భువిపై రోజు రోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు, తుఫానులు, పిడుగులు, వంటి విపత్తులను పరిశీలిస్తే రానున్న రానున్న రోజులలో భూగోళంపై సమస్త జీవరాశులు ఉనికి ఎలా ఉంటుందో, ఏమో అనే సందేహం కలుగుక మానదు. వీటికి ఎన్నో కారణాలు ఉండ వచ్చు, కానీ కారకుడు మాత్రం వంద శాతం మనిషే..! వాడి సుఖం కోసం పర్యావరణాన్ని కాలుష్యం చేసి ప్రకృతి పట్ల తీసు కొన్న అనాలోచిత చర్యలు ఫలితమే ఈ విపత్తులు.
అటువంటి కాలుష్యాలలో ప్లాస్టిక్ కాలుష్యం ఒకటి. ప్రపంచ వ్యాప్తంగా గత యేడాది సుమారు 390.8 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ని ఉత్పత్తి చేశారు. మనదేశంలో యేటా సుమారు 3.10 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ ఉత్పత్తి అవుతున్నది. ఇది ఇలా ఉంటే 2030 నాటికి 619 మిలియన్ టన్నులు అవుతుందని శాస్త్రవేత్తలు అంచనా వేశారు. పెన్నుల నుండి ఎలక్ట్రానిక్ పరికరాలు, బొమ్మలు, ఆహార నిలవలుకి ఉపయోగించే కవర్లు, ఆటవస్తువులు పి.వి.సి పైపులు, గ్లాసులు మొదలైన వస్తువులు ప్లాస్టిక్ తోనే తయారవుతున్నాయి.
ప్లాస్టిక్‌నే ఎందుకు వాడుతున్నారు
ప్లాస్టిక్ అనేది చౌకగాను మరియు సౌకర్యవంతంగా ఉండ డం వలన మన జీవితంలో చాలా ఎక్కువగా పెనవేసుకుపోయింది. స్వతహాగా ప్లాస్టిక్ విషపూరితం కాదు. వాటి వ్యర్థాల వలన మానవునికి, పర్యావరణకి వచ్చే ముప్పు అంతా ఇంతా కాదు. కిరాణా సంచులు, ఆహార పదార్థాలను నిల్వ చేసే సంచులు, నీటి బాటిల్స్, మూతలు, టీ, కాఫీ కప్పులు, హోటల్‌లో ఆహార పదార్థాలు ప్యాకింగ్ కొరకు, డ్రింక్ బాటిల్స్, ద్రవ ఔషదాలు నిల్వలో, సిరంజీల కొరకు ప్లాస్టిక్‌ని విరివిగా ఉపయోగిస్తున్నారు. ఐదు వందల మిలియన్ల ప్లాస్టిక్ సంచులను ప్రతీ సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా తయారు చేస్తున్నారు. ఇందులో తొంభై శాతం ఒకసారి వాడి పారేసేవే. ప్లాస్టిక్ మన జీవితాలని చిన్నాభిన్నం చేస్తుంది. ఇది మన ఆరోగ్యానికి ప్రమాదమని తెలిసినా దీని వినియోగాన్ని తగ్గించుకోపోలేకపోతున్నాము. వీధులు, మురికి కాలువలు ప్లాస్టిక్ చెత్తతో నిండుతున్నాయి. ఇటువంటి ప్లాస్టిక్ భూమిలో కలవడానికి సుమారు వెయ్యి సంవత్సరాలు పడుతుంది. దీని మూలంగా నేల కాలుష్యం జరిగి భూగర్భజలాలు విష పూరితం అవుతున్నాయి, కాల్చితే పర్యావరణ కాలుష్యము జరుగుతుంది. పర్యావరణ సమతుల్యత దెబ్బతిని దీని వలన తరచూ అడవులు కాలిపోతున్నాయి.
ప్రతీ సంవత్సరం 8 మిలియన్ టన్నుల కంటే ఎక్కువ ప్లాస్టిక్ సముద్రాలలో కలుస్తుంది. సముద్ర ఉపరితలంలో 40 శాతం ప్లాస్టిక్ చెత్తతో కప్పబడి ఉన్నదని, ఇది ఇలా కొనసాగితే 2030 సంవత్సరం నాటికి సముద్రంలో చేపలకంటే ఎక్కువ ప్లాస్టిక్ ఉంటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్లాస్టిక్ వ్యర్థాలను సముద్రంలో వున్న జంతువులు, చేపలు శరీరంలోనికి ప్రవేశించి పర్యావరణానికి ఎంతో హాని కల్గిస్తున్నాయి.
కోవిడ్ సమయంలో మరింత పెరిగిన వినియోగం
కోవిడ్ 19 యొక్క అంటువ్యాధిని తగ్గించడానికి ఒకసారి మాత్రమే ఉపయోగించే మాస్కులు, పి.పి.ఇ కిట్లు, శానిటైజర్లు నిలవ చేసే సీసాలు, లాక్డౌన్ సమయంలో ప్యాకేజ్డ్ ఆహార పదార్థాలులో ప్లాస్టిక్‌ని మరింత ఎక్కువగా ఉపయోగించారు. ఆ సమయంలో 193 దేశాల నుండి 8.4 మిలియన్ టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఉత్పన్నమయ్యాయని అంచనా వేశారు. వీటిలో సుమారుగా 25,900 టన్నులు సముద్రంలో కలిశాయి.
