Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Poetry that has to be discussed now: ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన కవిత్వం..

Poetry that has to be discussed now: ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన కవిత్వం..

ఆధునిక మహాభారతానికి జనవంశం అనుంధమన్న శేషేంద్ర

శేషేంద్ర ‘జనవంశమ్‌’
ఆధునిక మహాభారతం కావ్యానికి అనుబంధంగా సాగిన కవిత్వ ప్రయాణం.. కవిత్వ విన్యాసం..అద్భుత కావ్యకృతే ఈ జనవంశమ్‌ కావ్యమ్‌. జనవంశంలో 8 భాగాలుగా విభజించాడు శేషేంద్ర. ఇందులో మొదటి భాగం ప్రకాశకీయం కావ్య ఉద్దేశ్యాన్ని కవి చెబుతూనే రామాయణకావ్యానికి ఉత్తరకాండ అనుబంధకావ్యమని, మహాభారతానికి హరివంశం అనుంధకావ్యమని ఈ నాదేశం నా ప్రజలు అనబడే ఆధునిక మహాభారతానికి ఈ జనవంశం అనుంధమని కవి శేషేంద్ర చెప్పుకున్నాడు.
ఋతుకాండ..
నీవు ఉదయం మొదటిసారి నీ నేత్రద్వయం తెరచినప్పుడు తమ్ముడూ! దేన్ని చూడకు అని ఆరంభిస్తాడు. శేషేంద్ర కవిత్వం చదివితే కవిత్వ పరిణామక్రమాన్ని, వస్తువును, శిల్పాన్ని, ఇతివృత్తాల్ని, ఎత్తుగడల్ని, భావా వేశాల్ని, భావశబ్ధచిత్రాల్ని, పదచిత్రాల్ని, ప్రతీకల్ని, వెంటాడే వాక్యాల్ని గమనించవచ్చు.
నాకు తెలీకుండానే నాలోకి ప్రవహించిపోతున్నాను
నేను ఆకాశభాషా డోలికలో శిశువునై ఊగిపోతున్నాను. వస్తువును వొడిసిపట్టుకుని కవిత్వీకరించడం శేషేంద్రకే సాధ్యం. వస్తువు మాట చెప్పి అభివ్యక్తిను వదిలేస్తున్నాననో లేదా ఎత్తుగడల ప్రస్తావన లేదనో కాదు. పై కవితా వాక్యాలు ఎత్తుగడ వాక్యలే..కవిత్వ పయనం సాగుతున్నకొద్దీ..
నేను పూలబరువు మొయ్యలేని ఆత్మని
వెయ్యిపాటలుగా మారితోటలమీద
వాలుతున్న వసంతాన్ని
ఈ సంవత్సరపు తొలిపువ్వు సాక్షిగా
చెపుతున్నాను
నేను సుఖదు:ఖాలకు బానిసను
గడ్డం వెనుక కోర్కెలు నేను సన్యాసిని
నేను మనిషిని అని ముగిస్తాడు.
సమాజం పట్ల బాధ్యతున్నకవి శేషేంద్ర. సమాజం పట్ల బాధ్యతున్నవాడే కవి అని, కొడవలి కర్షకుడికి ఆయుధం, సుత్తి కార్మికుడికి ఆయుధం, కత్తి సైనికుడికి ఆయుధం, నినాదం రాజకీయ నాయకుడికి ఆయుధం. అలాగే కవికి కవిత్వమే ఆయుధం..కవే దేశానికి అసలైన ఆయుధం అని కవికి నిర్వచనిమిచ్చిన మహాకవి శేషేంద్ర. కవి బాధ్యత కూడా అతను చెప్పినట్లే ఎలాగంటే..
