రైతులు, కార్మికులు, కర్షకులు, మహిళలు ప్రతి ఒక్కరూ భారతీయ జనతా పార్టీకి మద్దతు ప్రకటిస్తున్నారు.. వారి మద్దతుతో త్వరలో జరగబోయే ఎన్నికల్లో తాను భారతీయ జనతా పార్టీ షాద్నగర్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా గెలవబోతున్నానని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అందే బాబయ్య అన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే అభ్యర్థిత్వానికి తన నామినేషన్ దాఖలు చేయడానికి ఆర్డీవో కార్యాలయానికి వెళ్లేందుకు భారీ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించారు. ఈ ర్యాలీలో సుమారు పదివేల నుంచి 20 వేల మధ్య పార్టీ శ్రేణులు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నామినేషన్ ఘట్టానికి ముఖ్య అతిథులుగా కేంద్ర మంత్రివర్యులు శర్వానంద్ సోనావాల్, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శ్రీవర్ధన్ రెడ్డి, ఇతర పార్టీ ముఖ్యులు, శ్రేణులు, నాయకులు తదితరులతో కలిసి ఆర్డీఓ కార్యాలయంలో నామినేషన్ వేశారు.
ఈ సందర్భంగా మీడియాతో కేంద్రమంత్రి శర్వానంద్ సోనావాల్, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అందే బాబాయ్యలు మాట్లాడుతూ.. గత తొమ్మిదిన్నర ఏళ్ల పరిపాలనపై విసిగిపోయారని, వ్యవసాయం, వాణిజ్యం, వ్యాపార రంగాలపై ఎంతో ప్రభావం పడిందని దుయ్యబట్టారు. దేశంలో, రాష్ట్రంలో మోడీ ప్రభుత్వం వస్తేనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని, డబుల్ ఇంజన్ సర్కార్తో అభివృద్ధి మరింత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. రోజురోజుకు భారతీయ జనతా పార్టీపై ప్రజల్లో విశ్వాసం, నమ్మకం పెరుగుతుందని, అందుకు అనుగుణంగా తమ పార్టీ అభ్యర్థి అందే బాబయ్య పనిచేస్తారని, ఒకసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గం ప్రజల రుణం తీర్చుకుంటారని కేంద్రమంత్రి ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ కోఆర్డినేటర్ విజయ్ కుమార్, నాయకులు భూపాల చారి, అశోక్ గౌడ్, చెంది మహేందర్ రెడ్డి, పార్టీ నాయకులు, ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు.