Saturday, November 23, 2024
HomeNewsKerala blasts: కేరళ పేలుళ్లపై అనవసర రాద్ధాంతం

Kerala blasts: కేరళ పేలుళ్లపై అనవసర రాద్ధాంతం

గ్రూపు సభ్యులు జాతి వ్యతిరేక భావాలను పెంపొందిస్తున్నారు

కేరళలోని ఒక చర్చిలో ఇటీవల పేలుళ్లు సంభవించి ముగ్గురు ప్రాణాలు కోల్పోవడం, సుమారు యాభై మంది క్షతగాత్రులు కావడం ఆ రాష్ట్రంలనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. కేరళలోని కలమచ్చేరిలో ఉన్న ఈ చర్చిలో గత ఆదివారం ‘జెహోవా విట్నెసెస్‌’ అనే 2,000 మంది సభ్యుల గ్రూపు ఒకటి ప్రార్థన సమావేశం నిర్వహిస్తుండగా, ఈ పేలుళ్లు సంభవించాయి. మార్టిన్‌ డొమినిక్‌ అనే వ్యక్తి ఆ తర్వాత సోషల్‌ మీడియాలో తానే ఈ పేలుళ్లకు కారణమని చెప్పి పోలీసులకు లొంగిపోవడం జరిగింది. ఈ ‘జెహోవా విట్నెసెస్‌’ గ్రూపులో తాను కూడా సభ్యుడిగా ఉండేవాడినని, తనను వారు బహిష్కరించడంతో తాను చర్యకు పాల్పడ్డానని అతను పోలీసులకు చెప్పాడు. ఈ సంస్థ దేశ వ్యతిరేక భావాలను పెంపొందిస్తుండడంతో తాను ఈ సంస్థను ఏదో విధంగా శిక్షించే ఉద్దేశంతో ఈ చర్యకు పాల్పడ్డట్టు కూడా అతను చెప్పాడు. పోలీసులు అతన్ని కస్టడీలో విచారించి, అతనే నేరాన్ని చేసినట్టు నిర్ధారించుకుని, అతని మీద ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేయడం జరిగింది. అతను ప్రమాదకర పేలుడు పదార్థాలను ఒక షాపింగ్‌ బ్యాగులో పెట్టి పేలుళ్లు జరిపినందువల్ల అతని మీద ప్రత్యేకంగా దర్యాప్తు జరపడానికి ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అతనొక్కడే ఈ చర్యకు పాల్పడ్డాడా లేక అతని వెనుక ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో ఈ బృందం దర్యాప్తు జరుపుతుంది. ఇక జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌.ఐ.ఏ), నేషనల్‌ సెక్యూరిటీ గార్డు సంస్థ కూడా రంగంలోకి దిగి, తమ వంతు దర్యాప్తును చేపట్టాయి.
ఈ సంఘటనపై పెద్ద ఎత్తున మతోన్మాదం పెరగడం, పుకార్లు వ్యాపించడం తీవ్రంగా ఆందోళన కలిగించింది. పేలుళ్లు సంభవించిన క్షణం నుంచి మార్టిన్‌ లొంగిపోయే వరకు, ఈ మధ్య సమయంలో, రెండు మతాల వారి మధ్య సోషల్‌ మీడియాలో దూషణ పర్వం ప్రారంభం అయిపోయింది. పరస్పర ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తాయి. అంతేకాదు, కేరళ జిహాదీలకు ప్రధాన స్థావరంగా మారిందనే భయాన్ని కూడా వ్యాపించే ప్రయత్నం జరిగింది. పాలస్తీనాకు సంఘీభావం ప్రకటిస్తూ కొన్ని రాజకీయ, సామాజిక సంస్థలు ప్రదర్శన జరుపుతున్న సమయంలోనే ఈ పేలుళ్లు సంభవించడం వల్ల ఈ రకమైన అనుమానాలు వెల్లువెత్తాయి. మత కలహాలు ప్రారంభమయ్యాయనే వదంతులు శరవేగంగా వ్యాపించాయి. ఒక కేంద్ర మంత్రి కేరళ ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోందంటూ తీవ్రంగా విమర్శించడం, దానికి కేరళ ముఖ్యమంత్రి సమాధానం చెప్పడం వంటివి కూడా జరిగాయి.
ఈ దుర్ఘటనపై దర్యాప్తు జరిగి, వివరాలు వెల్లడి కాకుండానే విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకోవడం, రాజకీయ పార్టీలు సైతం ఇటువంటి వ్యవహారాలపై బాధ్యతారహితంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. దేశంలోని ఒక రాష్ట్రాన్ని వేరు చేసి, దానిపై విమర్శలు కురిపించడం భావ్యంకాదు. మార్టిన్‌ వ్యవహారం మీద దర్యాప్తు జరిపిన పోలీసులు అతను అసాంఘిక, అవాంఛనీయ చర్యలకు పాల్పడ్డాడనే నేరంపై ఎఫ్‌.ఐ.ఆర్‌ నమోదు చేయడం జరిగింది. ఇక చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఎంతో సాత్వికంగా, మెతకగా కనిపించిన మార్టిన్‌ ఇటువంటి దారుణ హత్యాకాండకు పాల్పడ్డాడంటే ఆశ్చర్యం కలుగుతోంది. కొందరు గ్రూపు సభ్యులు జాతి వ్యతిరేక భావాలను పెంపొందిస్తున్నట్టు అతను ఆరోపించడాన్ని బట్టి సామాజికంగా ఏదో దుష్ప్రభావం వ్యాప్తి చెందుతున్నట్టు కనిపిస్తోంది. మానసిక పరిస్థితి సరిగ్గా ఉన్న వ్యక్తులు ఇటువంటి కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉండదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News