ముత్యాలాంటి చిరునవ్వుకు ఇవి చేటా…
టీ…లేదా కాఫీ… ఏది మీ దంతాలను మెరిపిస్తుంది? మరకలు పడనివ్వదు? ఈ రెండింటిలో దంతాల ఆరోగ్యానికి ఏది మంచిది? ఇవి తెలుసుకోవాలనుందా? చాలామంది టీ అయినా…కాఫీ అయినా తాగడానికి వెనుకంజ వేసేది అవి దంతాల మీద పసుపు పచ్చని మరకల్ని ఏర్పరుస్తాయనే. అది తమ తెల్లటి చిరునవ్వు అందాన్ని చెడగొడుతుందని సందేహిస్తుంటారు.
కాఫీ రంగు చిక్కగా ఉంటుంది. అందుకే కాఫీ వల్ల దంతాలపై మరకలు బాగా పడతాయనే పేరుంది. ఫలితంగా దంతాల ఎనామిల్ దెబ్బతింటుంది. అంతేకాదు దీర్ఘకాలంలో పండ్లు తమ సహజ మెరుపును కోల్పోయి పచ్చగా మారతాయి.
టీ తాగినా కూడా ఇలాంటి మచ్చలు దంతాలపై పడతాయి కానీ కాఫీ అంత ముదురుగా అయితే టీ తాలూకూ మరకలు దంతాలపై ఏర్పడవు. సింపుల్ గా చెప్పాలంటే కాఫీ కన్నా టీ మైల్డర్ స్టైనింగ్ ఏజెంట్ అనమాట. దంతాలపై ఉండే ఎనామిల్ మీద సూక్ష్మమైన రంధ్రాలుంటాయి. దీంతో ఎనామిల్ నిర్మాణం దెబ్బతింటుంది. దంతాల ఎనామిల్ పై కనిపించని మచ్చలు ఏర్పడతాయి. మచ్చల తీవ్రత అనేది మీరు ఎలాంటి టీ లేదా కాఫీ తాగుతున్నారన్నదానిపై ఆధారపడి ఉంటుంది. అలాగే ఎంత తరచుగా టీ లేదా కాఫీలను తాగుతారన్న దానిపైన, నోటి పరిశుభ్రతను మీరు ఎంతగా పాటిస్తున్నారన్నదానిపైన కూడా ఇది ఆధారపడి ఉంది. దంతాలపై మచ్చలు పడతాయి కాబట్టి ఇక టీ, కాఫీలకు చెల్లు చీటి చెప్పాల్సిందేనా అని ఆవేదన చెందనవసరం లేదు.
టూత్ వైటనింగ్ ట్రీట్మెంట్లు కూడా ఇపుడు ఉన్నాయి. ఈ టీ , కాఫీలు ఎసిడిక్ స్వభావం ఉన్న డ్రింకులు. ఇవి మెల్ల మెల్లగా దంతాల ఎనామిల్ ను దెబ్బతీస్తాయి. ఎనామిల్ బలహీనపడితే దంతాలపై మచ్చలు
తొందరగా ఏర్పడతాయి. అంతేకాదు దంతాల సెన్సిటివిటీ దెబ్బతినడంతో పాటు దంతక్షయం కూడా సంభవిస్తుంది. కాఫీలో పిహెచ్ తక్కువ కూడా. అందుకే టీ కన్నా కాఫీ ఎక్కువ ఎసిడిక్ స్వభావాన్ని కలిగి ఉంటుంది. వీటికి షుగర్ చేరిస్తే ఎసిడిటీ మరింత పెరుగుతుంది. దంతాల ఆరోగ్యం గురించి ఆలోచిస్తుంటే మాత్రం చక్కెర, స్వీట్నర్స్ , ఫ్లేవర్లు లేకుండా టీ లేదా కాఫీని తాగితే మంచిదని దంత నిపుణులు అంటున్నారు.