Tuesday, November 26, 2024
Homeఓపన్ పేజ్Seized amounts will go to?: వసూలు చేసిన సొమ్మంతా ఎక్కడికి పోతుంది?

Seized amounts will go to?: వసూలు చేసిన సొమ్మంతా ఎక్కడికి పోతుంది?

విచారణ తర్వాత జిల్లా ట్రెజరీల్లో జమ

ఎన్నికలు వచ్చాయంటే చాలు, కోట్లాది రూపాయల సొమ్ము వరద నీరులా వెల్లువెత్తుతుంది. కోట్లాది రూపాయలు చేతులు మారుతాయి. చెక్ పోస్టుల దగ్గరే కాకుండా ఎక్కడ వీలైతే అక్కడ పోలీసులు, ఎన్నికల అధికారుల కార్లను, ఇతర వాహనాలను ఆపి సోదా చేసి కట్టలు కట్టలుగా, దొంతర్లు దొంతర్లుగా నగదును
స్వాధీనం చేసుకోవడం జరుగుతుంది. అవి లోక్ సభ ఎన్నికలే కావచ్చు, శాసనసభ ఎన్నికలే కావచ్చు, ఎన్నికల అధికారులు వివిధ పార్టీలు ఓటర్లను ప్రలోభ పెట్టడానికి, లంచం ఇవ్వడానికి, ఓట్లను కొనడానికి తీసుకు వెడుతున్న, రవాణా చేస్తున్న కోట్లాది రూపాయలను పట్టుకోవడం, స్వాధీనం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ప్రస్తుతం అయిదు రాష్ట్రాలకు ఎన్నికలు జరగబోతున్న సందర్భంలో కూడా భారీ మొత్తాలలో నగదు, కరెన్సీ వసూలయింది. మిజోరం, చత్తీస్ గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలలో ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా ఎన్నికల కమిషన్ అధికారులు ఇంతవరకూ 161.47 కోట్ల రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు అధికారిక లెక్కలు తెలియజేస్తున్నాయి.

- Advertisement -

ఈ నగదును ఇలా స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ సొమ్మంతా ఎక్కడికి పోతుంది?
ఇది చాలా మందికి అంతుబట్టని విషయం. ఈ ప్రశ్నకు సమాధానం ఎన్నికల కమిషన్ అధికారుల నుంచే లభిస్తుంది. సాధారణంగా ఎన్నికల సమయంలో ఎన్నికల కమిషన్ ఎన్నికల వ్యయ పరిశీలకు లను నియమిస్తుంది. పార్లమెంట్ ఎన్నికల్లోనే కాకుండా, శాసనసభ ఎన్నికల సమయంలో కూడా ఈ పరిశీలకులు వివిధ పార్టీల ఎన్నికల వ్యయం మీద ఒక కన్ను వేసి ఉంచుతారు. వారు వివిధ పార్టీల ఎన్నికల వ్యయం మీద నిఘా పెట్టడమే కాకుండా, పార్టీల వాహనాలు, పార్టీ అభ్యర్థుల వాహనాలు, పార్టీలతో సంబంధం ఉన్నవారి వాహనాల మీద నిఘా పెట్టి, అనుమానం ఉన్నప్పుడు సోదాలు, తనిఖీలు చేసి, లెక్కా జమా లేని డబ్బును మాత్రం స్వాధీనం చేసుకుంటూ ఉంటారు. అయితే, ఇలా దొంగ రవాణా అవుతున్న సొమ్ము ఎన్నికల ప్రచారానికి, ఓటర్లకు పంపిణీ చేయడానికి ఉద్దేశించిందా, కాదా అన్నది ఈ
ఎన్నికల వ్యయ పరిశీలకులు, నిఘా అధికారులు దాదాపు అక్కడికక్కడే నిర్ధారించాల్సి ఉంటుంది.

