Friday, November 22, 2024
Homeఓపన్ పేజ్BJP: బీజేపీకి ప్రాంతీయ నాయకులు పట్టరా?

BJP: బీజేపీకి ప్రాంతీయ నాయకులు పట్టరా?

అధిష్టానానికి స్థానిక నాయకులకు మధ్య తీవ్ర అగాధం

దేశంలో అయిదు రాష్ట్రాల శాసనసభలకు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో బీజేపీ అధిష్ఠానానికి, దాని ప్రాంతీయ నాయకులకు మధ్య అంతరాలు, అగాధాలు బయటపడుతున్నాయి. అంతా అధిష్ఠాన వ్యవహారమే తప్ప రాష్ట్ర అధ్యక్షులకు పాత్రేమీ లేదన్న సంకేతాలు కేంద్ర నాయ కత్వం నుంచి క్రమంగా
వెలువడుతున్నాయి. రాష్ట్ర అధ్యక్షులనే కాదు, మాజీ ముఖ్యమంత్రులను కూడా పక్కన పెట్టడం జరుగుతోంది. అంటే బీజేపీ అనే పార్టీ జాతీయ స్థాయిలో పలుకుబడి కలిగిన పార్టీగా ఉంటోందే తప్ప రాష్ట్ర స్థాయిలో దానికి ఇమేజ్ ఉండడం అన్నది జరగడం లేదు. ఇందుకు ఉత్తర ప్రదేశ్, అసోం రాష్ట్రాలు మినహాయింపయితే కావచ్చు. ప్రాంతీయ నాయకులు లేని కొరత తీర్చడానికన్నట్టు కేంద్ర నాయకత్వం ఎన్నికల వేళ కేంద్ర మంత్రులను, పార్లమెంట్ సభ్యులను రంగంలోకి దించుతోంది.

- Advertisement -

తమ రాష్ట్ర నాయకులకు పట్టూ పలుకుబడీ పెరగడమన్నది ఏ జాతీయ పార్టీకైనా ఒక ఆస్తి లాంటిది. దేశంలోని అనేక ప్రాంతాలలో బీజేపీ పలుకుబడి, ప్రతిష్ట, ఆధిపత్యం వగైరాలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ముడిపడి ఉన్నాయి. అయితే, రాష్ట్ర స్థాయిలో గమనిస్తే బీజేపీ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా
ఉంది. వాస్తవానికి బీజేపీకి ఒక పటిష్టమైన, సుశిక్షితమైన, కాల పరీక్షకు తట్టుకోగలిగిన వ్యవస్థ ఏర్పడి ఉంది. ఎంతో అంకిత భావంతో పనిచేసే నాయకులు, కార్యకర్తల బలం ఉంది. రాజకీయాలలో అనుభవజ్ఞులైన, ఆరితేరిన నాయకులున్నారు. మరే పార్టీకీ లేనన్ని అవకాశాలున్నాయి. పార్టీ చైతన్యవంతంగా, క్రియాశీలంగా వ్యవహరిస్తూ ఉండ డానికి దోహదం చేసే పటిష్టమైన యంత్రాంగం ఉంది. అయితే, ఒక కార్పొరేట్ సంస్థగా పని చేయడానికి అవసరమైన సంస్థాగత నిపుణులకు, నిర్వాహకులకు కొరత ఉన్నట్టు కనిపిస్తోంది. పార్టీలో అత్యద్భుతంగా, అంకిత భావంతో పనిచేసేవారిని గుర్తించి, ప్రోత్సహించడం అన్నది రానురానూ కనుమరుగైపోతోంది. ఎంతో జనాకర్షణ కలిగిన సీనియర్ నాయకులను అకారణంగా పక్కనపెట్టేయడం జరుగుతోంది. ఈ పరిస్థితి దీర్ఘకాలంలో పార్టీని సంస్థాగతంగా దెబ్బతీసే అవకాశం ఉంది.

తెలంగాణలో మొదటికే మోసం
మొత్తం ఓటర్లలో ఇతర వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు, దళితులు, షెడ్యూల్డ్ తెగలు 90 శాతం వరకూ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ తమ రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ కుమార్ ను అకస్మాత్తుగా తొలగించింది. పాలక భారత రాష్ట్ర సమితి (బి.ఆర్.ఎస్), కాంగ్రెస్ పార్టీలను సంతృప్తిపరచడానికి బీజేపీ ఇటువంటి నిర్ణయం తీసుకుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ, దానికి ఏదో ఒక రూపంలో వివరణ, సవరణ ఇచ్చే ప్రయత్నం కూడా అధిష్టానం నుంచి జరగలేదు. బండి సంజయ్ కుమార్ వెనుకబడిన తరగతులకు తిరుగులేని నాయకుడు. ఈ మధ్య కాలంలో పార్టీకి ఎంతో పేరు తెచ్చిన నాయకుడు. ఎంతో అంకిత భావంతో పనిచేసే వ్యక్తి. ఆయనను సానుకూల సమయంలో పదవి నుంచి
తొలగించడంతో పార్టీ ఈ రాష్ట్రంలో మూడవ స్థానానికి దిగజారిపోయింది. అదే విధంగా చత్తీస్ గఢ్ లో రమణ సింగ్, రాజ స్థాన్ లో వసుంధరా రాజే సింధియాలను కూడా అధ్యక్ష పదవుల నుంచి తొలగించడం జరిగింది. ఇక మధ్యప్రదేశ్ లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రజాకర్షణ దినదిన ప్రవర్ధమానంగా
తగ్గిపోతున్నప్పటికీ, ఆయననే పదవిలో కొనసాగించడం జరుగుతోంది. హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలలో ఇదే విధంగా ప్రాంతీయ నాయకులను నిర్లక్ష్యం చేసినందు వల్లే బీజేపీ ఘోరంగా దెబ్బ తినడం జరిగింది.

