Sunday, October 6, 2024
Homeఓపన్ పేజ్Telugu literature: క్షతగాత్ర గానం చేస్తున్న కథకుడు ‘అట్టాడ’

Telugu literature: క్షతగాత్ర గానం చేస్తున్న కథకుడు ‘అట్టాడ’

అస్తిత్వ ఉద్యమాలపై రచనలు

ఆయనో సమసమాజ స్వాప్నికుడు. గతి తార్కిక భౌతికవాద రచయిత. మార్క్సిస్టు రాజకీయ మేధావి. నిరంతర అధ్యయనశీలి. కళింగాంధ్ర సామాజిక, రాజకీయ, సాహిత్య, సాంస్కతిక వారసత్వాలను ముందుకు తీసుకు వెళుతున్న సాహసి. ప్రత్యేకించి చెబితే ఉత్తరాంధ్ర ప్రాంతం మీద ఈగవాళితే దుడ్డు వాలినట్లు భావిస్తారు. ఉత్తరాంధ్ర మీద ఎవరైనా రాళ్లు వేస్తే, రాళ్లకు అడ్డంగా తన వీపును కాపు కాస్తారు. ఉత్తరాంధ్ర నింగి, నేల, నీరు, గాలి పరాధీనం కాకూడదు అంటాడు. ఇచ్చట సమస్త వనరుల సంరక్షించబడాలంటాడు. ఇక్కడ జీవద్భాషకు ఒక గౌరవం కావాలంటాడు. వేషానికి తగిన హోదా లభించాలని ప్రగాఢంగా కోరుకుంటాడు. వెరశి ఇక్కడ సంస్కృతి అందల మెక్కలంటాడు. అతనే ప్రముఖ కథా, నవలా రచయిత అట్టాడ అప్పల్నాయుడు గారు. నాలుగున్నర దశాబ్దాలుగా సాహితీ సేవలో నిమగ్నమయ్యారు. ఇతను ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లా, కొమరాడ మండలం, గుమడ గ్రామంలో 1953 ఆగస్టు 23వ తేదీన నారాయణమ్మ, సూరినాయుడు దంపతులకు జన్మించారు. ప్రాధమిక విద్య స్వగ్రామంలోనే కొనసా గింది. ఉన్నత పాఠశాల విద్య కోటిపాం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో అభ్యసించారు. తదనంతరం ఇంటర్మీడియట్‌ విద్య జూనియర్‌ కళాశాల పార్వతీపురంలో సాగింది. అలా చదువుకున్న రోజుల్లోనే వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసంల ఎన్కౌంటర్‌ జరిగింది. వారి మృతదేహాలను పార్వతీపురం పట్టణం నడిబొడ్డున పోలీసులు ఉంచగా జనం తండోపతండాలుగా వెళ్లి తిలకించారు. ఆ సన్నివేశాన్ని దగ్గరగా చూసిన అట్టాడ శ్రీకాకుళం గిరిజన రైతాంగ సాయుధ పోరాటం వైపు ఆకర్షితులయ్యారు. ఈ నేపథ్యంలో జననాట్యమండలిలో చేరారు. కామ్రేడ్‌ మామిడి అప్పలసూరి గారి శిష్యరికంలో పనిచేసారు. అప్పలసూరి కుమార్తె అరుణను ఇష్టపడి వివాహం చేసుకున్నారు. వీరి పిల్లలు సజన్‌, వరీనియా. సజన్‌ ఇటీవల ‘పుష్పక విమానం’ సినిమాకు దర్శకత్వం వహించారు. అట్టాడ కొన్నాళ్లు జంఝావతి ప్రాజెక్టు నిర్మాణ కూలీగా మరియు ఇతర సంస్థలలో అసంఘటిత రంగ కార్మికునిగా పనిచేశారు. అనంతరం శ్రీకాకుళంలో అప్పటికే దుప్పల కష్ణమూర్తి నాయుడు గారి ఆధ్వర్యంలో నిర్వహింపబడుతున్న ‘నాగావళి’ వార పత్రికలో రిపోర్టర్‌ గా చేరారు. అవసరమైనప్పుడు తమ పత్రికలో స్పేస్‌ని నింపే క్రమంలో కవితలు, కథలు, వ్యాసాలు రాయడం మొదలుపెట్టారు. ఇలా రచనా రంగం వైపు అట్టాడ మరలడం జరిగింది. తర్వాత బ్యాంకులో ఉద్యోగం రావడంతో అనేక ప్రాంతాల్లో విధులు నిర్వర్తించారు.
