బాణసంచా మీద నిషేధాలు గానీ, ఆంక్షలు గానీ విధించదలచుకున్న పక్షంలో వాటిని కేవలం ఢిల్లీ నగరానికే పరిమితం చేయకుండా దేశమంతటికీ వర్తింపజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించింది. కాలుష్యం విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఇది నిజంగా స్వాగతించ దగిన ఆదేశమే. అయితే, దీన్ని ప్రభుత్వాలు అమలు చేయడం మాత్రం పెద్ద సవాలు కాబోతోంది. వాయు, శబ్ద కాలుష్యాలను సృష్టించే టపాకాయలను పేల్చడం మీద గతంలో కూడా అనేక న్యాయ స్థానాలు రూలింగులు జారీ చేశాయి. ప్రమాదకర రసాయనాలు లేని పర్యావరణహిత బాణసంచాను ఎక్కువగా ఉపయోగించాలని చాలా ఏళ్లుగా దాదాపు ప్రతి ఏటా ఆదేశాలు, అభ్యర్థనలూ వెలువడుతున్నప్పటికీ, అవి చెవిలో ఊదిన శంఖారావాలే అవుతున్నాయి. చెవులు చిల్లులుపడే, ఊపిరితిత్తులలో మంటపుట్టే, శ్వాస ఆడక ఉక్కిరిబిక్కిరి అయ్యే టపాకాయలే ఎక్కువగా పేలుతున్నాయి. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు బాణసంచా విషయంలో అనేక విధాలుగా అవగాహన కలిగించడం వల్ల పిల్లలు ఇటువంటి పేలుళ్లకు దూరంగా ఉండడం ఎక్కువైంది కానీ, తల్లితండ్రులు, ఇతర పెద్దలు మాత్రం బాణసంచా పేలుళ్లను యథావిధిగా కొనసాగిస్తున్నారని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది.
విచిత్రమేమిటంటే, భారతదేశంలో బాణసంచా పేలుళ్లనేవి కేవలం దీపావళి తదితర పర్వదినాలకే పరిమితం కాలేదు. క్రీడల్లో విజయాలు చోటు చేసుకున్నా, పుట్టిన రోజుల జరిగినా, పెళ్లిళ్లు వచ్చినా, ఊరేగింపులు జరిగినా బాణసంచా పేలుళ్లు అనేవి తప్పనిసరి అవుతున్నాయి. చివరికి అంతిమ యాత్రల్లో కూడా బాణసంచా పేలుళ్లు తప్పడం లేదు. అయితే, బాణసంచాలో ఎక్కువగా బేరియం రసాయన పదార్థం ఉండడం వల్ల కాలుష్యం పెరిగి, ఆరోగ్యం దెబ్బతినడం జరుగుతోంది. పైగా ఏదో ఒక కారణంగా ఏడాదంతా బాణసంచాను ఉపయోగిస్తున్నందువల్ల ఊపిరితిత్తుల సమస్యలు విజృంభిస్తున్నాయి. ఇటువంటి రసాయనాలతో నిండిన బాణసంచాను కాల్చడం వల్ల తప్పకుండా శ్వాసకోశ సంబంధమైన వ్యాధులు, ఉబ్బసం వంటి అనారోగ్యాల వాతబడే అవకాశం ఉంటుంది. వాయు కాలుష్యం కారణంగా శ్వాసకోశ సంబంధమైన పిల్లల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు ఆస్పత్రుల రికార్డులు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే హృద్రోగాలతో అవస్థలు పడుతున్నవారికి ఈ ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది.
ఇక శబ్ద కాలుష్యం వల్ల మనుషుల్లోనే కాదు, జంతువుల్లో సైతం అనేక మానసిక వైకల్యాలు ఏర్పడుతున్నాయి. గత నవంబర్ 5వ తేదీన కోల్ కతాలో ఒక అశ్వికదళ అశ్వం హఠాత్తుగా మరణించడానికి ఇదే కారణం. ఈడెన్ గార్డెన్స్ లో జరిగిన ప్రపంచ కప్ క్రికెట్లో దక్షిణాఫ్రికా జట్టు మీద భారత జట్టు విజయం సాధించిన సందర్భంగా అభిమానులు పెద్ద ఎత్తున బాణసంచా పేల్చడంతో అశ్విక దళానికి చెందిన గుర్రం గుండె ఆగి ప్రాణాలు కోల్పోయింది. అనేక భారతీయ నగరాలను ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యాన్ని ఈ ప్రమాదకర బాణసంచా పేలుళ్లు మరింత కలుషితం చేయడం జరుగుతుంది. వాయు నాణ్యత సూచి ప్రకారం ప్రపంచంలోని అత్యంత కాలుష్య నగరాలలో భారతదేశపు నగరాలే అగ్రస్థానంలో ఉన్నాయి. ఆమోదిత స్థాయి కంటే పది రెట్లు ఎక్కువగా నగరాల్లో కాలుష్యం పెరిగిపోయిందని గణాంకాలు తెలియజేస్తున్నాయి. దేశంలోని అనేక రాష్ట్రాలలో ప్రమాదకర బాణసంచా తమ రాష్ట్రాల్లో ప్రవేశించకుండా రాష్ట్ర సరిహద్దుల్లో తనిఖీ బృందాలను ఏర్పాటు చేయడం జరుగుతోంది. నగరాల లోపల కూడా ప్రజలు ప్రమాదకర బాణసంచా కాల్చకుండా పోలీసులు నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.
Fire works ban: బాణసంచా మీద నిషేధం తప్పదా?
బేరియంతో నిండిన టపాసులు చాలా ప్రమాదం