దేవరగట్టులో వెలసిన శ్రీ మాళ మల్లేశ్వరస్వామి వారి రథోత్సవం గురువారం సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు భారీ సంఖ్యలో తరలి రావడంతో దేవర గట్టు కిటకిటలాడింది. దేవరగట్టు ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో నెరణికి, నెరణికితండా, కొత్తపేట, చుట్టుపక్కల గ్రామాల పెద్దలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రథోత్సవానికి ముందు స్వామి వారికి ప్రత్యేక పూజలు అయిన జలభిషేకం, రుద్రాభిషేకం, కుంకుమార్చన, బండారు చందన అభిషేకంతో పాటు ఆకుపూజ, మహా మంగళారతి తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
ఆచారం ప్రకారం కుంభోత్సవం
ఆచారం ప్రకారంగా బిలేహాళ్ గ్రామం నుంచి దేవరగట్టుకు కుంభం చేరడంతో స్వామివారి రథోత్సవాన్ని వేలాది మంది భక్తజనుల మధ్య శ్రీ మాళ మల్లేశ్వరస్వామి వారికి జేజేలు పలుకుతూ వైభవంగా రథోత్సవం ఎదురుబసవన్న గుడి వరకు సాగింది. ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎస్ఐ వి శ్రీనివాసులు పోలీసు బందోబస్తు నిర్వహించారు. వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ నిర్వాహకుల ఆధ్వర్యంలో తీర్థప్రసాదాలు అందించారు.