నిఘా అధికారులు సిద్ధం
ఎన్నికల కమిషన్ నియమించిన అధికారుల బృందానికి ఈ విధంగా అక్రమ రవాణా సొమ్ము చేతికి చిక్కినప్పుడు, ఇది ఎన్నికలకు సంబంధించిన సొమ్మేనా అని నిర్ధారణ చేసుకోవడానికి అనేక సందర్భాలలో అధికారులకు అవకాశం ఉండకపోవచ్చు. అప్పుడు ఆ అధికారులు ఈ విషయాన్ని ఆదాయ పన్ను శాఖాధికారులకు తెలియజేస్తారు. ఆదాయ పన్ను అధికారులు రంగ ప్రవేశం చేసి, ఈ పట్టుబడిన
నగదుకు సరైన లెక్కలు, ఆధారాలు ఉన్నాయా అని అక్కడికక్కడే పరిశీలించడం
జరుగుతుంది. అది ఎన్నికల ప్రచారానికో, ప్రలోభానికో ఉద్దేశించిన సొమ్మయితే దీనిని విచారించే ప్రక్రియ వేరే విధంగా ఉంటుంది. లెక్కా డొక్కా సరిగ్గా ఉన్న పక్షంలో ఆ సొమ్ముకు ఆదాయ పన్ను విధించి, జరిమానాలు వసూలు చేసుకుని, మిగిలిన డబ్బును యజమానికో, హక్కుదారుకో ఇచ్చేయడం జరుగుతుంది. సాధారణంగా ఆదాయ పన్ను అధికారులను సైతం ఎన్నికల వ్యయ పరిశీలకులుగా నియమించే అవకాశం ఉంటుంది.

కాగా, ఎన్నికల వ్యయ పరిశీలకులు స్వాధీనం చేసుకున్న డబ్బు ఎన్నికల ప్రచారానికో, ప్రలో భాలకో సంబంధించిన డబ్బయితే, అలా అని నిర్ధారణ అయితే, ఆ డబ్బును అధికారులు వెంటనే స్వాధీనం చేసుకుని, ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేయడం జరుగుతుంది. ఈ ఎఫ్.ఐ.ఆర్ ఆధారంగా న్యాయస్థానంలో విచారణ జరుగుతుంది. విచారణ సందర్భంగా ఆ సొమ్ము ఎన్నికల కోసం ఉపయోగించడానికి ఉద్దేశించిన
డబ్బు కాదని తేలితే ఆ డబ్బును వెంటనే యజమానికి లేదా హక్కుదారుకు తిరిగి ఇచ్చేయడం జరుగుతుంది. ఆ సొమ్ము ఎన్నికల కోసమే ఉపయోగించే డబ్బని తేలితే, ఆ డబ్బును జిల్లా ట్రెజరీల్లో జమ చేయడం జరుగుతుంది. ఎన్నికల ప్రయోజనాల కోసం ఉద్దేశించిన సొమ్మయితే, పార్టీలు, అభ్యర్థులు లేదా పార్టీల నాయకులు ఆ డబ్బు గురించి అవకాశం ఉండదు. ముఖ్యంగా ఎన్నికల తర్వాత పార్టీలు ఆ సొమ్ము
గురించి ఏమాత్రం పట్టించు కునే అవకాశం ఉండదు. ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా నిర్వహించడమనే ప్రయోజనం కోసమే ఎన్నికల వ్యయ పరిశీలకులు కృషి చేస్తూ ఉంటారు.

