Saturday, October 5, 2024
Homeపాలిటిక్స్BJY: నరం చిట్లి నడవలేకపోతున్నా.. భార్య మాత్రం భారత్ జోడో యాత్ర నుంచి బ్రేక్ తీసుకోవద్దంది

BJY: నరం చిట్లి నడవలేకపోతున్నా.. భార్య మాత్రం భారత్ జోడో యాత్ర నుంచి బ్రేక్ తీసుకోవద్దంది

భారత్ జోడో యాత్ర నుంచి బయటికి వద్దామనుకున్నా.. కానీ తన సతీమణి చెప్పినది విని తాను మనసు మార్చుకున్నట్టు చెప్పి అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు షానవాజ్ మంగల్ అజ్మి. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన షానవాజ్ ఓ కాంగ్రెస్ నేత. రాహుల్ వెంట భారత్ జోడో యాత్రలో ఆద్యంతం పాల్గొంటున్న కొందరిలో ఈయన కూడా ఒకరు. అయితే యాత్ర ప్రారంభమైన మొదటి వారంలోనే తాను పాదయాత్ర నుంచి విరామం తీసుకుని, ఇంటికి వచ్చేయాలని అనుకుని తన భార్యకు కాల్ చేసినప్పుడు.. యాత్ర పూర్తయ్యే వరకు ఇంటికి రావద్దని చెప్పినట్టు ఆయన గుర్తుచేసుకున్నారు. ఆమె మాటలు తనకు షాక్ ఇచ్చినా ఏ ఆటంకం వచ్చినా పాదయాత్ర కొనసాగించాలన్న నూతన సంకల్పం తనలో పుట్టేందుకు కారణం తన భార్య మాటలేనంటూ షానవాజ్ వెల్లడించారు. నరం తెగి బాధపడుతున్న తాను పాదయాత్రలో మిగతావారికంటే 3-4 గంటలు ఆలస్యంగా ప్రతిచోటకు వచ్చినట్టు వివరించారు. కాలికి బ్యాండేజ్ కట్టుకుని యాత్రలో కొనసాగినట్టు గుర్తుచేసుకున్నారు. యూపీ కాంగ్రెస్ కమిటీ సెక్రటరీగా పనిచేస్తున్న షానవాజ్ అజ్మీ పాదయాత్రలో పాల్గొనాలని నిర్ణయించుకున్నప్పుడు ససేమిరా వద్దని తన భార్య వారించారని, ఆయన లేకుండా వ్యాపారం ఎవరు చూసుకుంటారని ఆమె వాపోయినట్టు, అలాంటి ఆమె పాదయాత్రను మధ్యలో వదిలి రావద్దని చెప్పటం విశేషమన్నారు. ఈనెలలో భారత్ జోడో యాత్ర కశ్మీర్ చేరుకుంటుంది. జనవరి 3వ తేదీన రెండవ విడత ప్రారంభమయ్యే రాహుల్ పాదయాత్ర సెప్టంబర్ 7న కన్యాకుమారిలో మొదలై 10 రాష్ట్రాల మీదుగా కశ్మీర్ చేరుకోనుంది. పాదయాత్ర ఇప్పటికే 2,800 కిలోమీటర్ల మేర సాగింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News