మధ్యప్రదేశ్‌లో తాజాగా పోలింగ్ ముగిసింది. మొత్తం 76 శాతం పోలింగ్ జరిగింది. డిసెంబర్ మూడో తేదీన ఫలితాలు వెల్లడవుతాయి. అయితే వరుసగా రెండోసారి కూడా గెలుపు తమదే అంటున్నారు కమలనాథులు. దీంతో బీజేపీకి మ్యాజిక్ ఫిగర్ అంటూ వస్తే ముఖ్యమంత్రి ఎవరవుతారన్న ప్రశ్న తెరమీదకు వచ్చింది. ఈ సందర్భంగా అనేక పేర్లు భోపాల్ పొలిటికల్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తున్నాయి. అయితే ఒక పేరు మాత్రం బాగా హైలెట్ అవుతోంది. ఇంతకీ ఆ పేరేమిటి ?
మధ్యప్రదేశ్ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఎవరినీ ప్రకటించ లేదు భారతీయ జనతా పార్టీ. ప్రస్తుతమున్న శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. దీంతో ఒక దశలో శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పక్కన పెట్టాలని కమలం పార్టీ ఢిల్లీ పెద్దలు భావించారు. అయితే ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిని మారిస్తే, అది ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు వరంగా మారుతుందన్న నిర్ణయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో మరోసారి బీజేపీ గెలవడం అంటూ జరిగితే ప్రహ్లాద్ సింగ్ పటేల్ ముఖ్యమంత్రి అవుతారన్న ఊహాగానాలు భోపాల్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇంతకీ ఎవరీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ?
కాబోయే ముఖ్యమంత్రి ఎవరు ? మధ్యప్రదేశ్ బీజేపీ వర్గాల్లో ప్రస్తుతం ఈ ప్రశ్న తెరమీదకు వచ్చింది. వాస్తవానికి మధ్యప్రదేశ్ పోలింగ్ ఇటీవల ముగిసింది. డిసెంబర్ మూడో తేదీన ఫలితాలు వస్తాయి. అయితే ఆలూలేదు చూలూలేదు …కొడుకు పేరు సోమలింగం అన్నట్లుంది మధ్యప్రదేశ్ కమలదళం పరిస్థితి. మధ్యప్రదేశ్‌కు ఒక ప్రత్యేకత ఉంది. అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది ఒక్క మధ్యప్రదేశ్‌లోనే. దీంతో ఇక్కడ గెలవడం భారతీయ జనతా పార్టీకి ప్రతిష్టాత్మకంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ సర్కార్‌పై కొంతకాలంగా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. ఇదొక్కటే కాదు అనేక రంగాల్లో చౌహాన్ సర్కార్ పనితీరుపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మధ్యప్రదేశ్ పర్యటనల సందర్భంగా ప్రజలతో జరిపిన ముఖాముఖి కార్యక్రమాల్లో ఈ విషయం వెల్లడైంది. చౌహాన్ సర్కార్‌పై ఉన్న అసంతృప్తిని బీజేపీ అధిష్టానం ఇదివరకే గుర్తించింది. దీంతో ఈ అసంతృప్తికి చెక్ పెట్టడానికి వ్యూహాత్మకంగా ముగ్గురు కేంద్ర మంత్రులు సహా మొత్తం ఏడుగురు లోక్‌సభ సభ్యులను అసెంబ్లీ బరిలోకి దించింది. ఇందులో భాగంగానే కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయ మంత్రి ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను కూడా పోటీకి నిలబెట్టింది బీజేపీ అగ్ర నాయకత్వం. దీంతో ఈసారి నర్సింగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పోటీకి సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో స్వల్ప ఉద్రిక్తతల నడుమ మొత్తం 230 నియోజకవర్గాల్లోనూ పోలింగ్ పూర్తయింది. అయితే పోలింగ్ పూర్తయిన వెంటనే రెండోసారి కూడా విజయం తమదేనని లెక్కలు వేసుకున్నారు కమలనాథులు. కథ అక్కడితో ఆగలేదు. భారతీయ జనతా పార్టీ గెలిస్తే ముఖ్యమంత్రి ఎవరన్న ప్రశ్న చర్చకు వచ్చింది. దీంతో ప్రహ్లాద్ సింగ్ పటేల్ పేరు మధ్యప్రదేశ్ రాజకీయ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది.
ఎవరీ ప్రహ్లాద్ సింగ్ పటేల్ ?
ప్రహ్లాద్ సింగ్ పటేల్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని దమోహ్ నియోజకవర్గానికి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎన్నికల్లో గెలుపు అవకాశాలను మెరుగుపరచుకోవడానికి తాజాగా ఎంపీలను అసెంబ్లీ ఎన్నికల బరిలో వ్యూహాన్ని భారతీయ జనతా పార్టీ అమలు చేసింది. ఇందులో భాగంగానే ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ను శాసనసభ ఎన్నికల్లో నిలిపింది కమలదళం అధిష్టానం. నర్సింగ్‌పూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రహ్లాద్ సింగ్ పటేల్ పోటీ చేశారు. ప్రహ్లాద్ సింగ్ పటేల్ గెలుపుపై ధీమాగా ఉన్నాయి బీజేపీ వర్గాలు.
మధ్యప్రదేశ్ ఎన్నికలకు ముఖ్యమంత్రి అభ్యర్థి అంటూ ఎవరినీ భారతీయ జనతా పార్టీ ప్రకటించ లేదు. ప్రస్తుతమున్న శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వంపై తీవ్ర అవినీతి ఆరోపణలున్నాయి. దీంతో ఒకదశలో శివరాజ్ సింగ్ చౌహాన్‌ను పక్కన పెట్టాలని కమలం పార్టీ ఢిల్లీ పెద్దలు భావించారు. అయితే ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిని మారిస్తే, అది ప్రతిపక్షమైన కాంగ్రెస్‌కు వరంగా మారుతుందన్న నిర్ణయానికి వచ్చింది. దీంతో ముఖ్యమంత్రిగా శివరాజ్ సింగ్ చౌహాన్‌నే కొనసాగించింది కమలదళం అధిష్టానం. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌లో మరోసారి బీజేపీ గెలవడం అంటూ జరిగితే ప్రహ్లాద్ సింగ్ పటేల్ ముఖ్యమంత్రి అవుతారన్న ఊహాగానాలు భోపాల్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.
ప్రహ్లాద్ సింగ్‌ది పొలిటికల్‌గా లాంగ్ ఇన్నింగ్స్ !
ప్రహ్లాద్ సింగ్ పటేల్‌ది పొలిటికల్‌గా లాంగ్ ఇన్నింగ్స్. వృత్తిరీత్యా అడ్వకేట్ అయిన ప్రహ్లాద్ సింగ్ 80ల్లో బీజేపీతో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. 1989లో తొలిసారి కమలం పార్టీ టికెట్‌పై లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఆ తరువాత ఆయన ఇక రాజకీయంగా వెనుతిరిగి చూసుకోలేదు. 1996,1999,2014 లోక్‌సభ ఎన్నికల్లో గెలుపొందారు. 2019లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించి ఐదోసారి లోక్‌సభలోకి ప్రవేశించారు. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని దమోహ్ నియోజకవర్గానికి ప్రహ్లాద్ సింగ్ లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రహ్లాద్ సింగ్ పటేల్ గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి మంత్రివర్గంలోనూ పనిచేశారు. వాజ్‌పేయి క్యాబినెట్‌లో బొగ్గు శాఖ సహాయమంత్రిగా ప్రహ్లాద్ సింగ్ పనిచేశారు. ప్రస్తుతం నరేంద్ర మోడీ క్యాబినెట్‌లో ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయమంత్రిగా ప్రహ్లాద్ సింగ్ పటేల్ ఉన్నారు. ఏ సమస్య వచ్చినా పరిష్కారం కనుగొనడానికి ప్రహ్లాద్ సింగ్ చొరవ చూపుతారన్న పేరు ఆయనకు ఉంది. టాస్క్ మాస్టర్‌గా నరేంద్ర మోడీ- అమిత్ షా ద్వయం దగ్గర ప్రహ్లాద్ సింగ్ పటేల్ మార్కులు కొట్టేశారు. లోథి రాజ్‌పుత్ సామాజికవర్గానికి చెందిన నాయకుడు కావడం ప్రహ్లాద్ సింగ్ పొలిటికల్ కెరీర్‌కు ప్లస్ పాయింట్‌గా మారింది. లోథి రాజ్‌పుత్‌లు ఓబీసీ జాబితాలో ఉన్నారు. ఏమైనా మధ్యప్రదేశ్ ఎన్నికల్లో మరోసారి బీజేపీ గెలవటం అంటూ జరిగితే ప్రహ్లాద్ సింగ్ పటేల్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రహ్లాద్ సింగ్ ముఖ్యమంత్రి అయితే ఓబీసీకి సీఎం పోస్టు ఇచ్చిన ఘనత తమదేనని కమలనాథులు చెప్పుకోవచ్చు. వచ్చే ఏడాది దాదాపుగా మార్చి నెలలో జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓబీసీకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చామని ప్రచారంలో చెప్పుకుని రాజకీయంగా లాభపడవచ్చన్నది బీజేపీ అగ్ర నాయకత్వం ఆలోచనగా కనిపిస్తోంది.
-ఎస్. అబ్దుల్ ఖాలిక్, సీనియర్ జర్నలిస్ట్, 63001 74320