అప్పలనాయుడు గారు సుమారు తొంభై కథలు, ఐదు నవలలు రాశారు. కొన్ని నాటికలు మరియు మడిసెక్క అనే నాటకం రాశారు. ఈ మడిసెక్క నాటకం బహుళ ప్రజాదరణ పొంది, అనేక పురస్కారాలను కైవసం చేసుకుంది. పోడు-పోరు, ప్రత్యామ్నాయం, ఒక పొట్టివాడూ కొందరు పొడవు వాళ్ళ కథ, క్షతగాత్ర గానం, బీల, చిటికెనవేలు కథలు అనే కథా సంకలనాలు వెలువరించారు. అవేగాక పునరావాసం, ఉత్కళం, అనగనగా ఒక రాజద్రోహం, నూకలిస్తాను, బహుళ వంటి నవలలను ప్రచురించారు. గతేడాది రాసిన ‘బహుళ’ వందేళ్ళ ఉత్తరాంధ్ర సామాజిక జీవన సంఘ ర్షణలను వెలికితీసింది. ఈ నవల బహుళ ప్రజాదరణ పొంది, సాహితీ లోకంలో గొప్ప చర్చను లేవదీసింది. బి.వి.ఎ రామారావు నాయుడు, సుంకిరెడ్డి, ఛాయరాజ్‌ గారితో కలిసి అట్టాడ ‘శ్రీకాకుళ సాహితి’ని స్థాపించారు. ఈ సంస్థకు కార్యదర్శిగా వ్యవహరించారు. ఇది ప్రముఖ సాహితీ సంస్థగా సాహితీ ప్రియుల్ని అలరిస్తున్నది. ఈ సంస్థ ‘జముకు’ అనే బులిటన్‌ ని ప్రచురించేది. అలాగే ఈ సంస్థ నుండి నాగావళి కథలు, వంశధార కథలు, జంఝావతి కథలు, బాహుద కథలు పేరిట కథా సంకలనాలను వెలువడ్డాయి. కథ-2017 కు అట్టాడ సంపాదకునిగా వ్యవహరించారు. కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగ సలహా మండలి సభ్యులుగా, కథానిలయం ట్రస్ట్‌ సభ్యులుగా, ఉత్తరాంధ్ర రచయితల కళాకారుల వేదిక అధ్యక్షుడిగా పనిచేసిన అనుభవం ఉంది. రావిశాస్త్రి, కళారత్న, కథా కోకిల, జ్యేష్ట లిటరరీ, పులుపుల శివయ్య, విశాల సాహితీ, పురిపండ అప్పలస్వామి స్ఫూర్తి, ఎ.పి ఉగాది, అధికార భాషా సంఘం, కొండేపూడి శ్రీనివాసరావు పురస్కారాలు అందుకున్నారు అట్టాడ. ఇంకా 2021 తెలుగు విశ్వవిద్యాలయం సాహితీ పురస్కారాన్ని ‘బహుళ’ నవలకుగాను అందుకోనున్నారు.
కథా సాహిత్యం ద్వారా ఉత్తరాంధ్ర సమాజాన్ని చూడాలంటే మనము ఈ ప్రాంతాన్ని నాలుగు విభాగాలుగా చూడొచ్చు. విశాఖపట్నం మరియు పట్టణ/నగర జీవితాలను ఆధారంగా చేసుకుని వచ్చిన కథా సాహిత్యం. తీర ప్రాంతము మరియు దానిని ఆనుకుని ఉన్న గ్రామాలు, జాతీయ రహదారిని ఆధారంగా చేసుకుని వచ్చిన కథా సాహిత్యం. గిరిజన ప్రాంతాలు మరియు వాటిని ఆనుకుని ఉన్న గ్రామ సమాజం యొక్క కథా కథనాలు.
మిగిలిన కొండ దిగువనున్న మైదాన ప్రాంతం ప్రతిబింబించేలా ఎక్కువగా రాసిన కథా సాహిత్యం.
వీటన్నిటిలో చూసుకుంటే అట్టాడ అప్పల్నాయుడు గిరిజన ప్రాంతంతో పాటు, మైదాన ప్రాంతములో వస్తున్న మార్పుల కోసం కూడా కథలుగా రాశారు. ఇదే అతని కథారచనలో ప్రత్యేకత. కొంతకాలం వరకు ఉత్తరాంధ్ర సాహిత్యం యూనివర్సల్‌ థీమ్స్‌ తో సాగింది. కానీ ఆ తర్వాత వచ్చిన సాహిత్యం స్థానిక విషయాలకు అస్తిత్వం జోడించి వచ్చాయి. వాటిలో ప్రధానంగా అట్టాడ రచనలు ఉంటాయి. వీటి ప్రత్యేకత ఏమిటంటే, అస్తిత్వం కోసం చెప్పడమే కాకుండా ఈ రచనలన్నీ ఈ ప్రాంత చరిత్రగా ఉంటాయి. ఈ దృష్టి చాలావరకు సమకాలీన రాజకీయ చైతన్యానికి దోహదపడుతుంది. అయితే ప్రధానంగా ఇంకో విషయం కూడా ఉంది. అట్టాడ కథలు భూమి కోసం, భూ పరాయికరణ కోసం ఎక్కువగా చర్చిస్తాయి. వాటి వెనుకనున్న నయా ఉదారవాద రాజకీయాలు, భూస్వామ్య