Tuesday, November 26, 2024
Homeఓపన్ పేజ్Pakistan: శరణార్థులపై పాక్‌ వేటు

Pakistan: శరణార్థులపై పాక్‌ వేటు

దేశంలోని అనధికారిక శరణార్ధులు, వలసదారులంతా అక్టోబర్‌ 31 నాటికి వారి వారి దేశాలకు వెళ్లిపోవాలంటూ పాకిస్థాన్‌ మధ్యంతర ప్రభుత్వం జారీ చేసిన హుకుం పూర్తి స్థాయిలో పని చేస్తున్నట్టు కనిపించడం లేదు. అయితే, లక్షలాది మంది అఫ్ఘానిస్థాన్‌ శరణార్థులను మాత్రం ఇది ఆందోళనలో పడేసింది. ఏదో ఒక దేశాన్ని లక్ష్యంగా చేసుకుని తాము ఈ ఆదేశాలను జారీ చేయడం లేదని పాక్‌ ప్రభుత్వం వివరణ ఇచ్చింది కానీ, అది లక్ష్యంగా పెట్టుకున్నది. అఫ్ఘాన్‌ పౌరులనే అన్న విషయం అందరికీ అర్థమైపోయింది. గత కొన్ని దశాబ్దాలుగా లక్షలాది మంది అప్ఘాన్‌ శరణార్థులు పాకిస్థాన్‌ లో తలదాచుకుంటున్నారు. అఫ్ఘానిస్థాన్‌ లో అంతర్యుద్ధం ప్రారంభం అయినప్పుడు, ఆ తర్వాత అక్కడ తాలిబాన్‌ ప్రభుత్వం ఏర్పడినప్పుడు వీరంతా పాకిస్థాన్‌కు పారిపోయి రావడం జరిగింది. ఐక్యరాజ్య సమితి లెక్కల ప్రకారం 13 లక్షల మంది అఫ్ఘాన్లు ఇక్కడ శరణార్థులుగా ఉంటున్నారు. మరో 8.80 లక్షల మందికి చట్టబద్ధంగా పౌరసత్వం లభించింది.
అయితే, పాకిస్థాన్‌లో 17 లక్షల మంది చట్టవిరుద్ధంగా ఇక్కడ నివాసాలు ఉంటున్నారని, వారిలో ఎక్కువ శాతం మంది అఫ్ఘానిస్థాన్‌ పౌరులేనని పాకిస్థాన్‌ ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021లో తాలిబాన్లు అఫ్ఘానిస్థాన్‌ లో అధికారం చేజిక్కించుకున్న తర్వాత, సుమారు ఆరు లక్షల మంది పాకిస్థాన్‌ కు పారిపోయి వచ్చారని కూడా అది వివరించింది. 1980లలో రష్యా అఫ్ఘానిస్థాన్‌ ను ఆక్రమించుకున్న తర్వాత లక్షలాది మంది పాకిస్థాన్‌ కు పారిపోయి వచ్చారని కూడా తెలిపింది. కాగా, కొద్ది రోజుల క్రితం పాకిస్థాన్‌ ఒక ప్రకటన చేస్తూ, శరణార్థులు, చట్ట విరుద్ధంగా తమ దేశంలో నివసిస్తున్నవారు తమకు తాముగా పాకిస్థాన్‌ నుంచి నిష్క్రమించడం మంచిదని, లేని పక్షంలో వారిని బలవంతంగా పంపించేయడమో, నిర్బంధించడమో జరుగుతుందని స్పష్టం చేసింది. చట్ట విరుద్ధంగా ఉంటున్న వలసదార్లను పంపించేయడానికి పాకిస్థాన్‌ ఇప్పటికే అనేక ప్రాంతాలలో రవాణా కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈ పరిస్థితుల్లో వేలాది మంది అఫ్ఘాన్లు అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో దిక్కుతోచని స్థితిలో ఉండిపోయారు.