ఈ నదులు ఈ కొండలు ఈ దేశం ఎవరిది
పనిచేసిన కూలీతో బ్రతుకుతున్నప్రజలది
ఈ దేశపు వీధుల్లో నడిచే హక్కెవరిది
స్వేద బిందువుల దండలు వేసుకున్న వారిది
స్వేద బిందువుల విలువలను కొలిచిన కవిగా శేషేంద్ర కనబడతాడు. అందుకే దేశం పట్ల కవికున్న బాధ్యత సామాన్యమని అనుకోలేము. ఇలా దేశం గూర్చి ఆలోచించడం మార్క్సిస్ట్‌ కవులకే సాధ్యమనిస్తుంది. మార్క్సిస్ట్‌ కవులు ఎక్కడైన ఎప్పుడైనా ప్రజలపక్షానే నిలబడతారు. ఇవాళ ఎవరు ఎవరిపక్కన నిలబడి కవిత్వయుద్దం చేస్తున్నారో తెలిసిందే. ఈ వర్త కవిత్వ సమాజం పాలకపక్ష కవులు, ప్రజాకవులు అనే రెండు వర్గాలుగా చీలిపోయింది. అందుకే ఆర్థిక, సామాజిక సమస్యల వరకు ఈ శతాబ్ధం అంగీకరించిన మార్క్సిస్టు సిద్ధాంతాన్ని కనీస పరిష్కారంగా కవులు గుర్తించాలని గుంటూరు శేషేంద్రశర్మ చెప్పిన మాటలు అక్షర సత్యాలు.
ఇక కవిత్వ శిల్పానికి వేస్తే కవిత్వ శిల్పమంటేనే శేషేంద్ర కేరాఫ్‌ అడ్రస్‌. ఆ తడియారని శిల్పం చూడండి..
సముద్రాల్లో పుట్టిందో
నా గుండెని గాయపరుస్తోంది
లోయల్ని గొంతెత్తి ఏడ్చేలా
చేస్తోంది.
నేను చూడగలను
నీ నేత్రాల రేవుల్లో
నౌకల్లా తేలుతున్నాయి
స్వప్నాలు..
ఇది కదా శిల్పం. ఇది కదా శిల్ప నాఢీ పట్టుకోవడమంటే..కవిత్వనాఢీ పట్టుకున్నప్పుడు మాత్రమే చిక్కని కవిత్వం రాయగలమని నిరూపించినవాడు శేషేంద్ర. కవిత్వం ఇలాగే వుండాలని ఎవ్వరూ చెప్పకపోయినా కవిత్వం మాత్రం హృదయం నుండి హృదయం దాకా ప్రవహించాలని శేషేంద్ర కోరుకుంటాడు.
జీవితం ఒక మండే జ్వాల
పువ్వులు బ్రతకడానికి మండుతున్న జ్వాలలు
శేషేన్‌! కొమ్మల్లో ఆ చైత్రమాస దేవత
పాడేపాట విను
జన్మలో వంచనా శిల్పంలేని
పక్షుల్లో పువ్వుల్లా బ్రతుకు
నీకివ్వబడిన ఈ జీవితం
స్వప్నాల్ని బాణాల్లా సంధించే
ఇంద్రధనుస్సు
మానవజాతి, మానవ జీవితం పట్ల కవికి బాధ్యత ఉండటం వల్ల కవికి సమాజంలో గురుతరమైన బాధ్యత ఉందని శేషేంద్ర భావిస్తాడు.
భ్రమరకాండ…
గదిలోకి వచ్చి ఎగిరే గిటారు
ఆ దేశద్రిమ్మరి భ్రమరం
బయటనుల్చో ఉన్న భయానక ఎండ
గాలిని బంధించిన గూండా
పసుపులో వ్రేళ్ళు ముంచి నుంచో ఉన్న మౌన వృక్షమే..
మనిషీ రాగమూ అనుభవించే
నిశ్శబ్ధంలో నుంచి అనంతంలోకి ప్రవహిస్తున్న కాలం
రెక్కలుజాపి వాయువుల్లో
నిశ్చలత్వం సాధిస్తున్న పక్షి
మూడూ తొమ్మిదీ మీద చేతులు జాపి
ఆకాశంలో ఉన్న గోడగడియారం..
