శీతాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటనలో ఓ హైలైట్ అందరినీ విపరీతంగా ఆకట్టుకుంది. హైదరాబాద్ లోని హకీంపేట ఎయిర్ ఫోర్స్ స్టేషన్ లో ల్యాండ్ అయిన ముర్ముకు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర రావు ఘన స్వాగతం పలికారు. గత కొంతకాలంగా రాష్ట్ర గవర్నర్, కేసీఆర్ మధ్య కోల్డ్ వార్ తారాస్థాయిలో సాగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. పైగా ప్రోటోకాల్ ప్రకారం సీఎం రావాల్సిన కార్యక్రమాలకు కేసీఆర్ గైర్హాజరవుతున్నారు కూడా. ఈ నేపథ్యంలో సాగుతున్న రాష్ట్రపతి పర్యటనకు సీఎం వస్తారా అని చివరి నిమిషం వరకూ తెలియరాలేదు. గవర్నర్, సీఎం ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొంటారా లేదా అన్న సస్పెన్స్ కు ఎట్టకేలకు తెర పడిందన్నమాట. రాష్ట్రపతి పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా తెలంగాణకు వచ్చిన రాష్ట్రపతి ముర్ముకు కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులను, అధికారులను పేరుపేరునా రాష్ట్రపతి సీఎం కేసీఆర్ పరిచయం చేయటం మరో హైలైట్. అయితే బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు బండి సంజయ్ ను కూడా కేసీఆరే పరిచయం చేయటం విశేషం.