భారీకాయం, బహిష్టులు, వేధింపులు, స్త్రీల పట్ల ద్వేషం, డేటింగ్ ఇవన్నీ బయటకు చర్చించడం పాకిస్తాన్‌లాంటి దేశంలో సవాలే. ఆ విషయాలన్నీ ఇంటి నాలుగు గోడలకే పరిమితం. అలాంటి అంశాలను టాపిక్స్‌గా తీసుకుని పాకిస్తాన్ మహిళా స్టాడప్ కమేడియన్స్ ఎంతో హాస్యాన్ని పండిస్తున్నారు. అదే సమయంలో వాటిల్లో అంతర్గతంగా దాగున్న పలు సున్నితమైన అంశాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నారు. వీరి కామెడీ ప్రదర్శనలను చూడడానికి పాకిస్తాన్‌లోని ఎన్నో కుటుంబాలు, జంటలు, యువత పెద్ద ఎత్తున వస్తున్నారు. మహిళా కామెడీ కళాకారులకు వీక్షకుల నుంచి మంచి స్పందన వస్తోంది. పైగా స్టాండప్ కామెడీ అక్కడి మహిళలు ఎంతో నావల్టీగా ప్రదర్శించడం మరో విశేషం. అలా పురుషాధిపత్య రంగమైన స్టాండప్‌కామెడీలో పాకిస్తాన్ మహిళలు తమదైన ముద్రవేస్తున్నారు. కామెడీ చేయడంలో ఆత్మవిశ్వాసంతో పాటు మంచి సామర్థ్యాన్ని కూడా ప్రదర్శించగలుగుతున్నామని అంటున్నారు.
డిజిటల్ కంటెంట్ క్రియేటర్, కమేడియన్ అయిన 31 ఏళ్ల అమ్తుల్ బవేజా 2011 సంవత్సరం నుంచి అంటే స్టూడెంట్‌గా ఉన్నప్పటినుంచి స్టాండప్ కామెడీని ప్రదర్శిస్తూ వస్తున్నారు. వ్యక్తిగతంగా కామెడీ ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు కంఫర్టబుల్‌గా ఉండలేకపోయేదాన్నని, 2016లో పూర్తిగా మహిళలే ఉన్న సౌత్ ఏషియా కామెడీ బృందంలో చేరినప్పటి నుంచి కామెడీ ప్రదర్శనలు ఇవ్వడంలో స్వేచ్ఛను, ఆనందాన్ని ఆస్వాదిస్తున్నానని అంటారు. మహిళలతో కలిసి కామెడీ ప్రదర్శనలు ఇస్తున్నప్పటి నుంచి నాలో ఆత్మవిశ్వాసం బాగా పెరిగింది. గతంలో కామెడీ అనేది కేవలం పురుషులకు పరిమితమై ఉండేది. వారి ఆధిక్యతే ఈ రంగంలో ఉండేది. పురుషుల ఫన్నీ రోల్స్‌ను ప్రేక్షకులు ఆనందించేవారు.
పురుషులకు మల్లే సులభంగా కామెడీ చేయడం స్త్రీలకు కష్టమైన పని అని పలువురు భావించేవారు. ఒకవేళ ఎవరైనా స్త్రీ కామెడీ పండించినా ‘కామెడీ చేయడానికి చాలా కష్టపడిందనే’ మాటలు వినిపించేవి. కానీ పూర్తిగా స్త్రీలతో కూడుకున్న బృందంతో కలిసి పనిచేయడం వల్ల ఇపుడు రకరకాల పాత్రలను హాయిగా ప్రదర్శించగలుగుతున్నాం. పురుషుల పాత్రలను సైతం అద్భుతంగా పండిస్తూ అందరినీ పొట్టచెక్కలయ్యేలా నవ్విస్తున్నాం అని బవేజా చెప్పుకొచ్చారు. మహిళాబృందంతో కలిసి పనిచేయడం వల్ల భద్రతగా ఫీలవడమే కాకుండా పలు అంశాలపై స్వేచ్ఛగా మా భావనలను వ్యక్తం చేయగలుగుతున్నాం అని ఫైజా సలీమ్ అనే స్టాండప్ కామెడీ కళాకారిణి అన్నారు. బవేజా, ఫైజా సలీమ్ ఒకే బృందంలో కలిసి పనిచేస్తున్నారు. సక్సెస్‌ఫుల్ కమేడియన్స్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు.
పాకిస్తాన్‌లోని మహిళా స్టాండప్ కళాకారిణులు సోషల్ మీడియాలో కూడా ప్రభంజనం సృష్టిస్తున్నారు. బవేజాకు ఇన్‌స్టాగ్రామ్‌లో 47,000 మంది ఫాలోయర్లు ఉన్నారు. ఫైజా సలీమ్‌కు 1,78,000 మంది ఫాలోయర్లు ఉన్నారు. రిటైర్డ్ ప్రభుత్వ అధికారి అయిన 64 ఏళ్ల రుబీనా అహ్మద్ కూడా నాలుగేళ్ల క్రితం నుంచి స్టాండప్ కామెడీ ప్రదర్శనలు ఇస్తున్నారు. ఆమె అరాత్‌నాక్‌లోని పాకిస్తానీ ఫెమినిస్టిక్ స్టాండప్ కామెడీ గ్రూపుతో కలిసి కామెడీలో తన కళానైపుణ్యాన్ని స్వేచ్ఛగా ప్రదర్శిస్తున్నారు. గతంలో యంగ్ గైస్ అనే స్టాండప్ కామెడీ గ్రూపులో ఆమె పనిచేశారు. కానీ అందులో తాను చేయాలనకున్న కొత్త కొత్త అంశాలపై స్వేచ్ఛగా ప్రదర్శన ఇచ్చే సావకాశం రుబీనాకు ఉండేది కాదు. పురుషాధిపత్య పోకడలపై రుబీనా పలు ప్రదర్శనలు ఇచ్చారు. ‘హాస్యం అంటే నాకు షుగర్ కోటెడ్ పిల్ లాంటిది. అది ఎంతో చేదుగా ఉన్నా ఈజీగా మింగగలుగుతాం. నేను ఎక్కువగా మహిళలకు సంబంధించిన అంశాలు తీసుకుని ప్రదర్శనలు ఇస్తా. పురుషాధిపత్యం, స్త్రీ ద్వేషం, ఎమోషనల్ అబ్యూజ్, జండర్ ఐడెంటిటీ, లైంగికపరమైన ప్రాధాన్యతలు వంటి అంశాలపై స్టాండప్ కామెడీ ప్రదర్శిస్తుంటా’ అని అహ్మద్ అన్నారు. పాకిస్తాన్ సమాజంలోని ఆడవాళ్ల పరిస్థితులను చెప్పకుండానే తన కామెడీ ప్రెజెంటేషన్ ద్వారా చెపుతూ స్త్రీలు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై జనాలను చైతన్యవంతులను చేస్తున్నారు ఆమె.
