శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల గుండెజబ్బులు, లైఫ్‌సె్టైల్ సమస్యలు తలెత్తుతాయి. ప్రాసెస్డ్, ఆయిలీ ఫుడ్స్ శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ని పెంచుతాయి. వాటిని తినకుండా గుడ్ కొలెస్ట్రాల్ ఉన్న ఫుడ్స్ తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. బరువు పెరగరు. వీటితో పాటు నిత్యం వ్యాయామాలు కూడా తప్పనిసరిగా చేయాలి. ఇంతకూ ఆ గుడ్ ఫుడ్స్ ఏమిటంటే..
బాగా పీచు ఉన్న పదార్థాలు తినడం వల్ల రక్తంలో కొవ్వు చేరదు. ఫలితంగా శరీరంలో కొలెస్ట్రాల్ పెరగదు. మొలకలు, చిక్కుళ్లు, తృణధాన్యాలు, కిడ్నీ బీన్స్‌లాంటివి తింటే శరీరానికి మంచిది. వీటిల్లో పోషకాలు మెండుగా ఉంటాయి.
నట్స్, రకరకాల సీడ్స్, అవకడోస్ వంటివి శరీరానికి మంచి కొలెస్ట్రాల్‌ని అందిస్తాయి. సాల్మన్, ట్యూనా, సార్డినెస్ చేపల్లో గుడ్ ఫ్యాట్ పుష్కలంగా ఉంటుంది. అంతేకాదు వీటిల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. శరీరంలో పేరుకున్న కొవ్వును తగ్గించడంలో ఇవి ఎంతో శక్తివంతంగా పనిచేస్తాయి.
వెజిటబుల్ ఆయిల్ బదులు ఆలివ్ ఆయిల్ వంటకాల్లో వాడితే మంచిది. ఎందుకంటే వెజిటబుల్ ఆయిల్‌లో కన్నా ఆలివ్ ఆయిల్‌లో ఓలిక్ యాసిడ్, లినోలిక్ యాసిడ్, పాల్మటిక్ యాసిడ్ వంటి మోనోఅన్‌శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ అధిక పరిమాణంలో ఉంటాయి. ఎక్స్‌ట్రా వర్జిన్ ఆలివ్ ఆయిల్ ప్రాసెస్డ్ కాని ఆలివ్ ఆయిల్.
పీచు పదార్థాలు పుష్కలంగా ఉన్న పండ్లు కూడా శరీరం బరువు పెరగకుండా, చెడు కొలెస్ట్రాల్ శరీరంలో చేరకుండా ఉండడానికి ఎంతగానో తోడ్పడతాయి. యాపిల్స్, ద్రాక్ష, స్ట్రాబెర్రీస్, సిట్రస్ పండ్లల్లో పీచు పదార్థాలు బాగా ఉంటాయి. వీటిల్లో యాంటాక్సిడెంట్లు కూడా అధిక మొత్తాల్లో ఉంటాయి. యాంటిఇన్‌ఫ్లమేటరీ సుగుణాలు కూడా ఈ పండ్లల్లో పుష్కలంగా ఉంటాయి. అల్లం, వెల్లుల్లి, పసుపు, నల్లమిరియాలు, దాల్చినచెక్క మసాలాలు గుండెకు చేసే మేలు ఎంతో. రక్తంలోని అధిక కొలెస్ట్రాల్‌ని, ట్రైగ్లిజరైడ్స్‌ని ఇవి తగ్గిస్తాయి. మెంతుల్లో కూడా పీచుపదార్థాలు బాగా ఉన్నాయి. మనం చేసే చాలా వంటకాల్లో మెంతుల్ని తప్పనిసరిగా వాడతాం.