస్తారు. ఈ ఏఐ సాఫ్ట్‌వేర్ మెద‌డు ఇమేజిల‌ను విశ్లేషించి, మెద‌డులో రెండు ప్ర‌ధాన ప్రాంతాల మ‌ధ్య తేడా క‌నుగొంటుంది. అవి.. కోర్ – అంటే మెద‌డులో బాగా పాడైపోయిన క‌ణ‌జాలం. రెండోది పెనంబ్రా – అంటే కాపాడేందుకు అవ‌కాశం ఉండి, ముప్పు పొంచి ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాల స్ప‌ష్ట‌మైన దృశ్యాల‌ను ర్యాపిడ్ ఏఐ అందిస్తుంది. దానివ‌ల్ల వైద్యులు మ‌రింత స‌మ‌ర్ధంగా చికిత్స చేయ‌గ‌ల‌రు. ఈ స‌రికొత్త ఏఐ సాఫ్ట్‌వేర్ ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మంలో కిమ్స్ ఆస్ప‌త్రి సీఎండీ డాక్ట‌ర్ బొల్లినేని భాస్క‌ర‌రావు, మెడిక‌ల్ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సంబిత్ సాహు, న్యూరో స‌ర్జ‌రీ విభాగాధిప‌తి, సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ న్యూరో స‌ర్జ‌న్ డాక్ట‌ర్ మాన‌స్ కుమార్ పాణిగ్రాహి, సీనియ‌ర్ న్యూరాల‌జిస్టు డాక్ట‌ర్ సుభాష్ కౌల్‌, క‌న్స‌ల్టెంట్ న్యూరాల‌జిస్టు డాక్ట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ యాదా, రేడియాల‌జీ విభాగాధిప‌తి, న్యూరో ఇంట‌ర్వెన్ష‌న‌ల్ రేడియాల‌జిస్టు డాక్ట‌ర్ అనంత‌రామ్‌, ఇంకా ప‌లువురు సీనియ‌ర్ న్యూరాల‌జిస్టులు పాల్గొన్నారు.

- Advertisement -

ఈ స‌రికొత్త టెక్నాల‌జీ గురించి కిమ్స్ ఆస్ప‌త్రికి చెందిన సీనియ‌ర్ న్యూరాల‌జిస్టు డాక్ట‌ర్ సుభాష్ కౌల్ మాట్లాడుతూ, “అన్ని స్ట్రోక్‌ల‌లో సుమారు 80% ఇషెమిక్ స్ట్రోక్‌లే ఉంటాయి. మెదడులోని రక్తనాళం పూడుకుపోయిన‌ప్పుడు ఇవి సంభవిస్తాయి. దీనివ‌ల్ల మెదడుకు కీలకమైన ఆక్సిజ‌న్ స‌రఫ‌రా ఆగిపోతుంది. ఇప్పటివరకు, ఈ గడ్డలను కరిగించగల థ్రోంబోలిటిక్ ఏజెంట్లు మొదటి 4.5 గంటల్లో మాత్రమే ప్రభావవంతంగా ప‌నిచేసేవి. ఈ కాలపరిమితి దాటితే, చికిత్స ప్రభావం తగ్గుతుంది. అంతేకాదు, కొన్నిసార్లు ప్రతికూల ప్రభావాలకు కూడా దారితీస్తుంది. అయితే, కొత్త ప‌రిజ్ఞానం కార‌ణంగా.. 24 గంట‌ల వ‌ర‌కు కూడా మెద‌డులోని ర‌క్త‌నాళాల్లో గ‌డ్డ‌ల‌ను యాంత్రికంగా తొల‌గించే అవ‌కాశం ల‌భించింది. ఇప్పటికే దెబ్బతిన్న మెదడు కణజాలం, ఇంకా దెబ్బతినని.. కానీ ప్రమాదంలో ఉన్న మెదడు కణజాలం అంచనా ఆధారంగా రోగిని స‌రిగా ఎంపిక చేసుకోవాలి.” సాంప్రదాయిక విధానంలో సీటీ, ఎంఆర్ఐ స్కాన్ల‌ను సాధార‌ణ కంటితోనే చూసి, మెదడు ఎంత‌మేర దెబ్బతిందో అంచ‌నా వేస్తారు. కానీ ఇలా చేయ‌డం వ‌ల్ల పూర్తిస్థాయిలో అంచ‌నా రాదు. ఎందుకంటే స్ట్రోక్ మెద‌డులోని ప‌లు ప్రాంతాల‌ను ప్రభావితం చేస్తుంది. అవ‌న్నీ చెల్లాచెదురుగా ఉంటాయి. వాటిని సాధార‌ణ కంటితో తెలుసుకోలేము కాబ‌ట్టే కిమ్స్ ఆస్ప‌త్రి