Suryakumar Yadav : మౌంట్ మాంగనుయ్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగాడు. సిక్సర్లు, ఫోర్లతో విరుచుపడ్డాడు. ఫలితంగా టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191పరుగులు చేసింది. ప్రత్యర్థి కివీస్ ముందు 192 పరుగుల టార్గెట్ ఉంచింది.
సూర్య ఒక్కడే..
సీనియర్ల గైర్హాజరీలో ఇషాన్ కిషన్, పంత్‌లు ఓపెనర్లు గా వచ్చారు. తన పేలవ ఫామ్‌ను కొనసాగిస్తూ పంత్ 13 బంతుల్లో 6 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. దీంతో 36 పరుగలకే భారత్ తొలి వికెట్ కోల్పోయింది. వన్‌డౌన్‌లో వచ్చిన సూర్యకుమార్ యాదవ్(111 నాటౌట్; 51 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లు) తన అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తూ కివీస్ బౌలర్లను ఓ ఆట ఆడుకున్నాడు. తనదైన ట్రేడ్ మార్క్ షాట్లతో అలరించాడు. ఇషాన్ కిషన్(36; 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్), శ్రేయాస్ అయ్యర్(13), హర్థిక్ పాండ్య(13) ల అండతో తనకే సాధ్యమైన షాట్లతో మైదానం నలువైపులా బౌండరీలు బాదాడు. 32 బంతుల్లో అర్థశతకం పూర్తి చేసిన సూర్య ఆ తరువాత వేగం పెంచాడు. కేవలం 49 బంతుల్లోనే శతకం సాధించాడు. టీ20ల్లో ఇది సూర్యకు రెండో శతకం. న్యూజిలాండ్ బౌలర్లలో సౌథీ మూడు వికెట్లు తీయగా, ఫెర్గూసన్ రెండు, ఇష్ సోథీ ఓ వికెట్ పడగొట్టాడు.
సౌథీ హ్యాట్రిక్..
కివీస్ సీనియర్ బౌలర్ టిమ్ సౌథీ ఆఖరి ఓవర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. హ్యాట్రిక్ వికెట్లు తీశాడు. వరుసగా హార్థిక్ పాండ్య, హుడా, సుందర్ వికెట్లు తీసి టీ20ల్లో రెండో సారి ఈ ఘనతను అందుకున్నాడు.