సాధారణంగా పెళ్లి చేసుకునేవారు తమ బంధువుల్ని, స్నేహితులను, తెలిసిన వారిని, చుట్టుపక్కల వారికి ఆహ్వాన పత్రికలు పంపి.. పెళ్లికి రావాలని ఆహ్వానిస్తారు. కానీ.. కేరళకు చెందిన ఓ యువ జంట మాత్రం.. తమ పెళ్లికి రావాలంటూ భారత సైన్యానికి ఒక లేఖ, పెళ్లి పత్రికను పంపింది. ‘మీ ధైర్య సాహసాల వల్లే మేమిక్కడ సంతోషంగా జీవిస్తున్నాం.. ఇప్పుడు ఒక్కటవబోతున్నాం.. ఇలాంటి ఆనంద సమయంలో మీరు మా చెంత ఉండాలి’ అంటూ ఆ లేఖలో రాశారు.
కేరళకు చెందిన రాహుల్, కార్తీకలు ఈ నెల 10న వివాహం చేసుకున్నారు. ఈ వివాహానికి ఆ జంట ఆర్మీని ఆహ్వానించింది. ‘ప్రియమైన హీరోలకు..’ అని సైనికులను సంబోధిస్తూ.. మీ ప్రేమ, దేశంపై మీకున్న భక్తి, విధినిర్వహణలో మీరు చూపించే సాహసానికి మేమెంతో రుణపడి పోయాం. సరిహద్దుల్లో కాపలా కాస్తూ మమ్మల్ని జాగ్రత్తగా కాపాడుతున్నందుకు, మా జీవితాలను సంతోషంగా ఉంచుతున్నందుకు మీకు ధన్యవాదాలు. మా పెళ్లికి హాజరై మమ్మల్ని దీవించండి’ అంటూ ఆహ్వాన పత్రిక పంపారు.
ఆ ఆహ్వానపత్రికను అందుకున్న ఆర్మీ అధికారులు కూడా అంతే సంతోషంగా బదులిచ్చారు. మీరు కలకాలం కలిసి ఉండాలంటూ కొత్త జంటకు ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ అయిన ఇన్ స్టాగ్రామ్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్మీ అధికారులు పోస్ట్ చేసిన పెండ్లి పత్రిక నెట్టింట వైరల్ అవుతోంది.