ర్యాపిడ్ ఏఐ అనే ఈ సాఫ్ట్‌వేర్‌ను స్వీక‌రించింది. దీన్ని ముందుగా అమెరికాలో రూపొందించి, ప‌రీక్షించారు. దీన్ని ఎంఆర్ఐతో అనుసంధానిస్తే.. మెద‌డులోని కోర్, పెనంబ్రా ప్రాంతాల‌ను ఇది క‌చ్చితంగా గుర్తిస్తుంది. దానివ‌ల్ల వైద్యులు మెకానిక‌ల్ థ్రోంబెక్ట‌మీ చేయ‌డానికి వీలు క‌లుగుతుంది. త‌ద్వారా ర‌క్త‌నాళాల్లో పూడిక‌ల‌ను తొల‌గించ‌వ‌చ్చు. “ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో తొలిసారిగా కిమ్స్ ఆస్ప‌త్రి స్ట్రోక్ పేషెంట్ల‌కు స‌రికొత్త ఆశ‌లు క‌ల్పిస్తోంది. స్ట్రోక్ వ‌చ్చిన త‌ర్వాత వారు 24 గంట‌ల్లోపు ఆస్ప‌త్రికి చేరుకున్నా కూడా వారికి స‌రైన చికిత్స అందించేందుకు అవ‌కాశం ఉంది. అంటే గోల్డెన్ అవ‌ర్.. ఇప్పుడు గోల్డెన్ డేగా మారింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో స్ట్రోక్ పేషెంట్ల చికిత్స‌ను ర్యాపిడ్ ఏఐ గ‌ణ‌నీయంగా మారుస్తుంది” అని కిమ్స్ ఆస్ప‌త్రి న్యూరో స‌ర్జ‌రీ విభాగాధిప‌తి, సీనియ‌ర్ క‌న్స‌ల్టెంట్ న్యూరో స‌ర్జ‌న్ డాక్ట‌ర్ మాన‌స్ కుమార్ పాణిగ్రాహి వివ‌రించారు. ర్యాపిడ్ ఏఐ ఆవిష్క‌ర‌ణ ఈ ప్రాంతంలో స్ట్రోక్ రోగుల చికిత్స‌లో ఓ పెద్ద ముంద‌డుగు. స్ట్రోక్ వ‌చ్చిన 24 గంట‌ల్లోగా వ‌చ్చినా కూడా రోగుల‌కు స‌మ‌ర్థంగా చికిత్స చేసే అవ‌కాశాన్ని ఇది క‌ల్పిస్తుంది. ఈ సాఫ్ట్‌వేర్‌ను ఈ ప్రాంతంలోని వేర్వేరు ఆస్ప‌త్రుల‌తోనూ అనుసంధానం చేయొచ్చు. అప్పుడు హ‌బ్‌-స్పోక్ విధానం పాటించాలి. అప్పుడు రోగుల‌ను దూరం నుంచి తీసుకురావ‌డానికి బ‌దులు ఎంఆర్ఐ ఇమేజ్‌ల‌ను కిమ్స్ ఆస్ప‌త్రికి ఆన్‌లైన్‌లో పంపితే ఇక్క‌డ ర్యాపిడ్ ఏఐ ద్వారా నిపుణులు వాటిని విశ్లేషించి, కాపాడేందుకు ఎంత అవ‌కాశం ఉందో చెబుతారు. ప్ర‌తి సంవ‌త్స‌రం మ‌న దేశంలో ప్ర‌తి ల‌క్ష మంది జ‌నాభాలో 200 మంది బ్రెయిన్ స్ట్రోక్‌తో బాధ‌ప‌డుతున్నారు. అంటే, ప్ర‌తి నిమిషానికి ఒక స్ట్రోక్ వ‌స్తోంద‌న్న మాట‌. ర్యాపిడ్ ఏఐ ద్వారా 24 గంట‌ల్లోగా కూడా చికిత్స చేసే అవ‌కాశం ఉండ‌టంతో సుమారు 30-40% మంది రోగులు అద‌నంగా పూర్తిస్థాయిలో స్ట్రోక్ నుంచి కోలుకునే అవ‌కాశం ల‌భిస్తోంది. కిమ్స్ ఆస్ప‌త్రిలో ఇప్పుడు ర్యాపిడ్ ఏఐని ఆవిష్క‌రిస్తుండ‌టం.. తెలంగాణ‌, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రాల్లో స్ట్రోక్ పేషెంట్ల జీవితాల‌ను మెరుగుప‌ర‌చ‌డంపై ఆస్ప‌త్రి నిబ‌ద్ధ‌త‌ను చాటుతుంది. ఈ అసాధార‌ణ టెక్నాల‌జీ ఇప్పుడు స్ట్రోక్ చికిత్స ప్ర‌మాణాల‌ను పున‌ర్నిర్వ‌చించి, అనేక‌మంది వ్యక్తులు, వారి కుటుంబాల‌కు స‌రికొత్త ఆశ‌లు క‌ల్పిస్తుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News