బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండల బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం తాళ్ళరాంపూర్ గ్రామంలో జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ తో పాటు హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్పొరేషన్ చైర్మన్ డా. మధు శేఖర్, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు రాజారాం యాదవ్,కోటపాటి నర్సింహ నాయుడు స్థానిక మండల నాయకులు, ప్రజాప్రతినిధుల, బిఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్బంగా వారు కార్యకర్తలకు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై పలు సూచనలు చేశారు. ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్దినీ పలువురు వక్తలు ఈ సందర్బంగా కార్యకర్తలకు వివరించారు. కారు గుర్తుకు ఓటు వేసి ప్రశాంత్ రెడ్డి గారిని భారీ మెజారిటీతో గెలిపించేందుకు ప్రతీ బిఆర్ఎస్ సైనికుడు కంకణబద్దులై పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మాట్లాడుతూ…
బాల్కొండ నియోజకవర్గాన్ని మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు బంగారు కొండగా మార్చారని కొనియాడారు. ఇంత మంచి మనసున్న నాయకుడు దొరకడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని,మారుమూల ప్రాంతాలకు సైతం డబుల్ రోడ్లు వేసిన ఘనత ప్రశాంత్ రెడ్డి గారిదే దక్కిందన్నారు. తనకు 31 గ్రామాల తో ఉన్న మండలాన్ని చేయడానికి 4 ఏళ్లు పట్టిందని కానీ ప్రశాంత్ రెడ్డి గారు 7 గ్రామాలతో ఏర్గట్ల మండలాన్ని ఏర్పాటు చేసి,ఎంతో అభివృద్ది చేశారన్నారు. ప్రతి పక్షాల డిపాజిట్లు గల్లంతే అని 70 నుంచి 80వేల మెజారిటీతో ప్రశాంత్ రెడ్డి గారి హ్యాట్రిక్ గెలుపు ఖాయమయ్యిందని,కార్యకర్తలు కొంచెం గట్టిగా కష్ట పడితే లక్ష మెజారిటీ తధ్యమన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ కేసిఆర్ చేతిలో ఉంటేనే పదిలంగా ఉంటుందని ప్రజలకు అర్థమయ్యేలా వివరించాలన్నారు. కేసిఆర్ గారి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిన ప్రతి గడపకు వెళ్లి ఓటు అడగాలని కార్యకర్తలకు సూచించారు.
మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ…
బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులే నా బలం..బలగం అని అన్నారు. కార్యకర్తలే తనకు ఎల్లప్పుడూ వెన్నంటి నిలిచారన్నారు. తన తల్లి మరణానంతరం 15 రోజుల తర్వాత బయటకు వచ్చానన్నా ఆయన.. ఈశాన్యం లో ఉన్న ఏర్గట్ల మండలం నుండే ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంబించాననీ అన్నారు. ఒక్క ఏర్గట్ల మండల మీటింగ్ కే నియోజకవర్గ స్థాయి మీటింగ్ కు వచ్చినంత కార్యకర్తలు వచ్చారని, మీ మద్దతు తనకు రెట్టింపు బలాన్ని ఇస్తోందని సంతోషం వ్యక్తం చేశారు. 7 గ్రామాలు ఉన్నప్పటికీ మండల కేంద్రం ఏర్పాటు చేసుకుని మండలాన్ని అన్ని విధాల అభివృద్ది చేసుకున్నామని అన్నారు. ఎవరు అడగకున్న సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేసి, గ్రామాలకు డబుల్ రోడ్లు వేశానని తెలిపారు. ఏర్గట్ల మండలంలో 5వేల కుటుంబాలకు 3,600 మంది ఆసరా పెన్షన్లు,4500 మందికి రైతు బంధు,600 మందికి సీఎంఆర్ఎఫ్,కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్ ఇట్లా సుమారు 9,200 మందికి నేరుగా కేసిఆర్ ప్రభుత్వం నుండి లబ్ది జరిగిందని అన్నారు. 10వేల ఓట్లు పోలైతే అందులో 9,200 ఓట్లు కారు గుర్తుకే పడాలన్నరు. మంచి చేశాం కాబట్టే ఓట్లు అడుగుదాం. ఇక్కడికి వచ్చిన ఒక్కో బిఆర్ఎస్ సైనికుడు 7 ఓట్లు వేయించినా మండల ఓట్లు అన్ని కారు గుర్తుకే పడతాయని అన్నారు. గ్రౌండ్ లెవల్ బాగుందని,మెజారిటీ కోసమే తాపత్రయమని, ప్రతిపక్ష పార్టిల్లో ఉన్న కేసిఆర్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందిన వారిని సైతం ఓట్లు అడిగి వేయించే ప్రయత్నం చేయాలని సూచించారు. బిఆర్ఎస్ మేనిఫెస్టో పై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని కోరారు. ప్రతి కార్యకర్త ఒక కేసిఆర్,ఒక ప్రశాంత్ రెడ్డి కావాలన్నారు.
