నవంబర్ 30న జరగనున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ లోప్రజలు తమ ఓటు హక్కును నిర్భయంగా పారదర్శకంగా వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రజలలో భరోసా కల్పించేందుకు రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ రెమా రాజేశ్వరి, ఐపిఎస్., డిఐజీ., మంచిర్యాల డిసిపి సుధీర్ రాంనాథ్ కేకన్ ఐపిఎస్ తో కలిసి సి.ఆర్.పి.ఎఫ్, పోలీసు శాఖ అధికారులు సిబ్బందితో కలసి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సర్కిల్ చౌరస్తా నుండి ఫ్లాగ్ మార్చ్ ప్రారంభించి వెంకటేశ్వర థియేటర్, మార్కెట్ గుండా పోలీస్ స్టేషన్, బెల్లంపల్లి చౌరస్తా, బస్టాండ్ మీదుగా జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల వరకు కొనసాగించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… నవంబర్ 30న జరగనున్న శాసనసభ నియోజకవర్గ ఎన్నికల పోలింగ్ రోజున ప్రజలు తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా, పారదర్శకంగా, నిర్భయంగా వినియోగించుకుని సమర్థవంతమైన నాయకత్వాన్ని ఎన్నుకోవాలని తెలిపారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు లోను కాకుండా తమ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా సిఆర్పిఎఫ్, పోలీసు శాఖ భరోసా కల్పిస్తుందని, ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా పారదర్శకంగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. అర్హత గల ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలని, ఈ విషయంలో జిల్లా అధికార యంత్రాంగం పూర్తి మద్దతు, భరోసా ఇస్తుందని తెలిపారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రజలకు నమ్మకం కలిగించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని తెలిపారు.
రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ రెమా రాజేశ్వరి మాట్లాడుతూ… ఇప్పటివరకు రామగుండం కమిషనరేట్ పరిధిలో 5 కేంద్ర బలగాలు వచ్చాయని, ఇందులో మహిళా బలగాలు వచ్చాయని, 2వ విడతలో మరిన్ని కేంద్ర బలగాలు వస్తాయని తెలిపారు. మంచిర్యాల జిల్లా పరిధిలోని 3 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎన్నికల నేపథ్యంలో పోలీసు శాఖ రక్షణ చర్యలలో కేంద్ర బలగాలు సహకరిస్తాయని, పోలింగ్ రోజున సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఎన్నికల అనంతరం కౌంటింగ్, స్ట్రాంగ్ రూమ్ ల వద్ద బందోబస్తు కొరకు సమన్వయంతో పనిచేయడం జరుగుతుందని తెలిపారు. ఈ నేపథ్యంలో పోలింగ్ రోజున అర్హత గల ప్రతి ఒక్కరు ఎలాంటి భయం లేకుండా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు, ప్రజలలో భరోసా కల్పించాలని ఉద్దేశంతో కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బలగాలు, పోలీసు శాఖ అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.