కల్లూరు మండల పరిధిలోని చిన్నటేకూరులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సోషియల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజి విద్యార్థి పాము కాటుకు గురయ్యాడన్న సమాచారంతో జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సోమవారం రాత్రి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సోషియల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం చదువుతున్న దినకర్ అనే విద్యార్థికి కడుపు నొప్పి రావడంతో పాము కాటుకు గురై ఉండొచ్చన్న అనుమానంతో హుటాహుటిన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో చేర్చారు.
ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కు సమాచారం రావడంతో ఆ కళాశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థి నిద్రించిన డార్మెటరీతోపాటు పరిసరాలను పరిశీలించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండడాన్ని గమనించారు. అయినప్పటికీ పాములు ఏమైనా తిరుగుతున్నాయేమోనని అనుమానంతో పాములు పట్టే వారిని పిలిపించి పరిశీలించాలని కలెక్టర్ వైస్ ప్రిన్సిపల్ వీర ప్రతాప్ ని ఆదేశించారు.
రాత్రి సమయంలో విద్యార్థులు బయటి ప్రదేశాలలో తిరగారా అన్న విషయాన్ని సీసీ కెమెరాల ఫుటేజ్ ని పరిశీలించాలని కాలేజీ సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుతం దినకర్ కర్నూల్ ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో వైద్యం పొందుతున్నారని, విద్యార్థికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యాధికారులను కలెక్టర్ ఆదేశించారు. వీరి వెంట కల్లూరు మండలం తహసీల్దార్ రమేష్ బాబు, కళాశాల సిబ్బంది ఉన్నారు.