గతంలో అస్తవ్యస్తమైన కరెంట్ తో తెలంగాణ ప్రజలు గోసలు పడ్డారని, దాన్ని దృష్టిలో పెట్టుకొని కేసిఆర్ గారు సుమారు లక్ష కోట్లతో కరెంట్ వ్యవస్థను గాడిలో పెట్టాడని తెలిపారు. రైతుకు 24 గంటల ఉచిత విద్యుత్, గృహ అవసరాలకు,పరిశ్రమలకు నిరంతరాయంగా నేడు కరెంట్ సరఫరా అవుతుందన్నారు. తెలంగాణ ప్రజలకు కరెంట్ కష్టాల బాధలు తొలగించింది కేసిఆరే అని మంత్రి స్పష్టం చేశారు. రైతుకు రైతు బంధు,రైతు భీమా,సాగునీరు,సకాలంలో ఎరువులు ఇచ్చి,కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతు బాందవుడుగా నిలిచారని కొనియాడారు. నేడు తెలంగాణలో రైతులు తన పక్క పొలం రైతుతో దిగుబడిలో పోటీపడుతున్నారని అన్నారు. కేసిఆర్ సర్కార్ రైతుల కోసం చేస్తున్న కార్యక్రమాలు చూసి వ్యవసాయ రంగ నిపుణులు ఆశ్చర్యపోతున్నారని అన్నారు. 200రూ. ఉన్న పెన్షన్ ను 2వేలు చేసిన ఘనత కేసిఆర్ దే అని దాన్ని 5వేలకు పెంచుతామని చెప్పాడన్నారు. అట్లాగే భూమి ఉన్న వారికి రైతు భీమా యెట్లా వస్తుందో అట్లాగే తెల్ల రేషన్ కార్డులు కలిగిన భూమి లేని ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల కేసిఆర్ భీమా ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన వారికి గతంలో ఉన్న లిమిట్ ఎత్తివేసి కేసిఆర్ ఎంతమంది ఉంటే అంతమంది కుటుంబ సభ్యులకు 6కిలోల చొప్పున దొడ్డు బియ్యం అందిస్తున్నారని రానున్న రోజుల్లో కేసిఆర్ మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత సన్న బియ్యం అందించనున్నట్లు తెలిపారు. అర్హురాలైన పేదింటి మహిళకు సౌభాగ్య లక్ష్మి పథకం కింద నెలకు 3వేల చొప్పున ఇవ్వనున్నట్లు చెప్పారు. అట్లాగే కేసిఆర్ గారు పేదల వైద్య ఖర్చులు దృష్టిలో ఉచుకుని 2లక్షలు ఉన్నదాన్ని మొదలు 5 లక్షలు ఆ తర్వాత 10 లక్షలు, ఇప్పుడు 15 లక్షలకు ఆరోగ్య శ్రీ కింద పెంచారని అన్నారు. ఏ కార్పొరేట్ హాస్పిటల్ లో అయిన 15లక్షల విలువైన ఉచిత వైద్యం పేదలకు అందుతుందని అన్నారు. గ్యాస్ సిలిండర్ 400 రూ. కేసిఆర్ ఇస్తారని బిఆర్ఎస్ మేనిఫెస్టోలోని అంశాలను క్షేత్ర స్థాయిలో తీసుకెళ్ళాలని చెప్పారు.
14 ఏళ్లు రాష్ట్ర సాధన కోసం పోరాడి, ప్రాణత్యాగానికి సిద్ధపడ్డ కేసిఆర్ ఒక వైపు ఉంటే..ఓటు కు నోటు కేసులో పట్టపగలు నొట్ల కట్టలతో దొరికిన దొంగ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ కోసం రాజీనామా చేయమంటే అమెరికా పారిపోయిన బీజేపీ కిషన్ రెడ్డి మరోవైపు ఉన్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు విజ్ఞులని వారికి మంచి చేసే వారు ఎవరూ.. అధికారం కోసం మోసపు హామీలతో వచ్చే వారెవరో బాగా తెలుసన్నారు. కేసిఆర్ ను వ్యక్తిగతంగా విమర్శిస్తున్న రేవంత్ రెడ్డి,కిషన్ రెడ్డి ఆయన కాలిగోటికి కూడా సరిపోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసిఆర్ చెప్పింది చేస్తాడని ప్రజలకు నమ్మకముందని కళ్యాణ లక్ష్మి, కేసిఆర్ కిట్,రైతు బంధు,బీమా లాంటి ఎన్నో మానవీయ కోణ పథకాలు ఆయన హామీ ఇవ్వకుండానే పేదలను దృష్టిలో పెట్టుకొని ప్రవేశ పెట్టి అమలు చేశారన్నారు. తెలంగాణ ప్రజలు ఎప్పుడూ కేసిఆర్ ను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటారని ధీమా వ్యక్తం చేశారు.బీజేపీ,కాంగ్రెస్ పార్టీల నేతలు ఎంత అరిచి గీ పెట్టినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరనీ అన్నారు.
రైతు బంధు,దళిత బంధు ఆపాలని ఈసీకి లేఖ రాసిన కాంగ్రెస్ పార్టీ ప్రజా వ్యతిరేక వైఖరికి నిరసనగా విస్తృత స్థాయి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం చేశారు
రైతులకు,దళితులకు,పేదలకు వచ్చే పథకాలను అడ్డుకోవాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్బంగా కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన పలువురు మంత్రి వేముల సమక్షంలో భారత రాష్ట్ర సమితిలో చేరారు.