తెలంగాణలో జరుపుకునే ముఖ్యమైన హిందూ పండుగ దసరా. చెడుపై మంచి విజయానికి ప్రతీక అయిన విజయదశమిని తెలంగాణ అంతటా సాంప్రదాయం, ఉత్సాహం, భక్తి, ఆనందంతో జరుపుకుంటారు. విజయదశమి అనే పేరు సంస్కృత పదాల నుండి వచ్చింది “విజయ-దశమి” అంటే దశమి రోజున విజయం సాధించిన సందర్భంగా
జమ్మి వృక్షానికి పూజలు చేయడం ఈ పండుగ యొక్క ప్రత్యేకత. దసరా పండుగ నేపథ్యంలో మంగళవారం సాయంత్రం ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఆలయ అర్చకులు శేషం వంశిధరాచార్యులు, సీతారామచార్యుల ఆధ్వర్యంలో శ్రీ సీతారామ చంద్రస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం శ్రీ సీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులను అశ్వవాహనంపై గ్రామ పురవీధులలో ఊరేగించారు. పలు గ్రామాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాయంత్రం పాలపిట్ట దర్శనం కోసం గ్రామశివారులకు వెళ్లారు. భక్తులందరూ ఆలయాలకు వెళ్లి జమ్మిపూజ నిర్వహించి బంధువులకు, స్నేహితులకు అందజేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కందుల సుధాకర్, ఆలయ ఉద్యోగులు మోహన్, రాజయ్య, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.