కవిత్వాన్ని ఒక తపస్సుగా తదేకదీక్షతో రాస్తాడు శేషేంద్ర. కవిత్వాన్ని ఒక ఉద్యమంగా స్వీకరించాడు శేషేంద్ర. ఏం రాయాలి? ఎలా రాయాలి? ఎందుకు రాయాలి? ఎవరి కోసం రాయాలి? నిన్నటి తరానికి, నేటి తరానికి, మార్గనిర్ధేశనం చేసినవాడే కవి అని నిర్వచించాడు శేషేంద్ర.
ధరిత్రిని హలం దున్నితే అప్పుడు అవుతుంది
అది ఒక దేశం
ధరిత్రిని కలం దున్నితే
అప్పుడు అవుతుంది
అది ఒక ఇతిహాసం
హలమూ కలమూ దున్నని
ధరిత్రి
ధరిత్రి కాదు వట్టి మట్టి అంటారు శేషేంద్ర. కలం పట్టుకున్న చెయ్యి నాగలి పట్టుకున్న చెయ్యికంటే గొప్పదేం కాదన్న కవిత్వ సత్యం చెప్పిన శేషేంద్రను ఈ తరం మరిచిపోతుందనిపిస్తోంది. శేషేంద్ర గూర్చి శేషేంద్ర కవిత్వం గూర్చి మాట్లాడటానికి భయపడతారు. మీ రక్తం పారబోసి నాకవిత్వం నింపుకోండి అని ఎవరు రాయగలరు..?
ప్రజాకాండ..
ఎక్కడికిపోయాయో ఆ పుస్తకాలు
మారని రస్తాలు
ఎక్కడికి పోయాయో ఆ రస్తాలు
నా స్వప్నాల్ని కలవడానికి నేను
ప్రమాదాలతో చేతులు కలిపిన చోట
ఆశాజ్వాలల ముందు కూర్చుని
నేను చలి కాచుకుంటున్నాను.
శేషేంద్ర అంటారు “ఈ రోజు మన దేశంలో పేదరికం తాండవిస్తోంది. ఆకలి చావులు లేకుండా పత్రికల్లో వార్తలు లేవు. ఫుట్‌పాత్‌ల మీద పడుకొని తిండి లేకుండా చనిపోయేవారు చాలా మంది కనిపిస్తారు. ఈ పేదరికాన్ని పారద్రోలి, సమాజంలో ఆర్థిక సమానత్వాన్ని తీసుకురావడానికి, నూతన సమాజ నిర్మాణానికి ఉద్యమించే చైతన్యాన్ని ప్రజల్లో తీసుకురావడానికి కవిత్వం రాయాలి. కవిత్వం గత శతాబ్దం తొలినాళ్ళలో ఒక స్పష్టమైన లోకోపకారక ఆదర్శాన్ని దృష్టిలో పెట్టుకొని నడవలేదు. ఎక్కడెక్కడో తిరిగి తిరిగి చివరికి సామ్యవాద సమాజ సాధన కోసం అంకితమైంది. తర్వాత సంభవించిన అనేక అంతర్జాతీయ, జాతీయ కల్లోల సంఘటనల మూలంగా వామపక్ష రాజకీయ పార్టీల్లో సిద్ధాంతరీత్యా భేదాలు రావటం. ఆ భేదాల ననుసరించి రచయితల్లో కూడా చీలికలు వచ్చాయి. అవన్నీ అందరికీ తెలిసిందే. సాహిత్యం ద్వారా మాత్రమే సమాజ దక్పథాన్ని మార్చగలం. ఉపన్యాసాలు, హరికథలు ఈ చెవితో వింటారు. ఆ చెవితో బయటకు గెంటేస్తారు. తుపాకీతో బెదిరించి మనిషిని మార్చలేమని ప్రూవ్‌ అయింది. కవి తన రచనలతో, చమత్కారోక్తులతో, ఆకర్షణీయమైన పదజాలంతో చదువరుల మనసుల్లో ఆలోచనలు రేకెత్తిస్తాడు. ‘వాహ్‌ ఎంత బాగా రాశాడు’ అని ఎవరైనా అన్నాడంటే ఆ వ్యక్తి హదయం లోంచి ఆమాట వస్తోందన్నమాట. అది ఆ వ్యక్తిని వీడదు. ఆలోచింప చేస్తుంటుంది. అందుకే కేవలం సాహిత్యం ఒక్కటే మనిషిని మార్చగలదు.” అని శేషేంద్ర ఎంత గొప్పగా చెప్తాడు. ఇంతకంటే అర్థం ఏం కావాలి. ఇంతకంటే వివరణ ఏంకావాలి.
