Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్People's Road by Miracle man: చేయీ చేయీ కలిపి 100 km రోడ్డు

People’s Road by Miracle man: చేయీ చేయీ కలిపి 100 km రోడ్డు

ఆర్మ్ స్ట్రాంగ్ పేమ్ నిజంగానే 'మిరకిల్ మ్యాన్ ఆఫ్ ఇండియా'


దృఢసంకల్పం ఉంటే మానవుడు ఏదైనా సాధించగలడు అనే విషయానికి సూచికగా కృషితోనాస్తి దుర్భిక్షం అనే సామెత మనుగడలోకి వచ్చి ఉంటుంది. లేకపోతే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉండే ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లోని మారుమూల ప్రాంతమైన టౌసె మ్‌ సబ్‌ డివిజన్‌లో 100 అడుగుల రహదారిని ఎటువంటి ప్రభుత్వ సహాయం లేకుండా కేవలం సాధారణ ప్రజల సౌజన్యంతో నిర్మించడం సాధ్యమయ్యే పనేనా! ఈ విచిత్రమైన విషయం నిజరూపం దాల్చడం వెనుక ‘మిరాకిల్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా పేరు గాంచిన ఐఏఎస్‌ అధికారి ఆర్మ్‌ స్ట్రాంగ్‌ పమే అకుంఠిత దీక్ష మరియు ఆ ప్రాంత ప్రజల సమిష్టి కృషి ఉంది. దృఢ సంకల్పం ఉంటే ఎన్ని సవాళ్లను ఎదుర్కొన్నప్పటికీ, మానవుడు తన లక్ష్యసాధనలో కృతకృత్యుడవుతాడని ఒక నూతన ఒరవడికి నాంది పలుకుతాడని ఈ ఉదంతం మనకు తెలియచేస్తుంది. అందుకే భారత మాజీ రాష్ట్రపతి డా. అబ్దుల్‌ కలాం అన్నట్లు కేవలం కలలు కనడమే కాక అవి ఎంత కష్టమైనవి అయినప్పటికీ వాటిని సాకారం చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డాలని ఇది గుర్తుచేస్తుంది. మణిపూర్‌ లోని పర్వత ప్రాంతం నుండి నాగాలాండ్-అస్సాంను అనుసంధానిస్తూ ఆయన చొరవతో ఏర్పడిన 100 కి మీ ఈ రహదారి దీర్ఘకాలంగా నిర్లక్ష్యానికి గురైన సమాజాన్ని జనజీవన స్రవంతిలో భాగస్వాములను చేయడంతో పాటు భవిష్యత్తుపై వారిలో ఆశను రేకిత్తించింది. ముఖ్యంగా, ప్రభుత్వం నుండి ఎటువంటి సహాయం లేకుండానే అతను ఈ ఘనతను సాధించడం మరింత విశేషం. ‘పీపుల్స్‌ రోడ్’ అని సముచితంగా పేరు పెట్టబడిన ఈ రహదారి టౌసెమ్‌ ప్రజలకు సంతోషాన్ని మరియు పరివర్తనను తెచ్చిపెట్టింది, వారికి బయటి ప్రపంచానికి అనుసంధానించే మోటారు మార్గాన్ని అందిస్తుంది. స్థానిక పౌరుల సమిష్టి కృషి, ఆర్ధిక సహాయం, శ్రమదానం మరియు నిశ్చల భాగస్వామ్యంతో క్రౌడ్‌ ఫండింగ్‌ శక్తి ద్వారా సాకారమైన ఈ రహదారికి ‘పీపుల్స్‌ రోడ్‌’ అని నామకరణం చేయడం అత్యంత సముచితం. అభివృద్ధి పనులు మరియు ప్రజల జీవితాలను మెరుగుపరచడం పట్ల ఆర్మ్‌స్ట్రాంగ్‌ పామ్‌ యొక్క నిబద్ధత అతనికి ప్రజల నుండి విస్తృతంగా గౌరవం దక్కేలా చేసింది. పీపుల్స్‌ రోడ్‌ అతని దూరదృష్టికి, అచంచల విశ్వాసానికి, పటిష్టమైన నాయకత్వానికి మరియు సమాజానికి మంచి భవిష్యత్తును సృష్టించాలనే సంకల్పానికి నిదర్శనంగా నిలుస్తుంది.
