దేవరగట్టులో బన్నీ ఉత్సవాలు ముగిశాయి. ఈసారి కూడా దేవరగట్టు కర్రల సమరంలో తలలు పగిలాయ్ రక్తం చిందింది.హొళగుంద మండలం దేవరగట్టు లో ప్రతి సంవత్సరం విజయ దశమి పర్వదినాన నిర్వహించిన బన్ని ఉత్సవంలో సంప్రదాయమే గెలిచింది. అధికారుల ఆదేశాలను విస్మరించిన భక్తులు అనాదిగా వస్తున్న ఆచారాన్ని కొనసాగించారు. 5 లక్షలకు పైగా భక్తులు తరలివచ్చారు. శ్రీ మాళ మల్లేశ్వరుని జైత్రయాత్ర మొగలాయి యుద్ధాన్ని తలపించింది. రక్తపాతాన్ని తగ్గించేందుకు 1000 మందికి పైగా పోలీస్ బందోబస్తుతో జిల్లా అధికార యంత్రాంగం చేసిన చర్యలు ఫలించలేదు. మంగళవారం అర్ధరాత్రి డోళ్లుబండ వద్ద నెరణికి, నెరణికి తాండ, కొత్తపేట గ్రామస్తులతో పాటు దేవర గట్టు చుట్టు పక్కల గ్రామాల పెద్దలు పాలుభాస తీసుకొని శ్రీ మాళ మల్లేశ్వరుని కళ్యాణోత్సవానికి డిర్ర్ ర్ర్ ర్ర్.. గోపరాక్ (బహుపరాక్ )అంటూ కొండపైకి బయలుదేరారు. రాత్రి 1 :30గంటకు పైన శ్రీ మాళ మల్లేశ్వరుని కల్యాణోత్సవాన్ని నెరణికి గ్రామానికి చెందిన పురోహితులు,ఆలయ ప్రధాన అర్చకులు ఘనంగా నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహమూర్తులను దివిటీలు,కర్రల సహాయంతో జైత్రయాత్రకు తీసుకుని వచ్చారు. నెరణికి, నెరణికి తాండ, కొత్తపేట గ్రామస్తులతో పాటు దేవర గట్టు చుట్టు పక్కల గ్రామాలైన నిట్రవట్టి, బిలేహాల్, విరుపాపురం, ఎల్లార్తి, సుళువాయి,సమ్మతగేరి,అరికెర, అరికెర తండా, కురుకుంద, లింగంపల్లితో పాటు దాదాపు 15 గ్రామాలకు చెందిన భక్తులు ఉత్సవంలో పాల్గొన్నారు.
నలుగురు మృతి…100 మందికి పైగా గాయాలు
బన్నీ ఉత్సవాన్ని తిలకించడానికి వచ్చిన భక్తులు సింహాసన కట్ట వద్ద ఉన్న చెట్టు ఎక్కి కూర్చున్నారు బరువు తట్టుకోలేక విరిగి కింద పడడంతో ఇద్దరు మృతి చెందినట్లు తెలిపారు. మరియు తొక్కిసలాటలో ఊపిరాడక ఇద్దరు చనిపోయినట్టు తెలిపారు.జైత్రయాత్రలో జరిగిన కర్రల సమరంలో దాదాపు 100 మందికి పైగా గాయాలయ్యాయి.గాయపడిన వారికి ఆస్పత్రిలో తాత్కాలిక చికిత్స జరుగుతోంది.
ఘనంగా జైత్రయాత్ర
స్వామివారి పల్లకీ, విగ్రహాలు డోళ్లు, తప్పెట్లు కొట్టుకుంటూ బసవన్న గుడి వైపు బయలుదేరి 3 గంటలకు ముళ్లబండకు చేరుకోవడంతో అక్కడ పూజలు చేశారు.3.40 గంటలకు విగ్రహాలు పాదాలగట్టుకు చేరుకోగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.తెల్లవారు జామున 3:50 గంటలకు రక్షపడికి చేరుకోగా అక్కడ మణి, మల్లాసుర అనే రాక్షస గుండులకు కంచాబీర వంశానికి చెందిన గొరువయ్య తన కాలి పిక్కలకు దప్పణంతో గుచ్చుకుని రక్త తర్పణం చేశారు.4.50కు జమ్మి చెట్టు వద్దకు విగ్రహాలు చేరు కోవడంతో అక్కడ పూజలు చేశారు. అనంతరం చెరువు కట్ట మీదుగా బసవన్న గుడికి ఉదయం 6:45గంటలకు భవిష్యవాణి చెప్పారు. ఉదయం 7 గంటలకు స్వామి అమ్మవార్లను శివాసన గుడికి చేర్చి శ్రీ మాళ మల్లేశ్వరునికి జేజేలు కొట్టి ఇంటిదారి పట్టారు. ఈ ఉత్సవాన్ని తిలకించడానికి హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ వచ్చారు. ఉత్సవాలు కర్నూలు జిల్లా ఎస్పీ కృష్ణ కాంత్ మరియు ఆదోని సబ్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పర్యవేక్షణలో జరిగాయి.