చంపూకాండ:
దీన్ని శేషేంద్ర ప్రేమఖండం అన్నాడు. ఇందులో ఒక కవితా వాక్యం చూస్తే..ఎలా మనసుకు హత్తుకుంటుందో అర్థమౌతుంది..
జీవితమే ఒక పూలబాటగా
హాయిగా తీయగా ఒక
యాముగ నీదు హయాము సాగుతున్‌..
ఉద్యోగఖండము:
ఒక్క వెధవకు తెలీదోకెన్ని వంకలో
డాబుగా జేయు ముస్తాబుజేయు.. ఇక్కడ వ్యవస్థను ప్రశ్నించడం, వ్యవస్థపై లోపాల్ని చెబటం ఈయనకే సాధ్యం..అందుకే కవి ఒక పార్టీకి నిబద్ధుడైతే స్వేచ్చను కోల్పోతాడు, అన్యాయాన్ని అక్రమాన్ని ఎదురించ లేడని కవికి రాజకీయాలు కావాలి, రాజకీయ పార్టీలు కాదని గుంటూరు శేషేంద్ర చెప్తాడు. ఇది ఇప్పటి సమాజంలో సాధ్యం కాదనిపిస్తుంది. ప్రగతిశీల భావాజాలమున్న పార్టీలతో కవులు మమేకమై పోరాటం చేయడం వల్ల సమాజంలో కొంతలో కొంతైనా మార్పు తీసుకురాగలుగుతాము. కవులకు స్వేచ్ఛ ఉండాలనే అర్థంలోపై మాటలు చెప్పాడనిపిస్తుంది. రాజకీయపార్టీలు కవుల ఆలోచనలను నియంత్రించడం వల్ల సమాజానికి మంచి జరగదనేది కాదనలేని సత్యం. ప్రతీది వర్గదృక్పథంలో రాయాలని రచయితకున్నా వాస్తవ ఘటనలపై రచన చేస్తున్న సందర్భంలో వర్గస్పృహ గూర్చి కవులు ఆలోచించరు.
రాజకీయ ఖండము:
అందులో..
ధనికుల మాయోపాయాలు తప్పించుకొని ధైర్యంగా నిలిచేశక్తి ప్రజల్లో లేదు అందుచేత సజ్జనులు నిస్సహాయులై పడి ఉన్నారని అంటాడు. ప్రతీ ఖండంలో శేషేంద్ర తన కవిత్వ విన్యాసాన్ని వైవిధ్యంగా చేస్తాడు. అక్షరాల్ని శిల్ప సరిగమలుగా, వస్తువుని హృదయ కుటీరంలో నిక్షిప్తమయ్యేలా, ప్రతిపాదం కనుపాపల్లో ప్రతిబింబం కనబడేలా రాశాడు. ఇది శేషేంద్రకే సాధ్యం
సాహిత్యఖండం:
ఇల్లంటే గోడలు కాదు
పెళ్ళంటే పరాయి ఇంట్లో
బ్రతికే ఒక కోడలు కాదు
ప్రేమించే నా నాథుడి మది
ప్రవహించే కృష్ణా నది
ప్రేమకెలా హేతువు లేదో
మనసు కలాసేతువు లేదు.