విచిత్రమేమిటంటే, రాజస్థాన్ లో శాసనసభ ఎన్నికల సందర్భంగా సమర్థ బీజేపీ ప్రచార సారథు లెవరూ ఇప్పుడు కలికానికి కూడా కనిపించడం లేదు. వాస్తవానికి, రాజస్థాన్ లో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతెన్నుల పట్ల విసిగిపోయిన ప్రజానీకం ప్రత్యామ్నాయం కోసం ఎదురు చూస్తు న్నారు. అయితే, అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వం అకస్మాత్తుగా తన ప్రచార వ్యూహాన్ని మార్చేసింది. ఇతర రాష్ట్రాల్లో బీజేపీ అనుసరిస్తున్న వ్యూహాన్నే ఇక్కడ తాను అనుసరించడం ప్రారంభించింది. రాష్ట్రంలోని ప్రధాన నగరాలు, పట్టణాలన్నింటిలోనూ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాత్ పథకాలు, కార్యక్రమాల వివరాలతో, సరికొత్త
నినాదాలతో బ్యానర్లు, హోర్డింగులు కనిపిస్తున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతాల్లో కాంగ్రెస్ పరిస్థితి కాస్తంత మెరుగుపడింది. అందుకు ప్రతిగా బీజేపీ చేపట్టిన ‘నహీ సహేగా రాజస్థాన్’ అనే నినాదానికి ఎక్కడా స్పందన కనిపించడం లేదు. ఆ నినాదం, బీజేపీ ప్రచారం కాంగ్రెస్ నినాదాల ముందు, ప్రచారం ముందు వెలవెలపోతున్నాయి.

రాజస్థాన్ లో అధ్వాన వ్యూహం
అంతేకాదు, గెహ్లాత్ చేపట్టిన ద్రవ్యోల్బణ సహాయ పథకం బాగా ఆకట్టుకుంటోంది. పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని మహిళలకు ఆయన ఇస్తున్న ఆర్థిక సహాయం అది. రాష్ట్రంలో మహిళలు, జాట్లు, ఓబీసీలు, ఆదివాసీలలో ఆశించిన స్థాయిలో పట్టూ పలుకుబడీ ఉన్న వసుంధరా రాజే సింధియా బీజేపీని ఎంతో పటిష్టం చేయడం జరిగింది. ఇప్పటికీ ఆమె సభలకు జనం పోటెత్తుతుంటారు. ఆమెను పార్టీ నిర్మొహమాటంగా పక్కన పెట్టేయడం జరిగింది. ఎన్నికల సమయంలో రాష్ట్ర స్థాయి లేదా ప్రాంతీయ స్థాయి నాయకుల ప్రజాకర్షణను పెంచడానికి కేంద్ర నాయకత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. మహిళా ఓటర్ల సంఖ్య, మహిళా నాయకుల సంఖ్య పెరుగుతున్న స్థితిలో పార్టీలో మహిళలకు తప్పకుండా ఎక్కువ అవకాశాలు ఇవ్వవలసి ఉంటుంది. శాంతిభద్రతలు, అభివృద్ధి, మహిళా ప్రాధాన్యం కలిగిన పథకాలను ఎంత ఎక్కువగా ప్రచారంలో పెడితే అంత మంచిది. రాజస్థాన్, చత్తీస్ గఢ్ రాష్ట్రాలలో ప్రస్తుతం అదే జరుగుతోంది. మహిళా ప్రాధాన్యం కలిగిన పథకాలను ప్రవేశపెట్టి, ప్రచారం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాలు అక్కడ బాగా లబ్ధి పొందడం జరుగుతోంది.

