లవ్ జిహాద్ కేసులు మనదేశంలో నిజంగా పెరుగుతున్నాయా అనే చర్చ సర్వత్రా సాగుతోంది. ఇదంతా ఓ పొలిటికల్ క్యాంపెయిన్, అంతా విద్వేషం రగిలించే కుట్ర అనే వాదన అంతకంటే బలంగా వినిపిస్తోంది. దీంతో మతాంతర వివాహాలు చేసుకున్న వారిలో కొత్త అనుమానాలు, భయాలు, అభద్రతా భావం పెరిగిపోతోంది. ముఖ్యంగా ప్రేమ జంటలైతే పెళ్లి వరకు తమ ప్రేమను తీసుకెళ్లాలో లేదో అర్థం కాక బెదిరిపోతున్నాయి. కొందరు అమ్మాయిలు, అబ్బాయిలైతే ఈ భయం వెంటాడుతుండటంతో బ్రేకప్ చెప్పుకోలేక, కొత్త జీవితం ప్రారంభించలేక పిరికితనంతో బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇదంతా న్యూ ఇండియాలో రొటీన్ న్యూస్ గా మారిపోయేలా పరిస్థితులు తయారయ్యేయంటే ప్రాణం విలువ ఎంత పడిపోయిందో అర్థమవుతుంది.
జమ్ము, కశ్మీర్ వంటి చోట్ల హిందూ-ముస్లిం మతాంతర వివాహాలు కొన్ని దశాబ్దాలుగా సాగుతోంది. ఇరుగుపొరుగు వారు ఎవరైనా వీరు హ్యాపీగా కలిసిపోయేలా కశ్మీరీలు ఉండేవారు. కానీ టెర్రరిజం దెబ్బకు మెజారిటీలు, మైనారిటీలుగా కశ్మీరీలు విడిపోక తప్పలేదు. అందుకే కశ్మీర్ గురించి మాట్లాడితే తప్పకుండా మత ప్రస్తావన వచ్చితీరుతుంది.
బాలీవుడ్ విషయానికి వస్తే లవ్ జిహాద్ కు వీళ్లే బీజం వేశారనే ఆరోపణలు ఇప్పడు కాదు ఎప్పటినుంచో ఉన్నాయి. సినిమా పక్కీలో ప్రేమ, ప్రేమించుకోవటం, పెళ్లి చేసుకోవటం అనేది బాలీవుడ్ వే ఆఫ్ లివింగ్ లైఫ్ అనేలా సాగుతోంది. కొన్ని దశాబ్దాలుగా బాలీవుడ్ లో ఏంజరిగితే అదే మనదేశంలో పెద్ద ఫ్యాషన్, స్టైల్ గా చెలామణీ అయిపోతోంది. ఆఖరుకి వేసుకునే బట్టలు మొదలు, మాట్లాడే భాష, తినే తిండి వరకూ అంతా బాలీవుడ్ శాసించినట్టే అవుతుందంటే ఆశ్చర్యపోతారేమో. కానీ ఇది నిజం.
కేరళ వంటి రాష్ట్రాల్లో లవ్ జిహాద్ అంటే చాలాసార్లు క్రిస్టియన్స్-ముస్లింల వివాహంగా పరిగణించాల్సి వస్తుంది. దీనిపై చర్చి పెద్దలు చాలా ఆగ్రహించి, ఏకంగా ఈ విషయాన్ని కేరళ అసెంబ్లీ ఎన్నికల అంశంగా కూడా మార్చేశారు. అంతేకాదు ఈ విషయంపై క్రిస్టియన్ మత పెద్దలు ప్రధాని మోడీతో సీక్రెట్ గా భేటీ అయి తమ ఆడపిల్లల భవిష్యత్తు కాపాడమని, తమ ఇంటి పరువు కాపాడమని ..ఇందుకు కఠినమైన చట్టాలు తేవాలని కూడా డిమాండ్ చేశారు. అందుకే తాము కేరళలో అధికారంలోకి వస్తే మతాంతర వివాహాలు జరక్కుండా చూస్తామని చర్చి పెద్దలకు హామీ ఇచ్చారట.
గతంలో ఎన్నడూ కనివినీ ఎరుగని ఘర్ వాపసీ వంటి అంశాలు ఈ దశాబ్ద కాలంగానే వినపడుతున్నాయి. దీనికి కారణం కూడా ఈ లవ్ జిహాద్ అనే చెప్పాలి. దేశాన్ని, దేశంలోని ప్రజలను, సమాజాన్ని నిలువునా చీల్చి, మెజారిటీ-మైనారిటీ రాజకీయాలు చేసేసి, ప్రజల మనోభావాలతో రాజకీయ పబ్బం గడుపుకుంటున్న రాజకీయ నాయకుల సమీకరణాలే ఇవి అని కొందరు మేధావులు ఎప్పటినుంచో వాదిస్తున్నారు. కానీ ఇదమిత్థంగా లవ్ జిహాద్ లోతుపాతులు మాత్రం అంతుచిక్కటం లేదు.
విచిత్రమైన విషయం ఏమిటంటే నిజంగానే మైనారిటీ అమ్మాయిలు మెజార్టీ వర్గానికి చెందిన అబ్బాయిలతో సహజీవనం లేదా ప్రేమ వివాహం అనే బంధాల్లోకి పెద్దగా అడుగు పెట్టినట్టు మనం వార్తలు చూడటం లేదు. కానీ మెజార్టీ అమ్మాయిలు, మైనారిటీ వర్గానికి చెందిన అబ్బాయిలతోనే ఈ లవ్ జిహాద్ అఫైర్లనేది తరచూ న్యూస్ మేకర్ గా మారుతున్న అంశంగా దేశాన్ని విభజిస్తోంది. దీన్ని యాదృచ్ఛికం అనాలే లేదా అని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకే అంతు చిక్కటం లేదు. గత 10 ఏళ్లుగా దేశంలో పెరిగిన పలు పరువు హత్యలకు కారణం లవ్ జిహాద్ కోణం అనే విషయాన్ని మనం మరువరాదు.
