Friday, October 4, 2024
HomeతెలంగాణSeethakka: నామినేషన్ దాఖలు చేసిన సీతక్క

Seethakka: నామినేషన్ దాఖలు చేసిన సీతక్క

5000 మందితో ర్యాలీతో బలం చాటిన సీతక్క

ఈ నెల 30న జరగనున్న శాసనసభ ఎన్నికలలో పోటీ చేయడానికి కాంగ్రెస్ అభ్యర్థి ధనసరి అనసూయ ( సీతక్క) తన నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఉదయం 11 గంటల సమయంలో ములుగు సమీపంలోని ఘట్టమ్మ దేవాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సమీపంలోని ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 12 గంటల సమయంలో చేరుకున్నారు. సీతక్కతో పాటు బలపరిచిన పార్టీ నాయకులు ఆక రాధాకృష్ణ, పైడాకుల అశోక్, గొల్లపల్లి రాజేందర్ గౌడ్, సీతక్క కోడలు కుసుమాంజలి ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారి అంకిత్ కు అందజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా 5,000 మందికి పైగా కార్యకర్తలతో ఆర్వో కార్యాలయం నుండి ములుగులోని లీలా గార్డెన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సీతక్క మేడారంలోని సమ్మక్క సారలమ్మ దీవెనలు పొందడానికి వెళ్లారు. నన్ను ఓడించేందుకు కేసీఆర్ కుట్ర….. బిఆర్ఎస్ పార్టీకి ఓటరు తగిన గుణపాఠం చెబుతారు ములుగు నియోజకవర్గంలో తనను ఓడించేందుకు సీఎం కేసీఆర్ కుట్ర పన్నారని ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులను ఇక్కడ ప్రాంతంలో దింపి విచ్చలవిడిగా డబ్బులను పంపిణీ చేస్తున్నారని, రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీకి ఓటర్లు తగిన గుణపాఠం చెప్తారని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ధనసరి సీతక్క అన్నారు.

నామినేషన్ వేసిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ తాను ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ అన్ని సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి సహకరించానని, నియోజకవర్గ ప్రజలే తన కుటుంబ సభ్యులుగా భావించి పని చేశారని అన్నారు. ప్రజలలో మన్ననలు పొందిన తనను ఓడించడానికి సీఎం కేసీఆర్ కుట్ర పన్ని ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులను ఇక్కడికి దింపి విచ్చలవిడిగా డబ్బులు పంపిణీ చేస్తూ తమ పార్టీకి చెందిన నాయకులను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. గత కొద్ది కాలంగా తాను రాజకీయాలు చేయకుండా మంచితనంతో ముందుకు పోయానని ఇకనుండి రాజకీయాలు చేస్తూ తన ప్రతాపం ఏమిటో చూపిస్తానని హెచ్చరించారు. కరోనా సమయంలో ప్రభుత్వం కనీసం మాస్కులు పంపిణీ చేయనప్పుడు తన సొంత డబ్బులతో మాస్కులు పంపిణీ చేయడమే కాకుండా నిత్యవసర వస్తువులను అందించడం జరిగిందని, భారీ వర్షాల కారణంగా సర్వస్వం కోల్పోయిన కుటుంబాలకు తాను అండగా నిలిచాను అని అన్నారు. ప్రశ్నించే గొంతుకలపై ప్రభుత్వం దౌర్జన్యాలు, దాడులు చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు.

తనను ఒక ఆడబిడ్డగా భావించి రానున్న ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రానున్న రోజులలో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రపంచంలోనే అతిపెద్ద పర్యటక ప్రాంతంగా తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, ఆకా రాధాకృష్ణ, గొల్లపెల్లి రాజేంద్ర గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News