శేరిలింగంపల్లిలో కాంగ్రెస్ ప్రభంజనం స్పష్టంగా కనపడుతోందని శేరిలింగంపల్లి శాసనసభ అభ్యర్థి వాలిదాసు జగదీశ్వర్ గౌడ్ స్పష్టం చేశారు. సమీప భవిష్యత్తులో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. శేరిలింగంపల్లిలోని గచ్చిబౌలి, మాదాపూర్,హఫీజ్ పేట్, కొండాపూర్, ప్రాంతాల నుండి అనేకమంది వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, భారీ సంఖ్యలో జగదీశ్వర్ గౌడ్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీ పథకాలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ ప్రతి కార్యకర్త ఆరు గ్యారెంటీ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. మాదాపూర్, హఫీజ్ పేట్ ప్రాంతాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం జరిగిందని చెప్పారు. మూడుసార్లు కార్పొరేటర్ గా అత్యధిక మెజారిటీతో గెలిచిన అనుభవం తనకుందని జగదీశ్వర్ గుర్తు చేశారు. సిసి రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ పనులు, తాగునీటి సదుపాయం, వీధిలైట్లు వంటి అనేక కనీస సదుపాయాల కల్పనలో తన వంతు కృషి చేశానని తెలిపారు. మూడు పర్యాయాలు చేసిన అభివృద్ధి తో కూడిన అనుభవం తనకుందని చెప్పారు.
ఈసారి కాంగ్రెస్ పార్టీ తరపున తనకు శాసనసభ్యుడిగా అవకాశం కల్పిస్తే శేరిలింగంపల్లి నియోజక వర్గం అంతట అభివృద్ధి కార్యక్రమాలను చేపడతానని హామీ ఇచ్చారు. ప్రస్తుత ఎమ్మెల్యే అనేక ఆరోపణలను ఎదుర్కొంటున్నారని ఆయన విమర్శించారు. మతతత్వ బిజెపి పార్టీ మతాల మధ్య చిచ్చు పెట్టడం తప్ప అభివృద్ధి పట్ల బిజెపికి చిత్తశుద్ధి ఉండదని ఆయన చెప్పారు. శతాబ్ద కాలం ఈ దేశానికి సేవ చేసిన కాంగ్రెస్ పార్టీ దేశం కోసం అనేక త్యాగాలను చేసిందని గుర్తు చేశారు.
మాదాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ లలో తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలను కార్యకర్తలు ప్రజలకు వివరించాలని జగదీశ్వర్ గౌడ్ సూచించారు. రెండు డివిజన్లో తను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజలకు సానుకూల దృక్పథం ఉందని, నియోజకవర్గంలో ప్రజలకు తన పట్ల క్లీన్ చీట్ అభిప్రాయం ఉందని ఆయన గుర్తు చేశారు. తను విద్యాదీకుడు అనే భావం ప్రజల్లో ఉందని, తన పట్ల సదాశయం గల సామాజికవేత్తగా ప్రజల్లో గుర్తింపు ఉందని ఆయన చెప్పారు. ప్రజల్లో తన పట్ల ఉన్న సద్భావమే తనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రఘునాథ్ యాదవ్, శేఖర్ ముదిరాజ్, బాలకృష్ణ, రఘునందన్ రెడ్డి, బాక్సర్ గిరిబాబు, కాటా నరసింహ గౌడ్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.