చిన్ననాటి కష్టాలే లక్ష్యానికి పునాదిఆర్మ్‌ స్ట్రాంగ్‌ పమే మణిపూర్‌లోని తమెంగ్‌లాంగ్‌ జిల్లాలోని టౌసెమ్‌ సబ్‌డివిజన్‌లోని ఇంపా గ్రామంలో జన్మించిన ఆయన మణిపూర్‌లోని ప్రధాన తెగలలో ఒక టైన జీమ్‌ నాగా తెగకు చెందిన వారు. ప్రజల సహకారం ద్వారా దేశంలోని అత్యంత మారుమూల ప్రాంతాల్లో 100 కి.మీ రహదారిని నిర్మించడంలో ఆయన అత్యంత చొరవ చూపి చరిత్ర సృష్టించారు. మారుమూల ప్రాంతాలలో నివసించే కష్టాలు, కడగండ్లను ప్రత్యక్షంగా అనుభవించిన పామె బాల్యం పూర్తిగా ఇంపాలో గడిచింది. సరైన రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు లేని ఆ ప్రాంతం నుండి పాఠశాలకు వెళ్లేందుకు గంటల తరబడి నడిచి వెళ్లాల్సిన దుర్భర పరిస్థితి ఆయన స్మృతిపథంలో మెదులుతూ, ఆ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాల మెరుగు కోసం తనవంతు కృషి చేయాలన్న తపన ఎప్పుడూ వేధిస్తుండేది. మణిపూర్‌లోని తమెంగ్‌లాంగ్‌లోని యునైటెడ్ బిల్డర్స్‌ స్కూల్‌లో పాఠశాల విద్యను పూర్తి చేసిన తర్వాత, అతను షిల్లాంగ్‌లోని సెయింట్‌ ఎడ్మండ్ కళాశాలలో 12వ తరగతిని ఆ తరువాత 2005లో ఢిల్లీలోని ప్రతిష్టాత్మకమైన సెయింట్‌ స్టీఫెన్స్‌ కాలేజీ నుండి భౌతికశాస్త్రంలో బ్యాచిలర్‌ డిగ్రీని సాధించడమే కాక ఐఏఎస్‌ అధికారి కావాలనే తన చిరకాల కోరికను నెరవేర్చుకున్నాడు. 2009లో ఐఏఎస్‌ పరీక్షలో ఉత్తీర్ణుడైన ఆయన మణిపూర్‌ క్యాడర్‌కు ఎంపికయ్యాడు. 2012లో అతను టౌసెమ్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ గా నియమితులయ్యారు. నాగాలాండ్ యొక్క జీమ్‌ నాగా తెగ నుండి ఐఏఎస్‌ అధికారిగా ఎంపికైన తొలి వ్యక్తి ఆయన కావడం విశేషం.
క్రౌడ్‌ ఫండింగ్‌
మౌలిక పౌర సదుపాయాలలో రహదార్లు ముఖ్యమైనవి. సరైన రహదార్లు లేకుండా ఏ ప్రాంతం కూడా అభివృద్ధి సాధించలేదు. టౌసెమ్‌ సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ గా బాధ్యతలు చేపట్టిన ఆయన, మణిపూర్‌ లోని మిగిలిన ప్రాంతాలకు ఈ ప్రాంతాన్ని అనుసంధానించేలా సరైన రహదార్లు లేకపోవడంతో ప్రజలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని పామ్‌ వెంటనే గ్రహించారు. పాఠశాలలకు, కార్యాలయాలకు, ఆస్పత్రికి వెళ్లేందుకు ప్రజలు పడుతున్న ఇబ్బందులను అధిగమించడానికి తగిన పరిష్కారంగా రహదారి నిర్మించాలని నిర్ణయించుకుని నిధులు మంజూరు చేయవలసిందిగా ప్రభుత్వానికి విన్నవించుకోగా నిధుల లేమితో సతమతమవుతున్న ప్రభుత్వం అందుకు నిరాకరించింది. దాంతో, ఈ సమస్య పరిష్కారానికి ప్రజల భాగస్వామ్యమే ఉత్తమమైన మార్గమని భావించిన ఆయన ప్రజల నుండి నిధుల సేకరణ కోసం టౌసెమ్‌లోని గ్రామాలను సందర్శించి వారి సమస్యలపై ప్రజలతో మాట్లాడటం ద్వారా క్రౌడ్‌ ఫండింగ్‌ ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారంలో భాగంగా ఆయన స్థానిక నాయకులు మరియు వ్యాపారులతో సమావేశమవడంతో పాటు సామాజిక మాధ్యమాలను (సోషల్‌ మీడియా) సైతం ఉపయోగించారు. ఆయన చేపట్టిన ఈ కృషి ఫలించి రూ. అర కోటి దాకా దేశ విదేశాల నుండి నిధులు సమకూరడంతో ఆయన తన వంతు బాధ్యతగా రూ.