మైక్రో ప్లాస్టిక్‌లు మరింత ప్రమాదం
రీసైకిల్‌గా భావించే ప్లాస్టిక్‌లలో పూర్తిగా ప్లాస్టిక్ అదృశ్యం కావడం లేదు. ఇవి చిన్న చిన్న ముక్కలుగా విచ్ఛిన్నం అవుతున్నాయి. వీటినే నానో ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్‌లని పిలుస్తున్నారు. ఇవి 5 మిల్లీ మీటర్లు నుండి 100 నానో మీటర్లు వ్యాసం కల్గిన ఉన్న ప్లాస్టిక్ ముక్కలు. మానవుని జుత్తు కంటే పది వంతులు సన్నంగా వుంటాయి. ఇవి సౌందర్య సాధనాలు, పెయింట్స్ తయారీలో, నీటి సీసాలు, ప్లాస్టిక్ సంచులు విచ్ఛిన్నం చేయడం వలన ఏర్పడతాయి. నెదర్లాండ శాస్త్రవేత్తలు జర్నల్ ఎన్విరా న్మెంట్ ఇంటర్నేషనల్‌లో విస్తుగొలిపే నిజాలు ప్రచురించారు. శీతల పానీయాలు నిలువ చేసే ప్లాస్టిక్ బాటిల్స్ తయారీలో ఉపయోగించే పి.యి.టి, ఆహార ప్యాకింగ్లకి ఉపయోగించే పాలీస్టరీన్, అనేక రకాల ప్యాకింగ్‌ల కొరకు ఉపయోగించే పాలీథిలీన్‌లు ఉన్నట్లు తెలిపారు. నీరు, మొక్కలు, చేపల్లో మైక్రో ప్లాస్టిక్లు ఉంటున్నాయి. ఇవి మన రక్తంలో చేరి మనకు ప్రమాదాలను కలిగిస్తున్నాయి. ఇవి మనం పీల్చే గాలిలో, తినే ఆహారంలో ఉంటున్నాయి. దీని వలన కేన్సర్ వచ్చే అవకాశం ఉంది. మనకు హాని కల్గించే సూక్ష్మజీవులు, వైరస్‌లకు ఆవాసంగా మారి మనకు పరోక్షంగా మన ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి సహాయపడుతున్నాయి.
ఎలా బయట పడగలము
దీనిని తగ్గించేందుకు 5 ఆర్‌లు ఉపయోగించాలి. అవి రెడ్యూస్ (తగ్గించడం), రేఫ్యుజ్ (తిరస్కరించడం), రీయూజ్ (పునర్వినియోగం), రీసైకిల్ (మరల్ ఉత్పత్తికి వాడటం), మరియు రిమూవ్ (తొలగించడం). ఒకసారి మాత్రమే ఉప యోగించే ప్లాస్టిక్ వస్తువుల తయారీ, వినియోగాన్ని నివారించాలి. తక్కువ మందం కలిగిన ప్లాస్టిక్ సంచులను నిషేధించాలి. ప్లాస్టిక్ కి బదులుగా కాగితాన్ని , గుడ్డ సంచులను, గాజు సీసాలని ఉపయోగించాలి. హానికరమైన ప్లాస్టిక్‌లు ఉపయోగించే అన్ని పరిశ్రమలను మూసి వేయించాలి. నీరు త్రాగడానికి ప్లాస్టిక్ సీసాలకు బదులుగా స్టీల్ సీసాలు, రాగి సీసాలు, గాజు సీసాలు, ఫ్లెక్సీలకు ప్రత్యామ్నాయంగా గుడ్డని, ప్లాస్టిక్ విస్తరాకులకు బదులుగా ఆకులతో చేసిన విస్తర్లు వాడాలి. ఆహార పదార్థాలు నిలువ చేయడానికి మోడిఫైడ్ అట్మాస్పియర్ (ఎం. ఎ.పి ) పద్దతి ఉపయోగించాలి. ఐతే ఒక్కసారిగా ప్లాస్టిక్‌ను నిషేధించలేము. దీనిపైన ఆధార పడే ఉద్యోగులు రోడ్డున పడతారు. ఈ పరిశ్రమల నుండి వచ్చే ఆదాయం కోల్పోతాం. ప్రత్యామ్నాయ మార్గాలు అన్వేషించి మరో రంగంలో ఆదాయం వచ్చేటట్లు ప్రభుత్వాలు చూసుకోవాలి. ప్రభుత్వం ఒక్కటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని ఆపలేదు. బాధ్యత గల పౌరులుగా మనం కూడా బాధ్యత తీసుకోవాలి. ప్లాస్టిక్ కాలుష్యం, వాటి వలన మనకు జరిగే హానిని, ప్రజలకు ప్రసార సాధనాల ద్వారా, పత్రికలు గుండా అవగాహన కల్గించాలి. అప్పుడే ఇటువంటి విపత్తుల నుండి కొంత వరకు ఉపశమనం లభిస్తుంది.
జనక మోహన రావు దుంగ
అధ్యాపకుడు
- 8247045230