పాకిస్తాన్‌లోని పంజాబ్ ప్రాంతంలో ప్రజలు మాట్లాడే పంజాబీ భాషలో రుబీనా అహ్మద్ ప్రదర్శనలు ఇస్తారు. తనదైన విలక్షణమైన కామెడీతో ఆమె ఎందరినో ఆకర్షిస్తున్నారు. పురుషాధిక్య ధోరణులను వైవిధ్యపూరితంగా తన కామెడీలో ఆమె ప్రదర్శిస్తారు. పరిమితులను బట్టి సైతం తన చెప్పే అంశం యొక్క తీవ్రతను వీక్షకుల ముందు ఉంచడం ఆమె మరో ప్రత్యేకత. యుక్తవయసు నుంచి పెద్దతనం వచ్చే దాకా తమ శరీరంపై స్వేచ్ఛలేకుండా ఆడవాళ్లు జీవిస్తున్న పరిస్థితులను అహ్మద్ కామెడీ ద్వారా శక్తివంతంగా ప్రేక్షకులకు తెలియజెపుతున్నారు. ‘నా జీవితంలో నేను ఎదుర్కొన్న అనుభవాలనే నా కామెడీ ప్రదర్శనల్లో నలుగురి ముందూ ఉంచుతున్నా తప్ప ఊహాజనితంగా ఏ అంశాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించలేదు’ అంటారామె. ఆమె కామెడీలో ఫెమినిజం ప్రతిఫలిస్తుంది. బవేజా మాట్లాడుతూ ‘మాదంటూ స్పేస్ సృష్టించుకోవడం కోసం కష్టపడుతున్నాం. స్టేజి మీద ధైర్యంగా మాట్లాడుతూ ఫెమినిస్టులుగా నిలబడగలుగుతున్నాం. స్త్రీల సమానత్వం కొరకు, ప్రాతినిధ్యం కొరకు కృషిచేస్తున్నాం’ అని బవేజా అన్నారు.
ఇస్లామాబాద్‌లో పోలీసు ఆఫీసర్‌గా పనిచేస్తున్న 30 ఏళ్ల ఆమాశీ బేగ్ కూడా గత మూడు సంవత్సరాల నుంచి స్టాండప్ కామెడీలను చేస్తున్నారు. బేగ్ రెండు పురుషాధిపత్య రంగాలలో సక్సెస్‌ఫుల్‌గా నిలబడ్డారు. ఒకటి పోలీసు రంగమైతే, రెండవది కామెడీ రంగం. పోలీసు విభాగంలో, సమాజంలోను అంతర్లీనంగా ఉన్న స్టీరియోటైప్ ధోరణులతో పాటు సెక్సిజంపై తన కామెడీ ద్వారా ఆమె సంచలనం సృష్టిస్తున్నారు. మహిళా స్టాండప్ కమేడియన్లు ప్రొఫెషనల్‌గా ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందంటారు సలీమ్. స్టాండప్ కామెడీని మహిళలు ఇంకా ఒక ప్రొఫెషన్‌గా చేపట్టడంలేదు. భవిష్యత్తులో ఈ పరిస్థితులు మారచ్చని ఆమె ఆశాభావం వ్యక్తంచేశారు. ఇతర దేశాలలో ఒటిటి, నెట్‌ఫ్లిక్స్‌ల ద్వారా మహిళలకు కామెడీ ప్రదర్శనలు ఇవ్వడానికి బాగా స్కోప్ ఉంటోంది. కానీ పాకిస్తాన్‌లో ఆ పరిస్థితి లేదు. ఇందుకు మతపరమైన, సామాజిక సంబంధమైన పరిమితులు మహిళలకు ఆటంకంగా నిలుస్తున్నాయని ఆమె అభిప్రాయపడ్డారు.
కామెడీ రంగాన్ని మహిళలు ఏలే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అహ్మద్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘ఆడవాళ్లు తెలివైనవాళ్లు. చతురులు. కరక్టయిన అంశాలను ఎంచుకోవడంలో వాళ్లు ఎంతో దిట్ట. సమాజంలోని పరిస్థితులను అద్దంపట్టేలా ఎలా చెప్పాలో బాగా తెలిసిన వాళ్లు’ అని అమె అభిప్రాయపడ్డారు. పాకిస్తాన్ మహిళా స్టాండప్ కమేడియన్లకు మరింత మంచి రోజులు తొందరలోనే వస్తాయని ఆశిద్దాం.