ఐదు లక్షలు కలిపి 2014లో 100 కి.మీ రోడ్డు నిర్మించారు. ఇది టౌసెమ్‌ ప్రజల జీవితాలపై పెను ప్రభావం చూపింది. ఈ రహదారి ద్వారా మణిపూర్‌ లోని ఈ ప్రాంతానికి నాగాలాండ్‌ మరియు అస్సాం రాష్ట్రాలలోని వివిధ ప్రాంతాలతో అనుసంధానం ఏర్పడడంతో ప్రజా రవాణా చాలా సులభతరంగా మారి వాణిజ్య వ్యాపారాలు ఊపందుకుని ఈ ప్రాంత ఆర్థిక అభివృద్ధికి తోడవడంతో పాటు యువతకు ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి.
విద్యార్థుల చైతన్యానికి కృషి
మణిపూర్‌ ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం అహరహం శ్రమించే ఆర్మ్‌ స్ట్రాంగ్‌ పామే పాఠశాల విద్యార్థులను చైతన్యపరిచే ఉద్దేశంతో ఆయన జిల్లా కలెక్టర్‌ గా ఉన్న సమయంలో ప్రతి 2 మరియు 4వ శుక్రవారాలలో ఐదవ తరగతి నుండి పదవ తరగతి వరకు 10 మంది విద్యార్థులను తన కార్యాలయానికి భోజనానికి ఆహ్వానించేవారు. ఈ ప్రత్యేక భేటీ ద్వారా ఆయన వారికి ఒక ఐఏఎస్‌ అధికారి తన జీవితంలో సమాజాభివృద్ధికి ఏ విధంగా తన తోడ్పాటును అందించగలరో వివరించి వారిలో చైతన్యం నింపేందుకు చేసే ప్రయత్నం అత్యంత అభినందనీయం.
పురస్కారాలు
మణిపూర్‌ ప్రజల జీవన ప్రమాణాల పెంపు కోసం అహరహం శ్రమించే ఆర్మ్‌ స్ట్రాంగ్‌ పామే కృషికి గుర్తింపుగా ఆయనను ఎన్నో పురస్కారాలు వరించాయి. 2012లో, ఆర్మ్‌స్ట్రాంగ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కేటగిరీలో సీఎన్‌ఎన్‌ – ‘ఐబీఎన్‌ ఇండియన్‌ ఆఫ్‌ ది ఇయర్‌’ అవార్డును 2015లో భారత దేశపు అత్యంత ప్రసిద్ధ ఐఏఎస్‌ అధికారి అవార్డును, ‘రాజీవ్‌ గాంధీ జాతీయ సద్భావనా అవార్డు’తో పాటు భారత అత్యున్నత పురస్కారాలలో ఒకటైన పద్మశ్రీ ని అందుకున్నారు. ఇవే కాక ఆయనను డ వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం ‘యంగ్‌ గ్లోబల్‌ లీడర్‌ ఆఫ్‌ ది క్లాస్‌’ 2018 గా ప్రకటించింది.
వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరమ్‌ ద్వారా ఆమోదింపబడి ఇంఫాల్‌ లో స్థాపించబడిన గ్లోబల్‌ షేపర్స్‌ కమ్యూనిటీ వ్యవస్థాపకుడు. ఆయన భారత్‌ లోని ప్రతిష్టాత్మక ఐఐఎం, ఐఐటిలు, ఢిల్లీ విశ్వవిద్యాలయం, టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ సైన్సెస్‌ విశ్వవిద్యాలయాలతో సహా వివిధ విశ్వవిద్యాలయాలు మరియు పబ్లిక్‌ ఫోరమ్‌లలో వక్తగా ప్రసంగిస్తుంటారు. ఆయన ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం నుండి ట్రాన్స్‌ఫర్మేషనల్‌ లీడర్‌షిప్‌ కోర్స్‌ను విజయవంతంగా పూర్తి చేసారు.
యేచన్‌ చంద్ర శేఖర్‌
మాజీ రాష్ట్ర కార్యదర్శి
ది భారత్‌ స్కౌట్స్‌, గైడ్స్‌, తెలంగాణ

- Advertisement -

-8885050822
9866656907

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News