Tuesday, November 26, 2024
Homeఓపన్ పేజ్Increasing Child marriages: పెరుగుతున్న బాల్య వివాహాలు

Increasing Child marriages: పెరుగుతున్న బాల్య వివాహాలు

కర్ణాటక బాల్య వివాహాల్లో దేశంలోనే అగ్రస్థానం

మూడు నాలుగేళ్లుగా దేశంలో బాల్య వివాహాలు పెరిగిపోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఉత్తరాది రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో దాదాపు 40 శాతం బాల్య
వివాహాలు పెరిగినట్టు అధికారిక గణాంకాలే తెలియజేస్తుండగా, దక్షిణాదిన తమిళ నాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా దాదాపు 300 శాతం ఈ వివాహాలు పెరిగినట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితిని చక్కదిద్దడానికి కర్ణాటక
రాష్ట్రం ఒక కార్యాచరణ దళాన్ని నియమించగా, తమిళనాడు రాష్ట్రం రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులను అప్రమత్తం చేసింది. ఉత్తరప్రదేశ్ లో బాలికల చదువులను మరింత తప్పనిసరి చేయడంతో పాటు, బాల్య వివాహాలను, బాల కార్మిక వ్యవస్థపై మరింతగా ఉక్కుపాదం మోపింది. కోవిడ్ విజృంభించిన సంవత్సరాల
నుంచి ఈ బాల్య వివాహాల పెరుగుదల ఊపందుకుందని అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. కర్ణాటకలో 2019-20లో 111 బాల్య వివాహాల కేసులు అధికారికంగా బయటపడ్డాయి. ఆ మరుసటి సంవత్సరం ఈ సంఖ్య 276కు, ఆ తర్వాత ఏడాది 418కి పెరిగిపోయింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్రం బాల్య వివాహాల విషయంలో దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ రాష్ట్రం బాల్య వివాహాలకు సంబంధించినంత వరకు మూడేళ్లలో 300 శాతం పెరిగింది. కాగా, దేశవ్యాప్త సగటు 34 శాతం మాత్రమేనని తెలిసింది.

- Advertisement -

కోవిడ్ కాలంలో కరవు పరిస్థితులు కూడా విజృంభించడంతో ఈ ధోరణి ఎక్కువ కావడం మొదలైందని అధికారులు చెబుతున్నారు. పంటలు సరిగ్గా పండకపోవడం, గ్రామాల్లో ఉపాధి పనులు లేకపోవడం తదితర కారణాల వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి అత్యధిక సంఖ్యలో పట్టణాలకు, నగరాలకు వలసలు చోటు చేసుకున్నాయి. ఇందులో చాలా కుటుంబాలు నగరాలకు వలస వెళ్లే ముందు తమ బాలికలకు వివాహాలు చేయడం జరిగింది. దేశంలో ఎక్కడ చూసినా దాదాపు ఇదే పరిస్థితి చోటు చేసుకుంది. కోవిడ్ సమయంలోనే కాక, ఆ తర్వాత కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెద్ద ఎత్తున సహాయ, ఉపాధి చర్యలు చేపట్టినప్పటికీ, గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఈ సహాయ చర్యలతో సంతృప్తి చెందక వలసలకు పాల్పడ్డట్టు అధికారులు చెబుతున్నారు. కర్ణాటకలోని చామరాజనగర్, హసన్, బీదర్, యాద్గిర్, రాయచూర్ వంటి
వెనుకబడిన ప్రాంతాలతో పాటు, సంపన్న జిల్లాలైన మైసూరు, మాండ్యాలలో కూడా బాల్య వివాహాలు పేట్రేగిపోతున్నాయి.

నిజానికి, కర్ణాటక ప్రభుత్వం ఎంత నిఘా పెట్టినప్పటికీ, 2017, 2022 సంవత్సరాల మధ్య బాల్య వివాహాలకు సంబంధించి సుమారు 10,500 ఫిర్యాదుల అందాయని, ఇందులో 9,200 వివాహాలను సకాలంలో నిలువరించడం జరిగిందని ఇటీవల ప్రభుత్వం తెలియజేసింది. ఒక్క 2021-22 సంవత్సరంలోనే సుమారు 3,000ల ఫిర్యాదులు అందడాన్ని బట్టి, గ్రామీణ ప్రాంతాల పరిస్థితులు ఎంత దయనీయంగా ఉన్నాయో, గ్రామీణ ప్రజలు, రైతులు ఎంత ఒత్తిడికి గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు. బాల్య వివాహాల నిషేధ చట్టం (2006) కింద శిక్ష పడడానికి, జరిమానా విధించడానికి అవకాశం ఉన్నప్పటికీ, పదిమందిలో ఒక్కరికి కూడా శిక్షపడడమనేది జరగడం లేదు. తమ కుమార్తెలకు ఏదో విధంగా ఎక్కడో అక్కడ వివాహం జరిపించడమన్నది తల్లితండ్రుల బాధ్యతగా మారిపోతోంది. చట్టాలు,
పోలీసులు, న్యాయస్థానాలు ఈ పరిస్థితిని ఆశించిన స్థాయిలో నిరోధించలేకపోతున్నాయి.

మొత్తానికి పరిస్థితుల ప్రభావం కారణంగా బాలికలకు బాగా చిన్న వయసులోనే వివాహాలు జరిపించడం అనేక రాష్ట్రాల్లో సర్వసాధారణమైపోతోంది. మొదట కోవిడ్ పరిస్థితులు ఇందుకు అవకాశాలను పెంచగా, ఆ తర్వాత వర్షాభావ పరిస్థితులు, ఉపాధి లేమి వీటిని ఇతోధికంగా ప్రోత్సహించడం జరుగుతోంది. ఫలితంగా బాలికలు బాల్యాన్ని విద్యావకాశాలను కోల్పోవడం జరుగుతోంది. కోవిడ్ సమయంలో అర్ధంతరంగా చదువులు ఆపేయడమన్నది ఎక్కువైంది. దాంతో బాల్య వివాహాలు కూడా ఊపందుకోవడం జరిగింది. తల్లితండ్రులు తమ బాధ్యతను తగ్గించుకునే ఉద్దేశంతోనూ, పేదరికం, నిరక్షరాస్యత, మూఢనమ్మకాల కారణంగానూ బాల్య వివాహాలకు పాల్పడడం జరుగుతోంది. బాల్య వివాహాల ప్రభావం వల్ల బాలికలు
చిన్నవయసులోనే గర్భం ధరించడం, బలహీనపడడం, ఆరోగ్యం క్షీణించడం వంటి వాటి వల్ల జీవితాంతం ఇబ్బందులు పడడం జరుగుతోంది.

నిరక్షరాస్యత అతి తక్కువగా ఉన్న రాష్ట్రాలలో కూడా ఇటువంటివి జరుగుతున్నాయంటే గ్రామీణ ప్రాంతాలు మళ్లీ పురాతన కాలానికి వెళ్లిపోతున్నాయని అర్థం. అంతేకాక, గ్రామీణ ప్రజలు శాస్త్రీయ దృక్పథానికి ఏ విధంగానూ చేరువ కాలేకపోతున్నారు. ఈ ధోరణికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత పూర్తిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదేననడంలో సందేహం లేదు. పౌర సమాజం కూడా ఇందుకు ఎంతో కొంత బాధ్యత వహించాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రజలపై ఒత్తిడి తగ్గడానికి, బాలికలు స్కూళ్లకు వెళ్లడానికి ప్రభుత్వాలు గట్టి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News