నా గెలుపు వనపర్తి ప్రజల గెలుపు అని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం రాజీవ్ చౌక్ లో నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడారు.
నా గెలుపు వనపర్తి రైతన్నల గెలుపు అని, నా గెలుపు యువతీ, యువకుల గెలుపు,
నా గెలుపు వేలాది విద్యార్థిని, విద్యార్థుల గెలుపు అని అన్నారు. వాళ్ల భవిష్యత్ కోసమే అనేక ఉన్నత విద్యా సంస్థలు తీసుకువచ్చానని, వాళ్ల భవిష్యత్ కోసమే గురుకుల పాఠశాలలు తీసుకువచ్చానని, ఈ తరం భవిష్యత్ కోసం అనేక అభివృద్ది కార్యక్రమాలు చేపట్టానని ఆయన అన్నారు.
నేను చేసిన పనులు గమనించి నిర్ణయం తీసుకోండి, మీరు, మీ బంధువులకు వివరించి కారు గుర్తుకు ఓటేయ్యమని చెప్పండి అని ఆయన పిలుపునిచ్చారు. జాకీలు పెట్టి లేపినా కాంగ్రెస్ లేవదని, 40 ఏండ్లు కాంగ్రెస్ పార్టీకి సేవచేసిన చిన్నారెడ్డి పనికి రాలేదు .. 40 దినాల కింద చేరి పైసలిచ్చిన వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని చేసిందని ఆయన అన్నారు. వనపర్తి నుండి గెలిచి వ్యవసాయ శాఖా మంత్రిగా 80 వేల మందికి రైతుబంధు ఇస్తున్నానని, 24 గంటల కరంటు ఇప్పిస్తున్నాను .. 40 వేల మంది ఆసరా ఫించన్లు వస్తున్నాయని,రాష్ట్రంలోనే అత్యధికంగా ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులు తీసుకువచ్చిన నియోజకవర్గం వనపర్తి అని ఆయన అన్నారు.
రోడ్ల విస్తరణను చేపట్టి వనపర్తిని సుందరంగా తీర్చిదిద్దాని, నాగర్ కర్నూలు పార్లమెంటులో ఏడింటికి ఐదుగురు కాంగ్రెస్ అభ్యర్థులు బీఆర్ఎస్ నుండి వెళ్లినవారేనని, బీఆర్ఎస్ పార్టీ బీఫారం మీద గెలుపొందిన పదవికి రాజీనామా చేయనోళ్లు అడ్డం పొడుగు మాట్లాడుతున్నారని, ప్రజలు అవకాశమిస్తే ఎవరైనా ఎమ్మెల్యే కావచ్చు .. కానీ కనీసమైన అర్హత ప్రజలు చూస్తారని, సురవరం ప్రతాపరెడ్డి వంటి మహనీయుని తర్వాత ఉన్నత విద్యావంతులను ఎన్నుకున్న నియోజకవర్గం వనపర్తి అని ఆయన అన్నారు.
బట్టకాల్చి మీదేసే వాళ్లు చాలా మంది ఉన్నారని, నాకంటే ఎక్కువ ఏం పని చేస్తారో చెప్పే వాళ్లను ప్రజలు పరిగణనలోకి తీసుకుంటారని, ప్రజలిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని, మరోసారి అవకాశం ఇస్తే మరింత అభివృద్ది చేసి మీ కళ్ల ముందు పెడతానని ఆయన అన్నారు.
వనపర్తిని రాష్ట్రంలో అగ్రశ్రేణి నియోజకవర్గాల్లో ఒకటిగా నిలబెట్టానని, పార్టీలకు అతీతంగా సమస్యల గురించి మెసేజ్ చేసిన వారికి, కలిసిన వారికి పనిచేసి పెట్టానని, నేను చేసిన పనులు ఇతర పార్టీల వారిని అడిగినా చెబుతారని ఆయన అన్నారు.