మత మార్పిడికి లవ్ జిహాద్ ఓ ఆయుధం, ఓ మార్గంగా కేరళ హైకోర్టు కూడా గతంలో చేసిన వ్యాఖ్యలు ఎవరూ మరిచిపోలేరు. అవును..ఇంతకీ ఇలా లవ్ జిహాద్ మ్యారేజెస్ తరువాత అమ్మాయిలు తప్పకుండా ఎందుకు మతం మారుతున్నారు? మతం మారేంత ప్రేమ కేవలం అమ్మాయిలకే ఉంటుందా మరి అబ్బాయిలకు ఆ స్థాయిలో ప్రేమ ఉండదా అంటూ విశ్వహిందూ పరిషద్, సంఘ్ పరివార్ లు పదేపదే ప్రశ్నించటం ఆలోచిపంచేసే విషయమే.
ఇక తాజాగా టీవీ నటి 20 ఏళ్ల తనీషా శర్మ ఆత్మహత్య కేసులోనూ లవ్ జిహాద్ యాంగిల్ కనిపిస్తోందనే విషయం ఇప్పుడు చాలా పెద్దచర్చనీయాంశంగా మారింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇది కూడా లవ్ జిహాద్ కేస్ అని చాలామంది ఇప్పటికే నిర్ధారణకు వచ్చారుకూడా. ఇలా ప్రముఖులు, సామాన్యులు లవ్ జిహాద్ తో మతం మారటం ఆతరువాత అర్ధాంతరంగా తనువు చాలించటం పదేపదే వార్తల్లో కనిపిస్తోంది.
గతంలో విశ్వహిందూ పరిషద్ రిలీజ్ చేసిన 400 లవ్ జిహాద్ కేసుల్లో చాలామంది సెలబ్రిటీలున్నారు. అందునా వీళ్లలో పెద్ద స్టార్ డం ఉన్న బాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు ఉండటం విశేషం. అందుకే యాంటీ-కన్వర్షన్ చట్టాన్ని తేవాలని వీహెచ్ పీ డిమాండ్ చేస్తూనే ఉంది.
లవ్ జిహాద్ అనేది అత్యంత హీనమైన, దారుణమైన, క్రూరమైన, అమానవీయమైన విషయం, లవ్ జిహాద్ తో జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లుతుంది, సామాజిక భద్రత కొరవడుతుంది, సామాజికంగా అసహనం మరింత ప్రబలుతుందని వీహెచ్ పీ జాయింట్ సెక్రెటరీ సురేంద్ర జైన్ చెప్పిన మాటలు ఇప్పటికీ వైరల్ గానే నిలుస్తున్నాయి. కానీ అసలు లవ్ జిహాద్ అనేది లాజిక్ లేని ఓ రెచ్చగొట్టే సమీకరణం అని వామపక్షాలు, కాంగ్రెస్ వంటి ఎన్నో పార్టీలు పదేపదే కొట్టిపారేస్తున్నాయి.
ఇప్పుడీ లవ్ జిహాద్.. మహానగరాలు, నగరాలు, పట్టణాలు, పల్లెలు దాటి ఏకంగా ట్రైబల్ బెల్ట్ లోకి కూడా పాకిందని ఝార్ఖండ్ లో తాజాగా జరిగిన ఉదంతాలు ఘోషిస్తున్నయని సంఘ్ పరివార్ ధ్వజమెత్తుతోంది. ఝార్ఖండ్ కు చెందిన రెబికా పహదిన్ అనే ట్రైబల్ క్రిస్టియన్ అమ్మాయి ప్రేమించిన ఓ ముస్లిం అబ్బాయి ఏకంగా 18 ముక్కలుగా నరికి చంపటం సంచలనం సృష్టించింది. దీనిపై యావత్ ఝార్ఖండ్ రాష్ట్రంలో నిరసనలు పెద్ద ఎత్తున సాగాయి.
అమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ వంటి హీరోల భార్యలు లవ్ జిహాద్ బాధితులే అని సంఘ్ పరివార్ వాదిస్తుంటుంది. ఇవన్నీ ఆసక్తికరంగా ఉంటాయి కానీ ఈ ఖాన్ల భార్యలు ఎవరూ ఈమేరకు ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదుకూడా. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మాత్రం నిత్యం రగిలే రావణ కాష్టం లాంటి కొన్ని అంశాల్లో లవ్ జిహాద్ ఒకటి. మత విశ్వాసాలు అనేవి చాలా సున్నితమైన విషయాలు వీటిలో రాజకీయాలు ప్రవేశిస్తే ఎన్నిట్విస్టులు పుడతాయో చెప్పడానికి లవ్ జిహాద్ బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పాలి.
ఈశాన్య రాష్ట్రాలు బంగ్లాదేశ్ వంటి దేశాల వల్ల అక్రమ చొరబాట్లతో బోలెడు సమస్యలు ఎదుర్కొంటుండగా వీరికి అదనంగా వచ్చి చేరిన మరో తలనొప్పి ఈ లవ్ జిహాద్ అని అస్సాం సీఎం హిమంతా బిశ్వా అనటంలో కొంతైనా నిజం ఉండచ్చని ప్రతిపక్ష పార్టీలే అంటుండటాన్ని మనం విస్మరించరాదు.