స్థానికులకు ప్రైవేట్ రంగంలో 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏ విధంగా చూసినా తప్పటడుగేనని చెప్పవచ్చు. ప్రైవేట్ రంగంలో రూ. 30,000 నెలసరి జీతాలకు తక్కువ ఉన్న ఉద్యోగాల్లో స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ హర్యానా ప్రభుత్వం ఇటీవల చేసిన ఒక చట్టాన్ని సుప్రీంకోర్టు కొట్టేసి దేశానికి అపారమైన మేలు చేసింది. కేవలం స్థానికుల ఓట్లను చేజిక్కించుకునే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన హర్యానా ఉద్యోగాలు, స్థానిక అభ్యర్థుల చట్టం (2020) ఏమాత్రం చెల్లదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇటువంటి చట్టాన్ని చేసే అధికారం హర్యానా ప్రభుత్వానికి లేదని, ప్రైవేట్ రంగాలు బహిరంగ మార్కెట్లో అభ్యర్థులను లేదా ఉద్యోగులను ఎంపిక చేసుకునే అవకాశం లేకుండా చేసే ఇటువంటి చట్టాన్ని రూపొందించడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 కింద లభించిన సమానత్వానికి, ఆర్టికల్ 19 కింద లభించిన స్వేచ్ఛకు ఇది పూర్తిగా విరుద్ధమని సుప్రీంకోర్టు తన తీర్పులో వ్యాఖ్యానించింది.
స్థానికులకు 75 శాతం రిజర్వేషన్లు కల్పించడం వల్ల దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలకు తీరని అన్యాయం జరుగుతుందని, ఇతర ప్రజల హక్కులను కాలరాసినట్టవుతుందని కోర్టు స్పష్టం చేసింది. ఇతర రాష్ట్రాలు కూడా ఇటువంటి చట్టాలను ప్రవేశపెట్టే పక్షంలో దేశవ్యాప్తంగా కృత్రిమ గోడలను సృష్టించినట్టవుతుందని కూడా సుప్రీంకోర్టు హెచ్చరించింది. ఉద్యోగులు, కార్మికులు దేశంలో ఎక్కడైనా ఉద్యోగం సంపాదించుకునే ప్రాథమిక హక్కుకు ఇది భంగకరమని కోర్టు నొక్కి చెప్పింది. ప్రైవేట్ రంగాల యజమానులు కూడా ‘ఇన్ స్పెక్టర్ రాజ్’ రోజుల్లో మాదిరిగా వ్యవహరిం చాలని హర్యానా కోరుకుంటున్నట్టుగా కనిపిస్తోందని అది వ్యాఖ్యానించింది. దేశ కాల పరిస్థితులు మారుతున్న ఈ రోజుల్లో హర్యానా ఇంత సంకుచిత చట్టాన్ని రూపొందించడంలో అర్థం లేదని అది విమర్శించింది.
నిజానికి గతంలో ఆంధ్రప్రదేశ్, జార్ఖ్‌ండ రాష్ట్రాలు కూడా ఇటువంటి చట్టాలను తీసుకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2019లో ఇటువంటి బిల్లును ఆమోదించినప్పుడు, రాష్ట్ర హైకోర్టు దీన్ని ‘రాజ్యాంగవిరుద్ధమైన చట్టం’గా అభివర్ణించింది. అయితే, ఆ చట్టం మీద పూర్తి స్థాయి తీర్పు ఇంకా వెలువడాల్సి ఉంది. కార్మికులు, ఉద్యోగులు తమ నైపుణ్యాలకు, ప్రతిభకు తగ్గట్టుగా ఇతర రాష్ట్రా లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకునే హక్కు ఉండాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇతర రాష్ట్రా లకు వెళ్లి తాము కోరుకున్న, తాము ఆశించిన ఉద్యోగాలను సంపాదించుకోవడానికి అభ్యర్థులకు అవకాశాలు లేకుండా చేయడం, ఉద్యోగాలను ఎంపిక చేసుకునే స్వేచ్ఛను అభ్యర్థులకు లేకుండా చేయడం పూర్తిగా న్యాయవిరుద్ధం అనడంలో సందేహం లేదు. దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఉద్యోగావ కాశాలు ఎక్కువగా ఉండడం, మరికొన్ని రాష్ట్రాలలో ఈ అవకాశాలు తక్కువగా ఉండడం వల్ల అభ్యర్థుల ప్రాథమిక హక్కుకు భంగం వాటిల్లే పనేదీ చేయకూడదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థను ఎంతగానో ప్రభావితం చేస్తుంది.
ఇటువంటి చట్టాలు దేశంలో అనేక సమస్యలు సృష్టించే అవకాశం ఉంది. అందువల్ల ఇటువంటివి తప్పకుండా రాజ్యాంగవిరుద్ధమే అవుతాయి. ఏటా లక్షలాది మంది కార్మికులు, కూలీలు ఇతర రాష్ట్రాలకు ఉపాధి కోసం వలస వెళ్లడం జరుగుతోంది. వారికి అక్కడి ప్రభు త్వాలు రక్షణ కల్పించడం కూడా ఆనవాయితీ అయిపోయింది. ఇతర ప్రాంతాలకు చెందిన కార్మికులను, కూలీలను తక్కువ జీతాలతో ఎక్కువ పని చేయించుకోవడం అన్నది కొన్ని ప్రైవేట్ రంగ యాజమాన్యాల్లో ఎక్కువగానే జరుగుతున్నప్పటికీ, ఆయా ప్రభుత్వాల సంక్షేమ కార్యక్రమాలు, పథకాల కారణంగా ఈ పరిస్థితిలో క్రమంగా మార్పు చోటు చేసుకుంటోంది. స్థానిక కార్మికులతో సమానంగా జీత భత్యాల విషయంలో బేరసారాలు చేసుకోవడానికి స్థానికేతర కార్మికులకు కూడా అవకాశం ఉంటోంది. ప్రభుత్వాలు స్థానిక, స్థానికేతర కార్మికుల మధ్య సమానత్వం తీసుకు రావడానికి మరిన్ని చట్టాలు రూపొందించాల్సిన ప్రస్తుత సమయంలో స్థానికులకు 75 శాతం ఉద్యోగాలు ఇవ్వాలని ప్రైవేట్ రంగాన్ని శాసించడంలో అర్థం లేదని న్యాయస్థానాలు భావిస్తున్నాయి. కార్మికులు విభిన్న రాష్ట్రాలకు చెందినవారైనప్పటికీ దేశవ్యాప్తంగా వారందరికీ ఒకే విధమైన హక్కులు, ఒకే విధమైన చట్టాలు ఉండాలని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నించాలని హైకోర్టులు స్పష్టం చేశాయి.
Haryana mistake: హర్యానా తప్పటడుగు
75 % ఉద్యోగాలు ఇవ్వాలని ప్రైవేట్ రంగాన్ని శాసించడంలో అర్థం లేదh