ఎన్నకల సమయం దగ్గర పడుతుండటంతో కరీంనగర్ ఓటర్లు సైలెంట్ వార్ కు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్ నియోజకవర్గంలో మూడు రాజకీయ పార్టీల ఎమ్మెల్యే అభ్యర్థుల ప్రచారహోరు జోరుగా సాగుతున్నది. నియోజకవర్గంలో బి ఆర్ ఎస్, బి జె పి, కాంగ్రెస్ పార్టీల మద్య ముక్కోణం పోటీ బలంగా మారుతోంది. మూడు పార్టీల అభ్యర్థులు ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలతో ప్రచారం సాగిస్తున్నారు. ఓటర్లు మాత్రం బరిలో ఉన్న అభ్యర్థుల చరిత్రను అధికారంలో ఉన్నప్పుడు వారు చేసిన అభివృద్ధి, ప్రవర్తించిన తీరును బేరీజు వేసుకొంటున్నారు. కరీంనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీపడుతున్న వారిలో మూడుసార్లు కరీంనగర్ ఎమ్మెల్యేగా, ఒక్కసారి రాష్ట్ర మంత్రిగా ఉన్న గంగుల కమలాకర్ బిఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.
బిజెపి నుండి బండి సంజయ్ కుమార్ బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి నేడు బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శిగా కరీంనగర్ పార్లమెంట్ సభ్యులుగా కొనసాగుతున్నారు.
ఇక రాష్ట్ర రాజకీయలతో ఎక్కువ సంబంధాలు కొనసాగించని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పురమళ్ళ శ్రీనివాస్ మూడుసార్లు బొమ్మకల్ గ్రామ సర్పంచ్ గా, తన సతీమణి కరీంనగర్ రూరల్ జెడ్ పి టి సి గా ఉన్నారు. అనూహ్య పరిణామల మధ్య కాంగ్రెస్ పార్టీలోని సీనియర్ హేమహేమీ నాయకుల మధ్య కాంగ్రెస్ అధిష్టానం పురమళ్ళ శ్రీనివాస్ కు టికెట్ ఇచ్చి బరిలో దింపింది. కాంగ్రెస్ టికెట్ కోసం పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మానేని రోహిత్ రావు, రేగులపాతటి రమ్యారావు, వైద్యుల అంజన్ కుమార్, కోమటి రెడ్డి నరేందర్ రెడ్డి ప్రయత్నించగా, కాంగ్రెస్ టికెట్ చివరకు పురమళ్ళ శ్రీనివాస్ కు దక్కింది, కొత్త జైపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ టికెట్ ఆశించి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొన్నారు. దాంతో కరీంనగర్ నియోజకవర్గంలో కొంత మేరకు జైపాల్ రెడ్డి అనుచెరులతో కొత్త జోష్ కనిపించింది. ఆంతలోనే కొత్త జైపాల్ రెడ్డి రాజకీయ గురువు నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ తో పొసగక బీఆర్ఎస్ లోకి చేరటంతో ఆయన కూడా అదే బాటలో వెళ్ళటానికి సిద్ధంమవ్వటం, ఆశించిన టికెట్ కూడా మున్నారు కాపు సామాజిక వర్గానికి చెందిన పురమళ్ళ శ్రీనివాస్ కు దక్కబోతుందన్న విషయం గ్రహించి కొత్త జైపాల్ రెడ్డి బీఆర్ఎస్ గూటికి చేరారు.
మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన వారు కావటంతో కరీంనగర్ నియోజకవర్గం రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఒకే మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో ఉండగా ఆ సామాజిక వర్గం ఓట్లు చీలిపోయి ఇతర సామాజిక వర్గాల్లోని దళిత మైనార్టీ ఓట్లు ఎమ్మెల్యేగా గెలవడానికి కీలకమయ్యే అవకాశం ఏర్పడనుంది. అభ్యర్థులు ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకోవడంతో వారి మధ్య ఉన్న విబేధాలు ప్రజల్లో రకరకాల ఆలోచనలు రేకెత్తిస్తున్నాయి. ఏదేమైనా నియోజకవర్గం ప్రజలు చైతన్యవంతమైన ఓటుతో తీర్పునివ్వటానికి సిద్ధమవతూ, రాజకీయ చర్చల్లో రేయింబవళ్లు మునిగి తేలుతున్నారు.