మధిర నియోజకవర్గం నా ప్రాణం. నియోజకవర్గ అభివృద్ధి నా ఊపిరి. ఊపిరి ఉన్నంతవరకు మధిర నియోజకవర్గ అభివృద్ధికి పరితపిస్తూనే ఉంటాను. మధిర నియోజకవర్గానికి పాలించేవాడైనా కావాలి. ప్రశ్నించేవాడైనా కావాలి అటు ఇటు కానటువంటి వారు మధిరకు అవసరం లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. మధిర నియోజకవర్గంలో సిపిఐ తెలుగుదేశం పార్టీ బలపరిచిన అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ నుంచి భట్టి విక్రమార్క నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గ కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నుంచి తాసిల్దార్ కార్యాలయం వరకు, తిరిగి అక్కడ నుంచి రెడ్డి గార్డెన్ వరకు జన సునామీని తలపించే విధంగా దాదాపుగా 25 వేల మందితో భారీ ర్యాలీ కొనసాగింది.
కదిలి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తల తో మధిర పట్టణ పురవీధులు కిక్కిరిసిపోయాయి. దాదాపు కిలోమీటర్ పైగా ఉన్న ర్యాలీ విజయోత్సవ ర్యాలీని తలపించిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమానికి మహారాష్ట్ర మాజీమంత్రి, ఎన్నికల పరిశీలకులు అవినాష్ వజహర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రెడ్డి గార్డెన్ వద్ద జరిగిన సభలో ప్రజలను ఉద్దేశించి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడారు. పాలించే వానిగా ఉండి నేను డిప్యూటీ స్పీకర్ గా మధిర నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేశానని వివరించారు.
మధిర అంటే ఆషామాషీ కాదు. పోరాటాల గడ్డ, స్వాతంత్ర సంగ్రామ పోరాటంలోనైనా, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలైన మధిర గులాంలాగా బతకలేదని. ఎదిరించి ప్రశ్నించి, పోరాడిందన్నారు. అలాంటి చరిత్ర ఉన్న మధిర ప్రజలను తలదించుకునేలా ఎప్పుడు చేయనని, తల ఎత్తుకునేలానే గౌరవం పెంచే విధంగానే పనిచేస్తానని వెల్లడించారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో బయటకు రావడానికి భయపడుతున్న పరిస్థితుల్లో ప్రజలకు కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆసుపత్రులను పర్యటించి పేదలకు మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చానని చెప్పారు.