ఈ అంతరాన్ని వసుంధరా రాజే సింధియా ఎంతో చాకచక్యంతో భర్తీ చేయగలిగి ఉండేవారు. పార్టీలోని అగ్రవర్ణాలు ఆమెను విమర్శించడమో, ఆమెను పట్టించుకోకపోవడమో జరుగుతూ వచ్చింది. చివరికి పార్టీ అధిష్టానమే ఆమెను పక్కన పెట్టేసింది. ఆసక్తికర విషయమేమింటే, ఆమెను విమర్శిస్తూ, ఆమెను దూరం
పెట్టడంలో కీలక పాత్ర పోషించిన నాయకులెవరూ ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో ఎక్కడా కనిపించడం లేదు. ప్రచారంలో పాల్గొనగలిగిన, సభలను విజయవంతం చేయగలిగిన సామర్థ్యం కూడా వారికి లేదు. ఉదాహరణకు, కేంద్ర జలవనరుల మంత్రిగా ఉన్న జోధ్ పూర్ పార్లమెంట్ సభ్యుడు గజేంద్ర సింగ్ షెఖావత్ ఏ విధంగానూ గెహ్లాత్ సమానం కాదు. ఆయన తన కులంవారి ఓట్లను కూడా సంపాదించలేరు. కోటా నుంచి ఎంపీగా ఎన్నికైన లోక్ సభ స్పీకర్ ఓమ్ బిర్లా పలుకుబడి తన కోటా నియోజకవర్గానికే పరిమితం. ఇక మేఘ్వాల్ నుంచి ఎంపీగా ఎన్నికైన కేంద్ర న్యాయ వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ పలుకుబడి తమ మేఘ్వాల్ కులం వరకే పరిమితమైపోయింది. ఇప్పుడాయన మేఘ్వాల్
కులం కూడా కాంగ్రెస్ పార్టీకి కొమ్ము కాస్తోంది. వీరంతా 2019లో మోదీ హవాలో గెలిచినవాళ్లే. రాజస్థాన్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న రాజేంద్ర సింగ్ రాథోడ్ పరిస్థితి కూడా అంతే.

చత్తీస్ గఢ్ లో తప్పటడుగులు
ఇక చత్తీస్ గఢ్ విషయానికి వస్తే అక్కడ రమణ్ సింగ్ నాయకత్వానికి వ్యతిరేకంగా పనిచేసిన బీజేపీ నాయకులు అరుణ్ సావో, బ్రిజ్ మోహన్ అగ్రవాల్, అజయ్ చంద్రాకర్, ప్రేమ్ ప్రకాశ్ పాండే, నారాయణ్ చాండేల్, సరోజ్ పాండే ఇత్యాదులంతా రమణ్ సింగ్ ను పదవి నుంచి దించడానికి తమ శక్తియుక్తులన్నిటీనీ వెచ్చించారు తప్ప కాంగ్రెస్ ను బలహీనపరచడానికి చేసిందేమీ లేదు. వీరు తమ పార్టీ అధ్యక్షుడి మీదే చేస్తున్న విమర్శల కారణంగా రమణ్ సింగ్ బలహీనపడడం అటుంచి, ముఖ్యమంత్రి భూపేశ్ బాఘేల్ బాగా బలపడ్డారు. బీజేపీ మీద సంధించడానికి ఆయనకు బీజేపీయే అనేక అస్త్రశస్త్రాలు
అందించినట్టయింది. ఆయన మీద ఉన్న ప్రభుత్వ వ్యతిరేకతంతా తొలగిపోయింది. ఇప్పుడు ఆయన విజయం సాధించడమన్నది నల్లేరు మీది బండిలా ఉంది. ఇక్కడ సకాలంలో నాయకత్వ సమస్యను పరిష్కరించి ఉంటే బీజేపీ అద్భుతంగా విజయం సాధించి ఉండేది. తాము మోదీని దృష్టిలో పెట్టుకునే ఈ రాష్ట్రాలలో బీజేపీకి ఓటు వేస్తామే తప్ప రాష్ట్ర నాయకత్వాన్నిచూసి కాదని రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్ ఓటర్లు ఇటీవల ఒక సర్వేలో సమాధానాలిచ్చారు.

రాజస్థాన్, చత్తీస్ గఢ్, మధ్యప్రదేశ్, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో రాష్ట్ర నాయకత్వాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఇక్కడి ఎన్నికల ప్రచారాన్ని, సారథ్యాన్ని రాష్ట్ర నాయకులకే అప్పగించి ఉంటే తేలికగా
విజయాలు సిద్ధించడానికి అవకాశం ఉండేది. ఇటువంటిది జరగనందువల్లే కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో పార్టీ దెబ్బతినడం జరిగింది. చివరికి మోదీ ప్రచారం చేసినా ఫలితం లేకుండా పోయింది. ఈ పోటీదాయక ప్రపంచంలో పార్టీలు కూడా ఎప్పటికప్పుడు తమ వ్యూహాలను మార్చవలసి ఉంటుంది. నిర్ణయం తీసుకోని ఓటర్లను కూడా తమ వైపు తిప్పుకోగలిగిన ప్రతిభ ప్రాంతీయ నాయకుల్లో మాత్రమే
ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News