చాలామంది శరణార్థులు, వలసదార్లు ఏదో ఒక క్షణంలో అరెస్టయ్యే పరిస్థితి నెలకొని ఉంది. అంతేకాక, ఈ కారణంగా పాకిస్థాన్‌ లో హింసా విధ్వంసకాండలు చెలరేగే ప్రమాదం కూడా ఏర్పడింది. పాకిస్థాన్‌ లో మానవత్వానికి సంబంధించిన విషాదం తలయెత్తే అవకాశం ఉందంటూ ఐక్యరాజ్య సమితి ఇప్పటికే హెచ్చరించింది. చట్టవిరుద్ధంగా పాకిస్థాన్‌ లో లక్షలాది మంది విదేశీయులు ఉండిపోవడం వల్ల దేశంలో నేరాల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోందని, ఉగ్రవాద దాడులు కూడా పేట్రేగుతున్నాయని, పాకిస్థాన్‌ మీద ఆర్థిక భారం రోజురోజుకూ అధికం అవు తోందని పాకిస్థాన్‌ ప్రభుత్వం వాదిస్తోంది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 24 ఆత్మాహుతి దాడులు జరిగాయని, ఇందులో 14 దాడులు అఫ్ఘాన్‌ జాతీయులే జరిపారని పాకిస్థాన్‌ ఆంతరంగిక వ్యవహారాల శాఖ మంత్రి సర్ఫ్రాజ్‌ బుగ్తీ గత అక్టోబర్‌ 3న వెల్లడించారు. ఆయన అదే రోజున శరణార్థుల నిష్క్రమణకు కూడా ఆదేశాలు జారీ చేశారు.
జనవరిలో ఎన్నికలు జరగబోతున్న పాకిస్థాన్‌ లో ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి పరమ అధ్వానంగా ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. విదేశీ మారక నిల్వలు అడుగంటి పోయాయి. ఇతర దేశాలకు దిగుమతుల వ్యయాన్ని చెల్లించలేని పరిస్థితిలో ఉంది. రూపాయి విలువ గణనీయంగా తగ్గిపోతోంది. అయితే, అమెరికా, చైనాతో సహా కొన్ని దేశాలు ఈ శరణార్థులను పంపేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. శరణార్థులను బలవంతంగా పంపేయడం వల్ల పాకిస్థాన్‌ సమస్యలన్నీ పరిష్కారం అవుతాయనుకుంటే పొరపాటేనని అవి వ్యాఖ్యానిస్తున్నాయి. పాకిస్థాన్‌ పాలకుల కారణంగానే ఆ దేశాన్ని సమస్యలు, సంక్షోభాలు చుట్టుముడుతున్నాయని అవి పేర్కొన్నాయి. ఇక్కడి సైనిక వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థల మధ్య నువ్వా నేనా స్థాయి పోరాటాలు, పంతాలు, పట్టింపులు, అధికారం తమ గుప్పిట్లో ఉంచుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు వగైరాల వల్ల అక్కడి ఆర్థిక వ్యవస్థ నిర్లక్ష్యానికి గురయిందని అవి భావిస్తున్నాయి.
ఇక పాకిస్థాన్‌ భద్రత విషయానికి వస్తే, ఉగ్రవాదుల విషయంలో పాకిస్థాన్‌ అనుసరించిన ద్వంద్వ ప్రమాణాల కారణంగానే ఆ దేశం ఇప్పుడు ఉగ్రవాద ధోరణులతో అగచాట్లు పడుతోందనడంలో సందేహం లేదు. కొన్ని ఉగ్రవాద సంస్థలతో పోరాడడం, మరికొన్ని ఉగ్రవాద సంస్థలను ప్రోత్సహించడం వంటి కారణాల వల్ల పాకిస్థాన్‌ ఈ దుస్థితి తెచ్చుకుంది. పాకిస్థాన్‌ ప్రభుత్వ, సైనిక వ్యవస్థల మద్దతుతో 2021లో తాలిబాన్లు అఫ్ఘానిస్థాన్‌ ను తిరిగి స్వాధీనం చేసుకుని, అధికారానికి వచ్చినప్పుడు, దాన్ని పాకిస్థాన్‌ సైనిక వ్యవస్థ విజయంగా పరిగణించి వేడుకలు జరుపుకోవడం జరిగింది. అయితే, ఆ విజయం వల్ల ఏర్పడిన ఆనందోత్సాహాలు ఎక్కువ కాలం నిలవలేదని ఇప్పటి పాకిస్థాన్‌ భద్రతా సంక్షోభాన్ని బట్టి అర్థమవుతోంది. అఫ్ఘానిస్థాన్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉభయ దేశాల మధ్య ప్రతి నిత్యం పోరాటాలు జరుగుతూనే ఉన్నాయి. తమ విధానాల వైఫల్యాన్ని పక్కన పెట్టి పేద, అమాయక శరణార్థుల మీద పాకిస్థాన్‌ తన ప్రతాపాన్ని ప్రదర్శిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News