దేశానికి పొంచి ఉన్న ముప్పు నుంచి కాపాడేందుకే రాహుల్ గాంధీ పాద యాత్ర చేపట్టారని తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో 375 కి.మీ రాహుల్ పాదయాత్ర చేశారని..చార్మినార్ లో జెండా ఎగరేసి ప్రజలకు సంపూర్ణ నమ్మకాన్ని కలిగించారన్నారు రేవంత్. మహాత్ముడి స్పూర్తితో రాహుల్ పాదయాత్ర కొనసాగిస్తున్నారని, దేశ సరిహద్దుల్లో ఆక్రమణలు జరుగుతున్నా ప్రశ్నించలేని దౌర్భాగ్య స్థితిలో ప్రధాని మోదీ ఉన్నారని రేవంత్ మండిపడ్డారు. రాహుల్ గాంధీ హెచ్చరించినా దేశ భద్రతపై మోదీ ప్రభుత్వానికి పట్టింపు లేదన్న రేవంత్.. రాహుల్ పాదయాత్ర భయంతోనే మోదీ కోవిడ్ రూల్స్ తీసుకొస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ చేతిలో ర్రాష్ట్రంలో విధ్వంసం జరిగిందని, రాష్ట్రానికి రావాల్సిన వాటిపై కేసీఆర్ ఎందుకు నిలదీయడం లేదని రేవంత్ ప్రశ్నించారు. మనకున్న సమస్యలను పక్కనబెట్టి ప్రజల కోసం కదలాలని, జనవరి 26 నుంచి హాత్ సే హాత్ జోడో యాత్రకు కదలి రావాలని పిలుపునిచ్చారు. వ్యక్తిగత సమస్యలపై కాకుండా ప్రజా సమస్యలపై పోరాడేందుకు ముందుకు రావాలని శ్రేణులను ఆయన కోరటం విశేషం. దేశ ప్రజలకు, కాంగ్రెస్ శ్రేణులకు, అందరికీ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు రేవంత్ రెడ్డి.