ఢిల్లీ హైకోర్టుకు చెందిన జస్టిస్ సిద్ధార్థ్ మృదుల్ ను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమిస్తూ త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తామని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలియజేయడం హర్షణీయమైన పరిణామమే. న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించిన కొలీజియమ్ సిఫారసుల పట్ల కేంద్రం వైఖరి సానుకూలపడుతోందనడానికి ఇదొక సంకేతం. నిజానికి మరో విశేషమైన మార్పు కూడా చోటు చేసుకుంటోంది. సుప్రీంకోర్టు, కొలీజియం ఆమోదం తెలిపి, కేంద్రానికి పంపించిన న్యాయమూర్తుల నియామకాల జాబితాను కేంద్ర ప్రభుత్వం దాదాపు పూర్తిగా ఆమోదించింది.
వివిధ రాష్ట్రాలలో 70 మంది న్యాయమూర్తులు, ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన జాబితా ఇది. నిజానికి, మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్ కొద్దిగా ఆలస్యం కావడానికి కారణం ఆ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనపై సకాలంలో తన అభిప్రాయాలను చెప్పకపోవడమే. ఆయన పేరును కొలీజియమ్ గత జూలై 5న సిఫారసు చేసింది. ఇంత కాలం ఆలస్యం కావడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
ప్రస్తుతం మణిపూర్ హైకోర్టులో ఆపద్ధర్మ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న ఎం.వి. మురళీధరన్ ను కోల్ కత్తా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బదిలీ చేయాలని కొలీజియమ్ సిఫారసు చేసింది. అయితే, ఈ సిఫారసును తిరస్కరించడం జరిగింది. ఆయనను మద్రాసు హైకోర్టుకైనా బదిలీ చేయాలి లేదా మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగానైనా ఖాయం చేయాలని కేంద్రం భావి స్తోంది. ఆయన బదిలీపై కేంద్రం ఏ విధంగా నోటిఫికేషన్ జారీ చేస్తుందనేది వేచి చూడాల్సిన విషయం. మైతీలను కూడా షెడ్యూల్డ్ తెగల కేటగిరీలో చేర్చాలని మణిపూర్ ప్రభుత్వానికి ఆదే శాలు జారీ చేసింది మురళీధరనే. ఈ ఆదేశాల కారణంగానే గత మేనెలలో మణిపూర్ రాష్ట్రంలో అల్లర్లు, హింసా విధ్వంసకాండలు చెలరేగాయి. ఈ ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే ఉత్తర్వులు కూడా జారీ చేయలేదు. స్టే ఉత్తర్వుల వల్ల అక్కడ మరింతగా ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉందని కేంద్రం విజ్ఞప్తి చేయడంతో సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని విరమించుకుంది.
తన సిఫారసుల పట్ల కేంద్రం ఆచితూచి వ్యవహరించడం పైనా, తాము సూచించిన పేర్లలో కొన్ని టిని మాత్రమే ఎంపిక చేయడంపైనా సుప్రీంకోర్టు తరచూ విమర్శలు సాగిస్తోంది. సుప్రీంకోర్టు ఎంపిక చేసిన పేర్లను కేంద్ర ప్రభుత్వం అనేక పర్యాయాలు తిరస్కరించడం, తిప్పిపంపడం జరిగింది. సుప్రీంకోర్టు సవరించి పంపించిన జాబితాను కూడా కేంద్రం తిరస్కరించిన సందర్భాలున్నాయి. సుప్రీంకోర్టు కొలీజియమ్ పంపించిన పేర్లను
తిరస్కరించడంతో పాటు తాము ఎంపిక చేసిన పేర్లను పంపించడం కూడా జరిగింది. ఉదాహరణకు, న్యాయమూర్తిగా పనిచేసి పదవీ విరమణ చేసిన ఎస్. మురళీధర్ ను మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించి, ఎంత కాలం వీలైతే అంత కాలం కొనసాగించాలని కేంద్రం ప్రతిపాదన పంపించింది. అయితే, ఆ సిఫారసును తిరస్కరించడం జరిగింది. కాగా, మద్రాసు హైకోర్టులో ఆపద్ధర్మ ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న టి. రాజాను రాజస్థాన్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమించాలని, ఆయనను ఎంత కాలం వీలైతే అంత కాలం కొనసాగనివ్వాలని కొలీజియమ్ సిఫారసు చేయగా, దాన్ని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది.
న్యాయమూర్తుల నియామకం విషయంలో కేంద్ర ప్రభుత్వానికి, కొలీజియానికి చాలా కాలంగా భిన్నాభిప్రాయాలు తలెత్తుతూనే ఉన్నాయి. సుప్రీంకోర్టు 2021ఏప్రిల్లోజారీ చేసిన ఆదేశాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం కొలీజియమ్ సిఫారసు చేసిన పేర్లపై కాలపరిమితి లోగా అభిప్రాయాలను తెలియజేయాల్సి ఉంటుంది. కొలీజియమ్ ఏ పేరునైనా, ఏ జాబితానైనా రెండో సారి పంపినప్పుడు కేంద్రం తప్పనిసరిగా మూడు నాలుగు వారాల్లో వాటిని ఆమోదించక తప్పదు. కేంద్ర ప్రభుత్వం ఈ నిబంధనలను పాటించాల్సి ఉన్నప్పుడు కొలీజియమ్ కూడా తమ ప్రతిపాదనల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది.