50 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎన్నడు వ్యవసాయం గానీ, వ్యాపారంగాని చేయలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీని మాత్రమే నమ్ముకుని పనిచేస్తే అధిష్టానం నా సీనియారిటీ, సిన్సియార్టీకి విలువ ఇవ్వకుండా అవమానపరిచిందని మాజీ మంత్రి టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు సంభాని చంద్రశేఖర్ ఆవేదన చెందారు. నీతి నిజాయితీలతో పార్టీలో పనిచేసి, పార్టీ అభివృద్ధి కోసం ఎన్నో అవమానాలు భరించానని, ఏ పదవి లేకపోయినా సత్తుపల్లి నియోజకవర్గంలో 15 సంవత్సరాల నుండి పార్టీ కోసం పని చేస్తున్నానని అన్నారు. నియోజకవర్గంలో మండల, గ్రామ, బూత్, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళా, యూత్, కిసాన్ సెల్ కమిటీలతో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసి, నియోజకవర్గంలో 45 వేల డిజిటల్ సభ్యత్వాలు చేసి పార్టీని బలోపేతం చేయటంలో ముందున్నానని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ టికెట్ల విషయంలో వేరే పార్టీ నుంచి వచ్చిన వలస పక్షులకు టిక్కెట్లు ఇచ్చి పార్టీ సిద్ధాంతాలను తుంగలో తొక్కిన వ్యవహార శైలి బాధాకరమని అన్నారు. నా రాజకీయ భవిష్యత్ ను ప్రశ్నార్థకంగా మార్చిందని, నమ్మించి గొంతు కోసిందని అన్నారు. టిక్కెట్ కేటాయింపులో అధిష్టాన నిర్ణయం తెలిపేంత వరకు పార్టీకి వ్యతిరేకంగా కాదు కానీ పార్టీ కార్యకలాపాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొనేది లేదని అన్నారు. గతంలో నమ్ముకున్న కార్యకర్తలకు పనితీరును బట్టి పదవులు ఇచ్చే వారిని, ప్రస్తుతం కాంగ్రెస్ వ్యవస్థ కార్పొరేట్ చేతుల్లోకి పోయిందని రాజకీయ వ్యవస్థ మొత్తం బ్రష్టు పట్టిందని ఆవేదన చెందారు. కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకునేందుకు నిరాకరించి, ఎగతాళి చేసిన వారికే టిక్కెట్లు ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని అన్నారు. పార్టీ టికెట్ల కేటాయింపులో పార్టీలో ఎంత కాలం పని చేశారు, సభ్యత్వాలు ఎన్ని చేయించారనేది ప్రధాన ప్రశ్న. నియమ నిబంధనలను మరచి ఇష్టం వచ్చినట్లు టిక్కెట్లు కేటాయించడం కాంగ్రెస్ పార్టీ ఉనికే ప్రమాదం అని అన్నారు. ఇటువంటి నీచ రాజకీయాలను నా 50 ఏళ్ల రాజకీయ అనుభవంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పార్టీ పదవులకు మూకుమ్మడిగా రాజీనామాలు చేసిన నాయకులు
సత్తుపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ మాజీ మంత్రి సంభాని చంద్రశేఖరకు ఇవ్వకుండా అవమాన పరిచినందుకు నిరసిస్తూ పీసీసీ సభ్యులు బైరెడ్డి మనోహర్ రెడ్డి, స్టేట్ ఎస్సీ డిపార్ట్మెంట్ కన్వీనర్ కొండూరు కిరణ్, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు పుచ్చకాయల సోమిరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దగ్గుల రఘుపతి రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కాపా సుధాకర్, పెద్దబోయిన దుర్గా ప్రసాద్, చెలికాని రాజబాబు, కాసర చంద్రశేఖర్ రెడ్డి, శివా వేణు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కొర్రపాటి సాల్మన్ రాజు, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట రాజేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కొదమ సింహం వంశీ, కిరణ్, వేణు, వర్కింగ్ ప్రెసిడెంట్లు కాలం కృష్ణ, మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు కనపర్తి కుమారి, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, బూత్ కమిటీ నాయకులు, గ్రామ కమిటీ నాయకులు, ఎన్రోలర్స్, పార్టీ అనుబంధ సంఘాలు తదితరులు మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు. సంబాని ఏ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఉంటామని సంభానికి న్యాయం జరిగేంత వరకు ఆయన వెంట మేమంతా ఉంటామని అన్నారు.