భారీగా తనిఖీలు, సోదాలు
ఎన్నికల వ్యయ పరిశీలకుల కింద అనేక బృందాలు పని చేస్తూ ఉంటాయి. ఇందులో ఫ్లైయింగ్ స్క్వాడ్ లు, స్థిర నిఘా బృందాలు, వీడియో నిఘా బృందాలు కూడా ఉంటాయి. ప్రతి నియోజక వర్గంలోనూ ఇటువంటి బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతుంటుంది. ఈ అధికారులు ఏ నియోజకవర్గంలో అభ్యర్థులు లేదా పార్టీలు అధికంగా డబ్బు ఖర్చు పెట్టడానికి అవకాశం ఉండేదీ అంచనా వేస్తారు. దాన్ని
బట్టి సిబ్బందిని పెంచడమో, తగ్గించడమో జరుగుతుంటుంది. బాగా డబ్బు ఖర్చయ్యే అవకాశం ఉన్న నియోజకవర్గాలలో మూడు నాలుగు ఫ్లైయింగ్ స్క్వాడ్లు కూడా పనిచేస్తుంటాయి. అలాగే అక్కడ స్థిర నిఘా బృందాలను కూడా పెంచే అవకాశం ఉంటుంది. ఈ బృందాలు చట్టవిరుద్ధమైన నగదు లావాదేవీల మీద నిఘా వేస్తాయి. ఓటర్లకు చేసే నగదు పంపిణీ మీదే కాదు, మద్యం సీసాలు, ఇతర వస్తు సామగ్రి
పంపిణీ మీద కూడా నిఘా పెడతాయి. ఇక ఈ నిఘా బృందంలో ఒక సీనియర్ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, ఒక సీనియర్ పోలీస్ అధికారి, ఒక వీడియోగ్రాఫర్, కొందరు సాయుధ సిబ్బంది సభ్యులుగా ఉంటారు. సంచార నిఘా బృందాలు లేదా ఫ్లైయింగ్ స్వ్కాడ్లు నియోజకవర్గమంతా తిరుగుతూ ఉంటాయి. ఫిర్యాదు అందిన తర్వాత మాత్రమే అవి నిర్దేశిత ప్రాంతానికి వస్తాయి. కాగా, స్థిర నిఘా బృందాలు మాత్రం ఒక చోటే ఉండి,
ఎన్నికల వ్యయం మీద కన్ను వేసి ఉంటాయి. అధికారులు నగదును లేదా మద్యాన్ని లేదా వస్తు సామగ్రిని స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ తతంగాన్నంతా వీడియో తీయడం జరుగుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి ఈ నిఘా బృందాలు పనిచేయడం ప్రారంభిస్తాయి. ఎన్నికలు ముగిసే వరకూ ఇవి
నియోజకవర్గాల్లోనే ఉంటాయి. ఓటర్లను ప్రలోభ పెట్టడానికి లేదా లంచం ఇవ్వడానికి ఉద్దేశించిన దేనినైనా అధికారులు స్వాధీనం చేసుకోవడానికి అధికారం ఉంటుంది.

భారీగా సొమ్ము స్వాధీనం
ఎన్నికలు జరగబోతున్న ఈ అయిదు రాష్ట్రాలలో ఇప్పటి వరకూ 161.47 కోట్ల రూపాయలు వసూలు చేయగా ఇందులో 109.69 కోట్ల రూపాయలతో తెలంగాణ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంది. ఇందులో మద్యాన్ని, విలువైన వస్తువులను, బంగారాన్ని, వెండిని కూడా కలిపితే ఈ అయిదు రాష్ట్రాలలో మొత్తం 288.58కోట్ల రూపాయలను వసూలు చేయడం జరిగిందని అధికారిక భోగట్టా. ఓటర్లను ప్రలోభపెట్టడం, వారిని భయపెట్టడం, వాళ్లకు లంచం ఇవ్వడం, బహుమతుల రూపంలో నగదు లేదా విలువైన వస్తువులు పంపిణీ చేయడం వంటివి భారతీయ శిక్షా స్మృతిలోని సెక్షన్ 171 ప్రకారం నేరంగా పరిగణించడం జరుగుతుంది. ప్రజా ప్రాతినిధ్య చట్టం (1951) సెక్షన్ 123 కింద కూడా ఇటువంటి అవినీతి కార్యకలాపాలకు శిక్ష పడే అవకాశం ఉంది. నియోజకవర్గంలో అవినీతి కార్యకలాపాలు జరిగాయని రుజువైనా, ఓటర్లను ప్రలోభపెట్టడానికి, భయపెట్టడానికి ప్రయత్నించడం జరిగిందని నిర్ధారణ అయినా
ఆ నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేయడానికి ఎన్నికల కమిషన్ కు అధికారం ఉంటుంది.

– జి. రాజశుక

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News