విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో అగ్నిప్రమాదం కారణంగా బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు కనీవినీ ఎరుగని రీతిలో ముఖ్యమంత్రి సహాయం ప్రకటించారు. దగ్ధమైన బోట్ల విలువలో 80శాతం మేర పరిహారంగా అందించాలని ఆదేశించారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ ఘటనపై ఈ ఉదయం జరిగిన సమావేశంలో సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందించారు.
ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి సీదిరి అప్పలరాజు సహా జిల్లాకలెక్టర్ ఘటనాస్థలానికి వెళ్లారన్నారు. బాధితులకు పూర్తి భరోసానిచ్చామని వివరించారు. ప్రమాదంలో 36 బోట్లు దగ్ధం కాగా, మరో 9 బోట్లు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు.
ఈ సందర్భంగా సీఎం మట్లాడుతూ ప్రమాదంలో బోట్లు దగ్ధంకావడం మత్స్యకారుల జీవితాలకే పెద్ద దెబ్బ అని… ఇలాంటి పరిస్థితుల్లో వారి జీవితాలను నిలబెటాల్సిన అవసరం ఉందన్నారు.
సాయం విషయంలో అత్యంత మానవతాధృక్ఫధంతో వ్యవహరించాలన్నారు. మానవత్వం అనే పదానికి అర్ధం చెబుతూ.. మత్స్యకారుల జీవితాలను తిరిగి నిలబెట్టేలా ఈ సాయం ఉండాలన్నారు. అందుకే ఈ విషయంలో ఉదారంగా ఉండాలని ఆదేశించారు. దగ్ధమైన బోట్ల విలువలో 80శాతం మేర పరిహారంగా ఇవ్వాలని, వారు తిరిగి తమ జీవితాలను నిలబెట్టుకునేలా అండగా ఉండాలన్నారు. బోట్లకు బీమా లేదనో, లేక మరో సాంకేతిక కారణాలనో చూపి మత్స్యకారుల జీవితాలను గాలికి వదిలేయడం సరికాదన్నారు. ఇలాంటి కష్టం కాలంలోనే వారికి పూర్తి భరోసాకల్పించాల్సిన బాధ్యత ఉందని సీఎం అధికారులకు స్పష్టంచేశారు. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాద సమయాల్లో ఇబ్బంది లేకుండా ఇన్సూరెన్స్ చేయించుకునేలా అధికారులు తగిన తోడ్పాటు అందించాలన్నారు.
ప్రాథమిక అంచనా ప్రకారం బోట్లు దగ్ధం కారణంగా దాదాపు రూ. 12 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టుగా భావిస్తున్నారని, అధికారులు తుది నివేదిక సిద్ధంచేస్తున్నారని సీఎంఓ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అంతకు ముందు విశాఖ ఫిషింగ్ హార్బర్‌లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన సమాచారం తెలిసిన వెంటనే సీఎం శ్రీ వైయస్.జగన్ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని అధికారులను ఆదేశించారు.