Friday, September 20, 2024
HomeతెలంగాణPadi Kaushik: హుజురాబాద్ ను సిద్దిపేట చేస్తా

Padi Kaushik: హుజురాబాద్ ను సిద్దిపేట చేస్తా

మీ బిడ్డగా అడుగుతున్న ఒక్క అవకాశం ఇవ్వండి

స్వాతంత్రం వచ్చిన తర్వాత 70 ఏళ్లలో కాంగ్రెస్, టిడిపిలు చేయలేని అభివృద్ధిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తొమ్మిదేళ్లలో చేసి చూపించాడని ఎమ్మెల్సీ బిఆర్ఎస్ పార్టీ హుజురాబాద్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. హుజురాబాద్ మండలం బొత్తలపల్లి, జూపాక, రాంపూర్, రంగపూర్, కమలాపూర్ మండలం ఉప్పలపల్లి, ఉప్పల్ లతో పాటు హుజురాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 22, 23, 25, 29, 30 వార్డుల్లో మంగళవారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ… స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ 50 ఏళ్లకు పైగా అధికారంలో ఉన్నప్పటికీ తెలంగాణకు చేసిందేమీ లేదని, కనీసం 70 సంవత్సరాల కాలంలో తెలంగాణ ప్రజలకు తాగునీరు, సాగునీరు కూడా సరిగా అందించలేదన్నారు. కాంగ్రెస్ పాలనలో జనాలు త్రాగునీరు లేకుండా హరిగోసపడ్డారని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బిఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులు, చెరువులు, చెక్ డ్యాములు నిర్మించుకొని తెలంగాణ ప్రజల నీటి సమస్య తీర్చింది అన్నారు. దేశంలోనే ఎక్కడ లేని విధంగా 24 గంటల ఉచిత కరెంటు రైతుకు అందించడంతో పాటు 19 వేల కోట్ల రుణమాఫీ కూడా చేసింది బిఆర్ఎస్ ప్రభుత్వమేనని అన్నారు.

తెలంగాణ ప్రజల బాగోగుల కోసం ఆలోచించి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిందని, వాటి వల్ల తెలంగాణ ప్రజల మొహాల్లో ఆనందం చిగురించిందన్నారు. బిఆర్ఎస్ పార్టీతోనే తెలంగాణకు సంక్షేమమని అన్నారు. తెలంగాణ ప్రజల కోసం ఆలోచించి కొత్త మేనిఫెస్టో తయారు చేశారని దీనిలో ముఖ్యమంత్రి కేసీఆర్ మరిన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చారన్నారు.

నా కష్టాన్ని గుర్తించి ఒక్కసారి అవకాశం ఇచ్చి గెలిపిస్తే రెట్టింపు ఉత్సాహంతో మీకు సేవ చేసుకుంటానని అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గం సిద్దిపేట తరహాలో వేయికోట్లతో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. హుజురాబాద్ లో మినీ కలెక్టరేట్ ఏర్పాటు చేస్తానని, మాట ఇచ్చిన ప్రకారమే స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా రూ,10 కోట్లతో నిర్మించబోతున్నానన్నారు. విశాలమైన గెస్ట్ హౌస్ తో పాటు అన్ని వసతులతో పోలీస్ స్టేషన్ కూడా కొత్తగా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. గృహలక్ష్మి, బీసీ బందు కోసం దరఖాస్తు చేసుకున్న వారందరికీ ఎన్నికల అనంతరం చెక్కులు పంపిణీ చేస్తామన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీమంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి, టూరిజం డెవలప్మెంట్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర కార్యదర్శి బండ శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
వర్షంలోనూ కౌశిక్ రెడ్డికి మద్దతు తెలిపిన ప్రజలు…..
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హుజురాబాద్ నియోజకవర్గంలోని రాంపూర్, రంగాపూర్ గ్రామాలలో పాడి కౌశిక్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా వర్షం మొదలైంది. వర్షానికి ప్రచారం ఎక్కడ అంతరాయం కలుగుతుందో అని అనుకున్నప్పటికీ ప్రజలు మాత్రం వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ప్రసంగం పూర్తయ్యేంత వరకు ఎక్కడున్నవారు అక్కడే నిల్చున్నారు. వారిచ్చిన మద్దతుకు కౌశిక్ రెడ్డి వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News