ఇంకా అక్కడక్కడ కట్టెల పోయి మీద వంట చేస్తున్నారంటే అందుకు కేంద్రంలోని బీజేపీ విధానాలే కారణమని మోడీ పెట్టిన పొగ కష్టాలకు శాశ్వతంగా పరిష్కారం చూపించేందుకే సీఎం కేసీఆర్ జనవరి నుంచి పేదలందరికీ 400 కే గ్యాస్ సిలిండర్ ను ఇచ్చేందుకు సిద్ధమయ్యారని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండలో మొదట అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం ప్రారంభించారు. ప్రచారంలో భాగంగా తిరుపతమ్మ అనే మహిళ ఇంటికి వెళ్లగా అక్కడ ఆమె కట్టెలపోయి మీద వంట చేస్తూ కనిపించారు. పరిస్థితిని చూసిన మంత్రి మోడీ ధరలు పెంచడం వల్లే మీరు తిరిగి కట్టెలపోయికి మారాల్సిన పరిస్థితి వచ్చిందని త్వరలోనే మీకు ఈ కష్టాలు తీరుతాయని తెలిపారు. అనంతరం పాలకొండ, ఎదిరలో ప్రచారం నిర్వహించి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు…
అమలు కానీ హామీలతో ప్రజలను కాంగ్రెస్ పార్టీ వంచిస్తోందని… కర్ణాటకలో 4 నెలలు కూడా ముగియకముందే సరైన విద్యుత్ ఇవ్వకుండా రైతులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. కర్ణాటక ప్రజలు తమ రాష్ట్రంలో ఎదుర్కుంటున్న కరెంటు కష్టాలను అందరి దృష్టికి తెచ్చేందుకు కొడంగల్, గద్వాల్ లో ఆందోళన చేశారని, కొన్ని చోట్ల సబ్ స్టేషన్లలో మొసళ్లను కూడా వదిలి వారి నిరసనను తెలియచేశారన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సక్రమంగా అమలు చేయలేని మీరు తెలంగాణ రైతులు బాగుపడుతుంటే కండ్లు మండి కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు పథకం ద్వారా రైతులకు జరుగుతున్న లబ్దిని చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు కుట్రతో ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తున్నారని… రైతులే వీరికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. రైతుకు పైసా సాయం చేయని వారు కూడా రైతును నాశనం చేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు.
కేసీఆర్ భరోసా ద్వారా అమలు చేయనున్న 15 పథకాల పట్ల ప్రజలంతా ఆసక్తిగా గమనిస్తున్నారని జనవరి నుంచి రైతుబంధు రూ. 16వేలు, కొత్త పించన్లు రూ. 5016, రూ. 6016 , మహిళా భృతి రూ. 3వేలు, వంటగ్యాస్ రూ. 400, ప్రతి ఇంటికి సన్నబియ్యం వంటి పథకాలన్నీ అమలవుతాయన్నారు.
ఎన్నికలకు కేవలం నెల రోజులు మాత్రమే ఉండే ప్రతిపక్షాల నాయకులు నవంబర్ 30 తర్వాత పత్తా లేకుండా పోతారని, వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని మంత్రి ప్రజలకు సూచించారు. ఏ పార్టీలో ఉంటారో తెలియని నాయకులు ఎన్నికల కోసం టూరిస్టుల్లా వస్తున్నారని వారికి తగిన గుణపాఠం చెప్పాలని కోరారు.