ఆయన ఎంత సనాతనుడో అంత నూతనుడు, ఎంత ప్రాచీనుడో అంత అధునాతనుడు. కాలం మారింది. అభిరుచులు మారాయి. కవిత్వం అంటే నీవు సష్టించిన ఆనందాన్ని ఇంకొకరితో పంచుకోవాలి. అప్పుడే దానికి సాఫల్యమేర్పడుతుంది అని బలంగా నమ్మి ప్రజలు ఎపుడైతే పద్యాల్ని ఆనందించడం మానేశారో, అప్పుడే శేషేంద్ర పద్యాలు రాయడం మానేశారు. తెలుగు కవిత్వం చిక్కదనంతో రాయడం ఆయనకు మాత్రమే సాధ్యం. శేషేంద్రలా ఎవరూ రాయలేదు. అందుకే దార్శనికత కలిగిన కవి అనొచ్చు. ఎంత చిక్కగా అంటే యుద్దకాండ లోని కవిత చూద్దాం..
ఓ భారతీయ అస్థిపంజరాల్లారా!
మీ చేతుల్లో జెండా లెగురుతున్నా
మీ ముఖాలు ఏడుస్తున్నట్లే ఉన్నాయి
నేశారు మీ జెండాను
మీ కష్టాలతో మీ కన్నీళ్ళతో
మీ శరీరానికొక చొక్కా ఇచ్చుకోలేక పోయినా
మీ దేశానికొక జెండా ఇచ్చారు.
ఈ జనవంశంలో చివరి భాగం చమత్కారికాకాండ. దీన్ని చమత్కారికలు అన్నాడు. బహుశా ఇంతటి కవిత్వ స్పర్శ, ఇంతటి కవిత్వ గాఢత మరెక్కడా కనబడదు. వాస్త వానికి శేషేంద్ర కవిత్వమంటే అందుకే భయపడతారేమో. రాస్తే ఇలాగే రాయాలన్న బలమైన కాంక్షను రగిలిస్తాడు శేషేంద్ర. ఈ చమత్కారికల్లో..
మనిషి ధనానికి బానిస అంటూ
మార్క్సు చెప్పినది వాస్తవమే
మనిషి డబ్బుతో మారడమన్నదిమటుకీ శతాబ్ధి జోకుసుమా..
నిట్టూరస్తున్న ఆకాశాన్ని పరిచయం చేస్తాను
ఆక్రోషిస్తున్న సముద్రాన్ని చూపిస్తాను
మీ కటికీల సంధుల్లో మీ శ్వాసల
రాకపోకల్లో గాలినై పూల ఊపిరినై
కిరణాన్నయ్‌ వస్తాను నేను శబ్దాన్ని
కటకటాల్లో కన్నీరు కార్చకండి..
రైతులాంటి నదికి పొలాలతోనే పని
నాలాంటి కాగితానికి కలలాతోనే పని
చంద్రబింబం తుఫానుగా మారిన రాత్రి
నా కన్నులకు రంగురంగుల కలత్తోనే పని..
నదులు కవులు భూగోళపు రక్త నాళాలు
నదులు ప్రవహిస్తాయి కవితల్లా
పశువులకోసం పక్షుల కోసం మనుష్యుల కోసం
నదులు కనేకలలు ఫలిస్తాయి పొలాల్లో
కవులు కనే కలలు ఫలిస్తాయి మనుష్యుల్లో..
శేషేన్‌ నీవు పీడిత ప్రజలకే చెందుతావు
అక్షరమై అందరికీ అందుతావు
మర్రిచెట్టు నీడనంతా నీవు
ఒక్క గులాబి నీడలోనే పొందుతావు..
ఈ భాష ఈ కాలం ఈ దేశం
నేను కోరుకున్నవి కావు
వాటి కోసం నేను పుట్టే ముందు
నా అంగీకారం ఎవరూ తీసుకోలేదు
నేను వాటి ఖైదీని..
ఇలాంటి గొప్ప కవిత్వాన్ని తెలుగు సాహిత్యాన్నికి అందించిన మహాకవి శేషేంద్ర. తనకు తాను చెప్పినట్లు మనిషి కన్నీరు తుడవడం నీవంతు, శరీరం పోయినా నిలిచేది నీ గొంతు. అలా భావించినపుడే కవిత్వం పది కాలాలు పచ్చటి పంటపొలమౌతుంది.

  • కెంగార మోహన్‌, కర్నూలు
    9493375447
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News