IND vs NZ : మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమ్ఇండియా బోణీ కొట్టింది. మౌంట్ మాంగనుయ్ వేదికగా జరిగిన రెండో టీ20లో భారత జట్టు 65 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. సూర్యకుమార్ యాదవ్ సెంచరీతో చెలరేగడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. అనంతరం 192 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్ 18.5 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో హుడా నాలుగు వికెట్లు పడగొట్టగా, చాహల్, సిరాజ్ చెరో రెండు వికెట్లు తీశారు. సుందర్, భువనేశ్వర్ ఒక్కొ వికెట్ పడగొట్టారు. శతకంతో చెలరేగిన సూర్యకుమార్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య మూడో వన్డే మంగళవారం జరగనుంది.
కేన్ విలియమ్సన్ ఒక్కడే..
భారీ లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు శుభారంభం దక్కలేదు. తొలి ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో ఓపెనర్ ఫిన్ అలెన్(0) డకౌట్ అయ్యాడు. దీంతో సున్నా పరుగుల వద్దే కివీస్ తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కేన్ విలియమ్సన్(61; 52 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లు) మరో ఓపెనర్ కాన్వే(25; 22బంతుల్లో 3 ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. వీరిద్దరు ఆచితూచి ఆడుతూ చెత్త బంతులను బౌండరీలకు తరలించారు. రెండో వికెట్‌కు 56 పరుగులు జత చేశారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడిని వాషింగ్టన్ సుందర్ విడదీశాడు. సుందర్ బౌలింగ్ లో అర్ష్‌దీప్‌కు క్యాచ్ ఇచ్చి కాన్వే ఔట్ అయ్యాడు.
ఇక్కడి నుంచి భారత బౌలర్ల జోరు మొదలైంది. ఓ వైపు కేన్ మామ క్రీజులో పాతుకుపోయి తనదైన శైలిలో ఆడుతుండగా.. అతడికి సహకరించే బ్యాటర్లే కరువు అయ్యారు. ఫిలిప్స్(12), మిచెల్(10), నీషమ్(0) సాంట్నర్(2) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. ఓ వైపు సాధించాల్సిన రన్‌రేట్ పెరిగిపోతుండడంతో కేన్ ధాటిగా ఆడేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో 18వ ఓవర్‌లో సిరాజ్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. అప్పటి కివీస్ స్కోర్ 125/ 7.
మిగిలిన మూడు వికెట్లు పడగొట్టడానికి భారత్ కు ఎంతో సమయం పట్టలేదు. దీపక్ హుడా వరుసగా సోథీ(0), సౌథీ(0), మిల్నె(6)ను ఔట్ చేశాడు. తృటిలో హ్యాట్రిక్ వికెట్లు తీసే ఛాన్స్ విస్ అయ్యాడు. తన కెరీర్‌లోనే అత్యుత్తమ గణాంకాలను హుడా(4/10) నమోదు చేశాడు.
సూర్యా అదరహో..
భారత ఇన్నింగ్స్‌లో సూర్య ఆటే హైలెట్. సూర్య ఆడిన విధానాన్ని ఏమని వర్ణించగలం. మిస్టర్ 360 డిగ్రీస్ పేరుకు తగ్గట్లే మైదానం నలువైపులా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 49 బంతుల్లోనే టీ20ల్లో రెండో శతకాన్ని సాధించాడు. తొలి యాభై పరుగులు చేయడానికి 32 బంతులు తీసుకున్న సూర్య.. ఆతరువాత యాభై పరుగులను 17 బంతుల్లోనే చేశాడంటే ఆఖరి ఓవర్లలో అతడి విధ్వంసం ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దొరికిన బంతిని దొరికినట్లుగా బౌండరికి తరలించాడు. సూర్య వీరవిహారంతో భారత్ భారీ స్కోర్ చేసింది. ఇషాన్ కిషన్ (36) పరుగులతో రాణించాడు.