నిరుద్యోగం కుర్రాళ్ల జీవితాలకు స్థిరత్వం లేకుండా చేస్తోందని వాపోతున్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అధినేత శరద్ పవార్. నేటి యువత బాగా చదువుకున్నా వారి సామర్థ్యానికి సరిపోయే ఉద్యోగావకాశాలు లభించక ‘పెళ్లి కాని ప్రసాదు’ల్లా మిగిలిపోతున్నారని పవార్ ఆవేదన వ్యక్తంచేశారు. నిరుద్యోగం కారణంగా తమకు ఎవరూ పిల్లను ఇవ్వటం లేదని 25-30 మధ్య యువకులు తనకు చెప్పినట్టు ఆయన వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగం తాండవిస్తోందని ఆయన నొక్కి చెప్పారు.
కేంద్రంలోని బీజేపీ సర్కారుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ పవార్..దేశంలో ముఖ్యంగా మహారాష్ట్ర యువతను నిరుద్యోగం వేధిస్తోందన్నారు. పూనేలో జరిగిన ‘జన్ జాగర్ యాత్ర’లో పాల్గొన్న పవార్.. నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అసలైన సమస్యలపై దృష్టి సారించకుండా ఉండేలా విభజన రాజకీయాలు చేస్తూ కేంద్రం ప్రజా దృష్టిని మళ్లిస్తోందని శరద్ పవార్ ఆరోపించారు.