పెత్తందారీ వర్గాలు విస్తాపన నేపథ్యంగా ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న విధ్వంసాన్ని చూపుతాయి. నయా ఉదారవాద ఆర్థిక ప్రణాళికలను ప్రశ్నించడం ఒక విషయమైతే, ఆ ప్రణాళికల్లో వస్తున్న ప్రయోజనాలను ఎవరు? ఏ ప్రాంతం వారు? ఏ కులాల వారు? ఏ వర్గాల వారు? మోసుకుపోతున్నారనేది ఇంకో ప్రశ్న. ఈ ప్రశ్నలతో అట్టాడ కథలు ఆసక్తికరంగా సాగుతాయి. అలాగే ఈ ప్రాంత రాజకీయ నాయకులు ఆయా భూస్వామ్య పెట్టుబడి వర్గాల రాజ్యాధినేతలకు ఊడిగం చేసే సామంత రాజులుగా ఉండటాన్ని కొన్ని కథల్లో ప్రస్తావిస్తారు. వ్యవసాయక జీవితం మీద రాయలసీమ కథకులు మంచి కథలు రాశారు. ముఖ్యంగా రైతు-మార్కెట్‌ ని బేస్‌ చేసుకుని రాసిన కథలు అద్భుతం. కానీ ఇలాంటివి ఉత్తరాంధ్రలో తక్కువగానే వచ్చాయి. బహుజన రైతు జీవితాలను కథలుగా మలచడం అప్పల్నాయుడు ‘ప్రత్యామ్నాయం’ కథల్లో కనిపిస్తుంది. ఈ సందర్భంగా తన మిత్రుడు ‘గంటేడ గౌరునాయుడు’ గారి రైతులు-కులవత్తుల జీవనాల్ని తడుముతూ రాసిన కథలను ప్రత్యేకంగా చెప్పొచ్చు. నేడు భూమి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. సాధారణంగా నేడు ఆర్థికపరమైన హెచ్చుతగ్గులు భూమి చుట్టూనే కేంద్రీకతమై ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భూమి మీద జరిగే మార్పులను రికార్డుచేస్తూ అట్టాడ కథలు ఉంటాయి. ‘పోడు-పోరు’ కథలలో గిరిజన ప్రజా జీవనాలు కనబడతాయి. సాయుధ పోరాటాన్ని ఆదివాసి ప్రాంతానికి మాత్రమే పరిమితం చేసి, మైదాన ప్రాంతాన్ని విడిచిపెట్టడం కరెక్ట్‌ కాదనే భావనను కా.రా మాస్టారు సూచించారు. దాంతో తర్వాత వచ్చే తన కథల్లో వస్తుపరంగా, నిర్మాణపరంగా మార్పులు సంతరించుకున్నాయంటారు అట్టాడ. ఒక రచయిత తన ప్రాంత జీవద్భాషలో చెప్పడమే సరైన పద్ధతి. ఎందుకంటే ఆ ప్రాంత సామాజిక జీవితాలను పోరాటాలను అలా వ్యక్తం చేస్తే గాని సాధికారత దొర కదు కాబట్టి. అందుకే అట్టాడ తన కథల్లో సిక్కోలు యాసను, సామెతలను చొప్పించడం జరిగింది. స్వతహాగా ఉత్తరాంధ్ర యాసలో వ్యంగ్యం, చమత్కారం, అమాయకత్వం ఉంటుంది. అది అందర్నీ ఆకట్టుకుంటుంది. ఈ భాషలో వ్యంగ్యం ఎంత ఉంటుందో! తిరుగుబాటు తనం కూడా అంతే! ఉంటుంది. బహుశా ఈ భాషయే ఈ ప్రాంత వైప్లవిక పోరాటాలకు హేతు వయ్యిందేమో? అనవచ్చు. రావిశాస్త్రి, చాసో, కారా మాష్టారు వలె అట్టాడ కూడా తన భాషను, తన యాసలోని అందాన్ని వాడుకోవడంలో సిద్ధహస్తుడయ్యాడు. ఇదే అతని కథలను అజరామరం చేస్తున్నాయి.
నన్ను ఒక అస్తిత్వవాదిగా చాలామంది ముద్ర వేశారు. అస్తిత్వవాదమేమీ నేరం కాదు. అస్తిత్వ పోరాటాలు లేకుండా విప్లవోద్యమం ముందుకు సాగదు. కళింగాంధ్ర అస్తిత్వ వాదానికి విప్లవ పార్టీలు ఎందుకు వ్యతిరేకం? తెలంగాణ మరియు రాయలసీమ అస్తిత్వ ఉద్యమాలకు ఎందుకు వత్తాసుపలుకుతున్నాయి? అనే ప్రశ్నలు ఒకానొక ఇంటర్వ్యూలో అట్టాడ సంధించారు. బహుశా ఆయనను ఒక అస్తిత్వవాదిగా, ప్రాంతీయ వాదిగా ముద్రవేస్తున్నవారే దీనికి జవాబు చెప్పాలి.

  • పిల్లా తిరుపతిరావు
    7095184846
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News